|
|
Articles: TP Features | తెలుగునాడు - రేడు - Editor
| |
వడమలై, నెడియోన్ మలై, వడవేంగడం ఇత్యాది పేర్లతో పేర్కొనబడుతున్న నేటి వేంకటాద్రికి ఉత్తరాన ఉన్న నేల గురించిన ప్రస్తావనల్లో మచ్చుకి కొన్ని...
నాయకుడు దేశాంతరం వెళ్లాడు. నాయిక విరహవేదన అనుభవిస్తోంది. దూరాన ఉన్న ప్రియుణ్ణి కనులారా చూసే కలిమి లేక పరితపిస్తోంది. ఆమె చెలి ఆమెను ఊరడిస్తున్నది. 'చెలీ! నీ ప్రియుడు వెళ్ళిన చోట సుఖంగానే ఉన్నాడు. ఏనుగులకు పోరుకు శిక్షణనిచ్చేది, ఈ వేంకటమల దాపుల్లోనే! ఇక్కడ శిక్షణ పొందే ఏనుగులను గెలవటం సులభం కాదు. మరి ఈ చోటంటావా తెల్లని చల్లని నీరున్న జలపాతాలు దూకే చోటు. ఆ తుంపరలు తూలే చోటంతా పచ్చదనం. ఇదీ తొండైమండలంలో భాగమే. నీ నాయకుడు వెళ్ళిన ఊరు ఈ కొండలకు ఆవల ఉంది. త్వరలో పని ముగించుకొని వస్తాడు. ఎదురుచూడు. అధైర్యపడకు (అగ-213), ఆ చెలుల సంభాషణలో కన్పిస్తున్న తొండైమండలంలో నేటి చిత్తూరు, నెల్లూరు జిల్లాలు కలిసిపోయాయి. అది ఉత్తర ఆర్కాడు జిల్లాలోని ప్రాంతం, తెలుగునాడు. ఆనాడు మనం భుక్తి కోసమో, చదువు కోసమో, శిక్షణ కోసమో ఏదో ఒకటి కోరి వచ్చేవారని తెలుస్తూనే ఉంది కదా! మరి ఆనాడు ఏలుతున్న రేడు ఎవరో, ఏమిటో ఆ సాహిత్యం పేర్కొనకపోయినా వెతుక్కోవలసిన అవసరం మనకు లేదా?
తెలుగునాడును ఏలిన రేడులుగా మనకు పుల్లి, అదియమాన్ లిద్దరు అగుపిస్తున్నారు. పుల్లి రాజ్యం వేంగడం ఉత్తరాన ఉంది. అది చోడుల తొండై మండలంలోనిది. ఈ పుల్లి వీరగుణం, దానగుణం కలవాడు. (పుఱ - 385) ఈ పుల్లి రాజ్యం గురించీ, రాజు గురించీ మనకు ఏమీ తెలయదు. కారణం ఏమిటి? ఈ రాజు ఆటవికుల రేడు. వాళ్ళ భాష తమిళం కాదు, వేరేది. అప్పట్లో గిరిజన రాజ్యాలుండేవి. ప్రతి చిన్న రాజ్యం కొండల్లోనో, అడవుల్లోనే ఉండేది. ఆ రాజులకూ, అక్కడి నేలకూ ఒక పాట ఒక కులపురాణం ఎన్నో ఉండేవి. వాటి అవసరం కానీ, వాటిని తెలుసుకునే ఆసక్తి కానీ లేకపోవటం వల్ల తెలుగునాడు గురించి ఎక్కడా బయటకు రావడం లేదు. పెద్ద పెద్ద రాజ్యాల గురించే మనకు ఇటు సాహిత్యంలోనూ, అటు చరిత్రలోనూ ఆధారాలున్నాయి. చరిత్రకారులు అంతవరకే యత్నాలు చేస్తున్నారు. జానపద గేయాల్లో తలదాచుకొన్న రాజుల చరిత్ర, కుల పురాణాల్లో మరుగుపడ్డ చారిత్రకాంశాలు తవ్వి తలకెత్తుకుంటే తప్ప తెలుగు ప్రాచీన హోదా, విశిష్ట హోదా పొందినందుకు ఫలితం దక్కదు.
తొండై మండలం ప్రసక్తి ఈ సాహిత్యంలో చాలాచోట్ల అగుపిస్తుంది. తొండై అనేది ఒక వంశం నామంగా అన్పిస్తోంది. ఆ వంశం పరిపాలించిన దేశం తొండై మండలం అన్నది దురైసామి పిళ్ళై అభిప్రాయం. 'తొండన్' అంటే ఈనాటికీ తమిళంలో 'అనుచరుడు' అనే అర్థం ఉంది. ఏ రాజ్యానికైనా అనుచరులుగా ఈ మండలాధిపతులు ఉండేవారా అన్నది ఒక ప్రశ్న. తొండై అంటే ఒక రకం తీగె కూడా. అటువంటి తీగెలు ఎక్కువగా ఉన్న ప్రదేశమా? ఎందుకంటే పుఱనారులో 'వడమ వణ్ణక్కన్ పెరుంజాత్తనార్' అనే కవి ఉత్తరాది నుంచి తమిళదేశానికి వచ్చిన గిరిజనుడిగా ఉంది. ఇతని కథ ఇదీ - 'ఉత్తరం నుంచి వచ్చి తొండ మండలాధీశుడి ఆస్థానంలో చేరి ఆ రాజు వీరాన్నీ, దానాన్నీ పొగడుతూ, తన జీవికను గపుడుకుంటున్నాడు. ఈ వణ్ణక్కన్ పెరుంజాత్తనార్ 'వడమర్' కులానికి చెందినవాడు. వీళ్ళ కులవృత్తి బంగారం నిగ్గు తేల్చి చెప్పడం. బంగారును గీచి దాని విలువ నిర్ణయించడం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|