|
|
Articles: TP Features | భాషాభివృద్ధే పురోగమనం - Site Administrator
| |
భాషలకు మూలపుటమ్మగా శిష్టులు సరస్వతిని భావిస్తారు. అందులో తెలుగు భాషని కూడా దైవదత్తంగా పేర్కొంటారు. కన్నడం, తెలుగు భాషల లిపి చాలాకాలం ఒకటిగా ఉంది. ఆ తరువాత మనకళ్ళకి కనిపించే రాజకీయ చారిత్రక అవసరాల రీత్యా 11వ శతాబ్దం నుండి విడివడిన కన్నడ భాషని కూడా ఆ సరస్వతే సృష్టించిందని భావిస్తాం. ఎన్నో అవసరాల రీత్యా భాష రూపొందుతుందనే వాస్తవాన్ని పండితవర్గం స్పష్టంగా చెప్పదు. ఎందుకు చెప్పదనే ఆలోచన ఆధునిక అభ్యుదయవాదులూ చేయరు. అసలీ ప్రశ్న వేసుకో వలసి ఉంటుందని కూడా విప్లవ సాహిత్య ప్రకాండులూ ఆలోచించరు.
నిజానికి తెలుగుభాష / ఆంధ్రభాష అని రెండు విడివిడి పదాలున్నాయి. వీటి మీద ఎంతో చర్చ జరిగింది. తెలుగుభాషలో అనేక మాండలికాలున్నాయి. ఈ వైవిధ్యం ప్రాంతీయ జీవన పరిస్థితి వల్ల ఏర్పడింది. ఎవరో ఒకరు సృష్టిస్తే గాలిలోంచి పుట్టలేదు. ఇతర రాష్ట్రాలలో నివసించే తెలుగువారు ఆయా అవసరాల రీత్యా తమదైన మాండలిక భాషని రూపొందించుకొని ఉపయోగించుకుంటారు. ఇదంతా భాషాశాస్త్రం తెలియజేస్తుంది. భాష ఒక సైన్స్. భాషని అర్థం చేసుకోవడానికి శాస్త్ర ప్రతిపత్తి గల అధ్యయనం ఉంది. సామాజిక భాషాశాస్త్రం అనే ఒక చిన్న విభాగం ఎన్నో కొత్త అంశాలను చర్చిస్తుంది. కాని ఈ చర్చల వల్ల గానీ, తెలుగు భాషలో మార్పులను అంచనా వేయడంలో గాని మనం శాస్త్రీయంగా ఆలోచించడం లేదు.
గత సాంప్రదాయక భావవాద ఆలోచనలకే పెద్దపీట వేస్తున్నాం. అందువల్ల మౌలికంగా భాష పట్ల ఈనాటి తరం కూడా కొత్తగా, శాస్త్రీయంగా ఆలోచించడం లేదు. అందువల్ల భాషని మతానికో, అతీత భావనకో పరిమితం చేస్తున్నాం. దానివల్ల ఏ భాషా వ్యవహర్తలమూ ఆ భాష అసలు లేదా మూలస్వరూపం చూడలేకపోతున్నాం. పైగా పరభాష వ్యామోహానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. అందుకే మన భాషని కప్పిపుచ్చి పరభాషా ప్రభావానికి దాసులమవుతున్నాం.
వ్యవహారిక భాషావాదం తదుపరి ఈనాడు మొదలైన తెలుగు భాషోద్యమం కొంత మెరుగైనదిగా భావించవచ్చు. ప్రస్తుత భాషోద్యమం కొంత మెరుగైనదిగా భావించవచ్చు. ప్రస్తుత భాషోద్యమంలో నిజంగా ఉద్యమస్థాయి కనిపిస్తుందా లేదా అన్నది రేపు తెలుస్తుంది. ప్రజలను ప్రేక్షకులుగానో, తోకలుగానో ఉంచినంతకాలం ఏదీ ఉద్యమం కాలేదు. భాష ప్రజల నిత్యావసరం. వారిని కాదని కేవలం వేళ్ళ మీద లెక్కించే అక్షరాస్యవర్గానికి పరిమితం చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని చరిత్ర చెబుతోంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|