|
|
Articles: TP Features | ప్రయోజనాత్మక దృష్టి - Site Administrator
| |
మన జాతి మీద, భాష మీద అభిమానం ఉండాలనటంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే ఈ అభిమానం పాళ్ళు ఎంత ఉండాలని నిర్ణయించటం సాధ్యం కాదు. ఇది వారి వారి విజ్ఞతకి సంబంధించిన విషయం. అభిమానం మరీ ఎక్కువయితే దురభిమానం అవుతుంది. ఎవరో దురభిమానం చూపిస్తున్నారని మనమూ అలాగే చేయాలనో, లేక వారికి బుద్ధి చెప్పాలనో అనటం సమంజసం కాదు. దురభిమానం ఎంత చెడ్డదో నిరభిమానమూ అంతే చెడ్డది. ఆంధ్రులకి దురభిమానం ఏ మాత్రం లేదు. కాని అభిమాన శూన్యతలో వారిని మించిన వారు లేరు. అందువల్లనే ఈనాడు ఆంధ్రదేశం బయట ఉవ్న తెలుగువారిలో ఎక్కువశాతం తమని తెలుగు వాళ్ళుగా చెప్పుకోవడం లేదు. అయితే దీనికి ఎన్నో కారణాలున్నాయి. వాటిని గంభీరంగా పరిశీలించాల్సి ఉంది.
తెలుగువాళ్ళు తెలుగువాళ్ళుగా చెలామణీ కాకపోవటానికి ముఖ్యకారణం మన దేశంలో భాషా విధానాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో అమలు జరపకపోవటమే. మతం విషయంలో స్వాతంత్ర్యం ఇచ్చి దేశంలో ఎక్కడున్నా వారి వారి మతాచారాలను అనుసరించే స్వేచ్ఛను ఇస్తున్న ప్రభుత్వం భాషా విషయంలో స్పష్టమయిన విధానాన్ని ఎందుకు అనుసరించదో అర్థం కాదు. నిజానికి మతాన్ని బట్టి రాష్ట్రాలు ఏర్పడలేదు, భాషలను బట్టి ఏర్పడ్డాయి. ఏ ప్రాంతాలనూ గీతగీచి ఇక్కడి వారు ఇదే భాషని మాట్లాడాలని కట్టడి చేయడం ఎవరికీ సాధ్యం కాదు. అందువల్ల మతపరంగా అల్పసంఖ్యాకులకు ఇచ్చే స్వేచ్ఛ కన్నా భాషాపరంగా అల్పసంఖ్యాకులకే ఎక్కువ స్వేచ్చ ఇవ్వాలి. ఈ విషయంలో అన్ని భాషా వర్గా కంటే తెలుగు వారికే ఎక్కువ అన్యాయం జరిగింది. వాళ్ళ అదృష్టమో దురదృష్టమో కాని ద్రావిడభాషల్ని మాట్లాడేవారిలో తెలుగు వారే అధిక సంఖ్యాకులు. ఈ దేశంలో కూడా నిజానికి అందరి కంటే ఎక్కువగా మాట్లాడే స్వతంత్ర భాష తెలుగే. ఎందుకంటే హిందీగా చెలామణీ అయ్యే భాషలన్నీ నిజానికి హిందీ కావని తెలుసుకోవాలి. ఎన్నో స్వతంత్ర భాషలు కలిసి హిందీ అయింది.
ఇవన్నీ ఎలా ఉన్నా ఈ దేశంలో స్పష్టమైన భాషా విధానం అమలు అయ్యేట్లుగా ప్రయత్నించడమే ప్రయోజనత్మక దృష్టి అనిపించుకుంటుంది. ఇది సాధ్యమయిననాడు తెలుగువారు ఎక్కడున్నా తెలుగువారమని చెప్పుకోవటానికి సంకోచించాల్సిన అవసరం రాదు. దేశంలో ఎక్కడున్నా ఆయా భాషల వాళ్ళు తమ భాషలోనే ప్రాథమిక విద్యను అభ్యసించవచ్చని, ప్రాంతీయ భాషని తప్పక నేర్చుకోవాలని స్పష్టమైన విధానాన్ని ఏర్పరచుకుంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆదర్శం సఫలమవుతుంది.
ప్రయోజనాత్మకంగా ఆలోచించటానికి మరో మార్గం ఏమిటంటే ప్రపంచంలో తెలుగువాళ్ళు ఎక్కడున్నా తెలుగువాళ్ళే అని, వారు ప్రవాసాంధ్రుల్లో, నివాసాంధ్రులో మరే ఆంధ్రులో కాదని ప్రభుత్వం గుర్తించటం, తెలుగుజాతి, తెలుగు భాష అన్నవి కేవలం ప్రాంతం వల్ల ఏర్పడ లేదనే జ్ఞానం మనకు ఎప్పుడు ఏర్పడుతుందో తెలియదు. తెలుగుజాతిని, తెలుగు భాషని మాట్లాడేవారిని ఎందరో రాజులు పరిపాలించారు. ఆనాటి పరిభాష వేరు, నేటి పరిభాష వేరు. ఈ జాతికి, భాషకి ఎల్లలు లేవు కాబట్టే నేడు తెలుగువారు పరరాష్ట్రాలలో, పరదేశాల్లో అనాథల్లాగా బతకవలసి వస్తోంది. ఈ విషయాన్ని శాస్త్రీయ దృష్టితో చూడగలిగిననాడే తెలుగువారికి ఎక్కడున్నా న్యాయం చేకూరుతుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|