|
|
Articles: TP Features | నాయకులను నిలదీయాలి - Dr. Ramesh Babu Samala
| |
కోస్తా తీరంలో ఇటు చెన్నై నుంచి, అటు వైజాగ్ నుంచీ నడిచే రైళ్లలో కాఫీ, టీ వగైరా ఆహారాన్ని అమ్మే ఉద్యోగులంతా బీహార్ వాళ్లే. అంతా తెలుగు ప్రాంతమే అయినా, ఎన్నేళ్లు గడిచినా వాళ్లు తెలుగు మాట్లాడరు. అలా సాగిపోతూనే ఉంది. ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో కొద్ది సంవత్సరాలుగా పెట్టిన ఆధునిక హోటళ్ల వాళ్లంతా ఉత్తర భారత దేశీయులే. వాళ్లు హిందీలోనో మరో భాషలోనో మాట్లాడతారు తప్ప ఎన్నేళ్ళు పోయినా తెలుగు నేర్చుకోరు.
దోమల మందు చుట్టలు (కాయిల్స్) ఆంధ్రప్రదేశ్ లో తయారయినా తెలుగు తప్ప తక్కిన భాషలన్నీ దాని అట్టపెట్టె మీద ఉంటాయి. గోడ్రెజ్ కంపెనీ తయారుచేసే 'జెట్' బ్రాండు దోమచుట్టల పెట్టెపైన వివరాలు ఇంగ్లీష్, హిందీ, తమిళాల్లోనే ఉంటాయి. అది తయారయ్యే ఫ్యాక్టరీ మాత్రం మన మెదక్ లోనే. ఇక్కడ గమనించవలసిన మరో విచిత్రమేమిటంటే ఇంగ్లీష్, హిందీలతో నెట్టుకొచ్చే వాళ్లంతా ఇప్పుడు తప్పనిసరిగా తమిళాన్ని కూడా ఉపయోగించడం. నిరంతర ప్రయత్నాల వల్లా, పోరాటాల వల్లా తమిళానికి ఆ స్థానం దక్కుతున్నది.
మరి మనం ఏం చేస్తున్నాం? ఎలా ఆలోచిస్తున్నాం? ఎవరితో పోల్చినా ఏ రంగంలోనైనా తెలుగువారి శక్తిసామర్ధ్యాలకు లోటులేదు. ఎక్కడ చూసినా తెలుగువాడు కన్పిస్తాడు. అయితే తెలుగువారు ఒక భాషా జాతిగా గాక, విడివిడిగా వ్యక్తుల్లాగా పరిగణింపబడతారు, వాళ్లు అలా ప్రవర్తిస్తారు గనుక. తమదైన 'తనాన్ని' తామే మరచి వ్యవహరిస్తారు గనుక. ఇందుకెన్ని ఉదాహరణలైనా ఇవ్వవచ్చు. మరి, తమను తాము అభిమానించుకోలేని వారితో ఇతరులెలా వ్యవహరిస్తారు? దేశంలోనే పెద్దభాష అయినా, విలువలేని భాషగా చేసుకున్నాం.
ఈ పరిస్థితుల్లో స్వాభిమాన ఉద్యమం - తెలుగు ఆత్మగౌరవ ఉద్యమం - అన్ని స్థాయిల్లో ప్రారంభం కావాలి. తెలుగువారికి, తెలుగువారి అవసరాలకు వ్యతిరేకంగా గాని, అవమానకరంగా గాని, పట్టించుకోని విధంగా గాని ఎక్కడ ఏం జరిగినా, తెలుగు సంఘాలు, పెద్దలు స్పందించాలి. పరిస్థితికి తగ్గట్లు గట్టిగా వ్యవహరించాలి. ఈ విషయంలో కూడా మన పార్టీలు పక్షపాత వ్యాధితో బాధపడుతున్నాయి. ఇందుకు వాళ్లు తేలిగ్గా చెప్పే సమాధానం ఏమిటంటే - ప్రజలు కోరినట్లే వ్యవహరిస్తాం, ప్రజలు కోరనిదే మేం ఏమి చేయగలం? అంటారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|