|
|
Articles: Devotion | కార్తీక పురాణం - Site Administrator
| |
18వ అధ్యాయం
ధనలోభికి అంగీరసుని బోధ
ఓ మహర్షీ! మీ దర్శనం వల్ల ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేశారు. ఈ రోజు నుండి నేను మీ శిష్యుడను. తల్లీ తండ్రీ, గురువు, దైవము అన్నీ మీరే. నా పూర్వ పుణ్యఫలం వల్లనే కదా మీవంటి పుణ్యపురుషుల దర్శనం లభించింది. మీ దర్శన భాగ్యములేనిచో ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలోనే ఉండవలసిందే కదా! అలాంటి నేనెక్కడా! మీ దర్శనభాగ్యమెక్కడ! నాకు సద్గతి ఎక్కడ? పుణ్యఫల ప్రదమగు ఈ కార్తీక మాసమెక్కడ? ఇదంతయూ దైవసంకల్పం తప్ప మరొకటి కాదు. కాబట్టి నన్ను మీ శిష్యునిగా స్వీకరించి మంచిపనుల మానవుడు ఏ విధంగా ఆచరించాలో, దాని ఫలమేమిటో వివరించమని ప్రార్థించెను.
ఓ ధనలోభా! నీవు అడిగిన ప్రశ్నలు అన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగపడేవే. కాబట్టి వివరించెదను శ్రద్ధగా వినుము. ప్రతి మనిషి ఈ శరీరమే శాశ్వతమని నమ్మి జ్ఞాన శూన్యుడు అగుచున్నాడు. భేదము శరీరానికే గానీ ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలగాలంటే సత్కర్మలను చేయాలని అన్ని శాస్త్రములు చెప్పుచున్నవి. సత్కర్మ నాచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరునికి అర్పించినచో జ్ఞానము కలుగుతుంది. మానవుడు ఏ జాతివాడో, యెటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుకొని అటువంటి వాటిని ఆచరించాలి.
బ్రహ్మణుడు అరుణోదయ స్నానము చేయక, సత్కర్మలను ఆచరించినా వ్యర్థమగును. అలానే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా, వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా, మాఘ మాసంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించుచుండగా... అనగా ఈ మూడు నెలలోనైనా తప్పక నదిలో ప్రాత:కాల స్నానం చేయాలి. అలా స్నానాలు చేసి, భవగంతుడుని పూజించినచో వైకుంఠ ప్రాప్తి కలగుతుంది. సూర్య, చంద్రగ్రహణ సమయాలలో తదితర పుణ్యదినములందూ స్నానము చేయవచ్చును. ప్రాత:కాలంలో స్నానం చేసినవారు సంధ్యావందనము, సూర్య నమస్కారాలు చేయవలెను. అలా చేయనివారు భ్రష్టుడగును. కార్తీక మాసములో అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును.
కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా, గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియూ, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుకొనుడు. కార్తీక మాసమందు తప్పకుండా స్నానాదులు చేసినవారు కోటి యాగములు చేసిన ఫలము పొంది వైకుంఠమునకు వెళ్తారు అని అంగీరసుడు చెప్పగా విని ధనలోభుడు ఇలా ప్రశ్నించెను.
ఓ మునిశ్రేష్టా! చాతుర్మాస వ్రమతని చెప్పారు కదా... ఏ కారణం వల్ల దానిని ఆచరించాలి? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమిటి? విధానం ఏమిటి? అన్నీ వివరించమని కోరెను. అందులకు అంగీరసుడు ఇలా చెప్పెను...
ఓ ధనలోభా వినుము... చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రములో శేషుడు పాన్పుగా నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొనును. ఆ నాలుగు నెలలకే చాతుర్మాసమని పేరు. ఈ నాలుగు నెలల్లో శ్రీహరి ప్రీతికొరకు స్నాన, దాన, జపతపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగుతుంది. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు ద్వారా తెలుకొంటిని కాబట్టి ఆ సంగతులను మీకు తెలియజేయుచున్నాను.
మొదట వైకుంఠమునందు గరుడగంధర్వులు, దేవతలు, వేదాలచే సేవింబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై ఉండగా నారదమహర్షి వచ్చి నమస్కరిస్తాడు. కుశల ప్రశ్నలు అయిన పిదప శ్రీహరి నారదమహర్షిని లోకమంతా ఎలా ఉందని ప్రశ్నిస్తాడు. అప్పుడు నారదుడు శ్రీహరికి, ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా! నీకు తెలియని విషయాలంటూ ఈ సృష్టిలో ఏమున్నాయి. అయినా నన్ను చెప్పమనడంలో నీ గొప్పదనం అర్థమవుతోంది. ఈ ప్రపంచంలో సాధుపుంగవులు, మానవులు కూడా వారికి విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. మరికొందరు భుజింపకూడదని పదార్థాలను భూజిస్తున్నారు. మరికొందరు పుణ్యవ్రతాలు చేస్తూ కూడా మధ్యలో వాటిని ఆపేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార పూరితులై పరులను నిందిస్తూ ఇష్టం వచ్చినట్లు జీవనం సాగిస్తున్నారు. మరి వీరంతా ఎలా ముక్తి పొందుతారో నాకు తెలియడం లేదని మహర్షి ఆవేదన చెందుతాడు. వీరందరినీ ఉద్ధరించేందుకు తగిన మార్గం ఉపదేశించమని అర్ధిస్తాడు.
అందుకా జగన్నాటక సూత్రధారి శ్రీ మహావిష్ణువు కలవరపడి లక్ష్మీదేవితో పాటు, గరుడ, గంధర్వాది దేవతలతో మునులు ఎక్కువగా ఉండే ప్రదేశానికి వచ్చి వృద్ధ బ్రాహ్మణ రూపంలో తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ లోకంలోని సకల జీవుల్ని పరిశీలిస్తూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు, పుణ్యాశ్రమాలు ఇలా అన్ని చోట్ల తిరుగుతుంటాడు. ఈ విధంగా తిరుగుతున్న భగవంతుడిని చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేసేవారు. మరికొందరు ఈ ముసలివాడితో మనకేమి పని అని వారు ఎదురుగానే తప్పుకుతిరిగేవారు, మరి కొందరు అసలు ఈయనవంకే చూసేవారు కాదు. వారందరినీ చూస్తూ ఈ మనుజులను ఎలా తరింపచేయాలి అని ఆలోచిస్తాడు శ్రీహరి. ఈ విధంగా ఆలోచిస్తూనే ఓ రోజు శ్రీహరి నిజరూపంలో లక్ష్మీదేవితో సహా సకల దేవతాగణంతోనూ కలిసి నైమిశారణ్యముకు వెడతాడు.
ఆ వనమందు తపస్సు చేసుకొంటున్న మునులు స్వయంగా తమ ఆశ్రమాలకు వచ్చిన శ్రీహరిని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి, లక్ష్మీనారాయణలను పరిపరి విధాలుగా స్తోత్రాలు చేస్తారు.
అష్టాదశాధ్యాయము పదునెనిమిదో రోజు పారాయణం సమాప్తం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|