|
|
Articles: Devotion | కార్తీక పురాణం - Site Administrator
| |
16వ అధ్యాయము
స్తంభ దీప ప్రశంస
వశిష్ఠుడు ఇలా చెప్పసాగెను...
ఓ రాజా! కార్తీక మాసము దామోదరునికి అత్యంత ఇష్టమైన మాసము. ఈనెలలో స్నాన, దాన, వ్రతాలను చేస్తూ సాలగ్రామ దానం చేస్తే చాలా మంచిది. ఎవరు కార్తీక మాసములో తనకు శక్తి ఉన్నా దానం చేయరో అలాంటివారు రౌరవాది నరకబాధలు అనుభవిస్తారు. ఈ నెల రోజులూ తాంబూలం దానం చేసినవారు చక్రవర్తిగా పుడ్తారు. అంతేకాక తులసికోటవద్ద కానీ, దేవాలయంలో గానీ, ఇంటివద్ద గానీ దీపారాధన చేస్తే అన్ని పాపాలూ పోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీస్నానం చేసి, భగవంతుని సన్నిధిలో ధూప, దీప, నైవేద్యాలను స్వామికి సమర్పించి, దక్షిణ తాంబూలాలతో పళ్ళు దానం చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారికి సంతాన నష్టం జరగదు. పుట్టిన పిల్లలు చిరంజీవులై ఆరోగ్యంతో ఉంటారు.
ఈనెలలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపాన్ని ఉంచినవారు వైకుంఠములో సకల భోగములు అనుభవిస్తారు. కార్తీక మాసమంతా ఆకాశదీపముగానీ, స్తంభముమీద దీపాన్ని ఉంచినా, లేక నమస్కరించిన స్త్రీ, పురుషులకు సకలైశ్వర్యములు పొంది ఎంతో ఆనందంగా ఉంటారు. ఆకాశ దీపం పెట్టువారు ధాన్యము గాని, నువ్వులు గాని పోసి దానిపై ప్రమిద పెట్టి వత్తులు వేసి వెలిగించాలి. దీపాన్ని పెట్టగల శక్తి ఉండీ దీపము పెట్టనివారు, లేక దీపం పెట్టువారిని ఎగతాళి చేసేవారు చుంచు జన్మెత్తుతారు. ఇందులకు ఒక కథ చెప్తాను వినమనెను.
దీపస్తంభము విప్రుడగుట
ఋషులలో అగ్రగణ్యుడు, పేరుపొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని... దానికి దగ్గరలో విష్ణు మందిరాన్ని నిర్మించుకొని నిత్యం పూజ చేస్తుండేవాడు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టు పక్కల మునులు కూడా వచ్చి భక్తితో పూజలు చేసేవారు. వారు ప్రతిరోజూ ఆలయద్వారాలపై దీపాలు వెలిగించి ఎంతో భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళేవారు.
ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు మిగిలిన మునులను చూసి 'ఓ సిద్ధులారా! కార్తీక మాసములో హరిహదాల ప్రీతి కొరకు దీప స్తంభము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకు తెలిసిన విషయమే కదా! కాబట్టి రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి, దానిపై దీపము పెట్టుదుము. కాబట్టి దాని కోసం మనం అడవికి వెళ్దాం అనగానే మిగిలినవారు సరేననడం'తో అందరూ కలసి అడవికి వెళ్ళెను.
వారు అడవికి వెళ్ళి చిలువలు, పలువలు లేని ఒక చెట్టును మొదలంటూ నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పెట్టి దానిపై ధాన్యము ఉంచి ఆవునేతితో నింపిన ఒక పాత్రలో వత్తివేసి దీపాన్ని వెలిగించిరి. తదుపరి వారందరూ కూర్చుని పురాణాన్ని చదువుతుండగా ఫెళఫెళమని శబ్దము వినిపించి, అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి, దీపము ఆరిపోయి చెల్లా చెదురుగా పడెను. ఆ దృశ్యము చూసి వారందరూ ఎంతో ఆశ్చర్యంతో నిలబడ్డారు. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని చూసి ఓయీ! నీవు ఎవరవు? నీవీ స్తంభమునుండి ఎలా వచ్చితివి? నీ చరిత్ర ఏమిటని ప్రశ్నించెను.
అప్పుడు ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి 'పుణ్యాత్ములారా! నేను కిందట జన్మలో జమిందారుడైన బ్రాహ్మణుడును. నా పేరు ధనలోభుడు. నాకు చాలా సంపద ఉండటం వల్ల మంచీచెడూ తెలీక, న్యాయన్యాయాలు మరచి జావించేవాడిని. చెడు స్నేహాలు చేస్తూ వేదములను చదువక, శ్రీహరిని పూజింపక, దానధర్మాలు చేసేవాడిని కాదు. నేను నా పరివారంతో కూర్చున్న సమయంలో ఏ విప్రుడైనా వచ్చి నన్ను సహాయం చేయమని అడిగితే నా కాళ్ళు కడిగించి, ఆ నీళ్ళు నెత్తిన జల్లుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపించే'వాడిని.
నేను ఉన్నతాసనంపై కూర్చుని, అతిథులను నేలపై కూర్చోమని చెప్పేవాడిని. స్త్రీలను, పసిపిల్లలను హీనంగా చూసేవాడిని. అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్ను ఎవరూ మందలించేవారు కాదు. ఇలా నేను చేయు పాపకార్యాలకు అంతు లేకుండా పోయేది. దానధర్మాలు ఎలాంటివో నాకు తెలియదు. ఇంత దుర్మార్గుడనై, పాపినై అవసాన దశలో చనిపోయిన పిదప ఘెర నరకములు అనుభవించి, లక్ష జన్మల యందు కుక్కనై, పదివేల జన్మలు కాకినై, ఐదువేల జన్మలు తొండనై, ఐదువేల జన్మలు పేడపురుగునై తరువాత వృక్షజన్మమెత్తి కీకారణ్యమునందు ఉండి కూడా నేను చేసిన పాపాలు పోగొట్టుకోలేకపోయాను. ఇన్నాళ్ళకు మీ దయవల్ల స్తంభముగా ఉన్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నియూ మీకు చెప్పాను. నన్ను మన్నించమని వేడుకొనెను.
ఆ మాటలు విన్న మునులందరూ అమితాశ్చర్యము చెంది 'ఆహా! కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అంతేకాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణించలేనిది. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ముందే ముక్తిని పొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశదీపముంచిన మనిషికి వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తికలిగినది' అని మునులు అనుకొంటున్నప్పుడు ఆ పురుషుడు ఆ మాటలు విని 'ముని పుంగవులారా! నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగములో అందరికీ ఎలా కర్మ బంధము కలుగుతుంది? అది నశించడం ఎలా?' నా సంశయాలను తీర్చమని ప్రార్ధించెను.
అక్కడ ఉన్న మునీశ్వరులు తమలో ఒకరగు అంగీరస మునితో 'స్వామీ! మీరే అతని ప్రశ్నలకు సమాధానం చెప్పగల సమర్థులు. కాబట్టి వివరించమని కోరిరి. అంత అంగీరసుడు ఇలా చెప్పసాగెను'.
షోడశాధ్యాయము పదహారో రోజు పారాయణం సమాప్తం
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|