|
|
Articles: My Thoughts | ఆ నీరు స్వచ్ఛం కాదు - Site Administrator
| |
ఇటీవల విజయవాడ నగరంలో చూసిన ఒక అంశం ప్రత్యేకంగా చెప్పాలి. ఇటువంటి సంఘటన ఎక్కడైనా జరగవచ్చు. అప్పుడే నింపిన నీటి సీసాలను తీసుకుని ఒక మినీ వాన్ వెళుతున్నది. దాని పక్కనే మరో పట్నం నుంచి వస్తున్న బస్సు, ఆ బస్సులోని ప్రయాణికుడికి వాంతి వచ్చింది. కిటికీలోనుండి అతను చేసుకున్న వాంతి ఆ మంచి నీళ్ళ సీసా మీద పడింది. వాంతులు ఎప్పుడైనా జరగవచ్చు. కిళ్ళీలను వేసుకుని ఉమ్మటం వంటివి హైదరాబాద్ నగరంలో సర్వసాధారణం. అటువంటి ఉమ్ములు సీసాలపైన పడుతుంటాయి.
ఇళ్ళకి, షాపులకు, ఆఫీసులకు వచ్చి నీటి సీసాలు అమర్చేవారు, నేరుగా తమ బండిలో నుండి లోపలికి తెచ్చి అమరుస్తాడే కాని, ఆ సీసాలను కడగడు. కడగమని మనము అడగం. స్వచ్ఛమైన నీరు అంటూ కంపెనీలు చేసే ప్రచారం మీద మనకంత నమ్మకం.
బోర్లించిన ఆ పీపావంటి ప్లాస్టిక్ సీసా నుండి దుమ్ము, ధూళి, రోగక్రిములు వగైరాలన్నీ మన ఇంటికి చేరుతున్నాయి. ఆ సీసాల అంచున జారి కింద వుండే కుండ వంటి దానిలోకి చేరుతాయి. అందులో నుండే పిల్లలు నేరుగా గ్లాసుల్లోకి తీసుకుని తాగుతున్నారు. అంటే డబ్బు పెట్టి స్వచ్ఛమైన నీరు అనుకుని కొనుక్కొని మన పిల్లలకు రోగాలను అందిస్తున్నాం.
మరో విషయం. ఈ నీటి సీసాలు తెచ్చిపెట్టే వాడు క్రింది కుండవంటి పాత్రను కడగమని చెప్పడు. ఫలితంగా రోజుల తరబడి నీరు ఆ పాత్రలో నిలువవుండి అందులో రోగ కారక సూక్ష్మజీవులు పెరిగే అవకాశముంటుంది.
సీసాలలో సరఫరా చేసే నీరు శాశ్వతకాలం నిలవవుండేది కాదు. మహా అయితే వారం, పదిరోజులు. కాని కంపెనీలు ఆ నీటిని ఏ తేదీన పడతాయో మనకు తెలియదు. పట్టిన తర్వాత ఎంత కాలానికి మనకు సరఫరా చేస్తున్నారో తెలియదు. స్వచ్ఛమైన నీటి పేరుతో నిలువనీరు కొనుక్కొని కష్టాలు, అనారోగ్యం కొని తెచ్చుకుంటున్న వినియోగదారులు మేలుకోవాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా ఈ వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు కొనుక్కుంటున్న 'స్వచ్ఛమైన' నీరే మిమ్మల్ని ఆసుపత్రి పాలు చేస్తుంది... గమనించండి - స్పందించండి.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|