|
|
Articles: TP Features | భాష మూలాలను హత్తుకుందాం - Site Administrator
| |
పూర్వ శాతవాహన రాజుల ప్రాచీన నగరాల జాడలు కనిపిస్తాయి. ఆ నగరాల ఏలుబడి కాలంలో విలసిల్లిన పూర్వ తెలుగుభాష ఆనవాళ్ళు తెలుస్తాయి. నాణేల రూపేణా ఆ మట్టిపొరలలో దాగిన ప్రాచీనతే కాదు తెలుగువారు దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక చిత్రపటం లభిస్తుంది. విదేశాలతో చేసిన వ్యాపార లావాదేవీల వివరాలు తెలుస్తాయి. ఆశ్మకరాజ్యం నుండి కదిలి వెళ్లిన ఇనుప ఖనిజం ఖడ్గాలుగా విశ్వవిజేతలైన రాజుల చేతిలో అలంకరించాయనే వాస్తవ రాతలు కోకొల్లలుగా కనిపిస్తాయి. మన దేశం వచ్చిన విదేశీ యాత్రికుల రచనల్ని మరోసారి చదివి ఉత్తర దక్షిణ భారతాల మధ్య కేంద్రీకృతమైన తెలంగాణా తెలుగు - దక్షిణాపథంలో వెలసిన ఆంధ్రం సంబంధ బాంధవ్యాలు కొత్తకోణంలో విదితం అవుతాయి. ఇంతకీ మనం తెలుగుభాష విస్తరించిన ప్రాంతాలను చారిత్రక దృష్టితో శాస్త్రీయంగా గుర్తించవలసే ఉంది. తెలుగు సంచార తెగలనే కాదు - సగం సంచార తెగలనూ - ఇతర ప్రాంతాలలో స్థిరపడిన తెగలనూ ఉత్తర భారతంలో గుర్తించడానికి ప్రత్యేక ప్రణాళిక ఒకదాన్ని రూపొందించాలి. అప్పుడు మనం అనుకునే తెలుగులు ఇంకా అనేకం వచ్చిచేరతాయి.
పలాస, బరంపురం తెలుగు, చంద్రాపూర్ దాటి నాగపూర్ సరిహద్దుల తెలుగు, గోండ్వానా ఆదిమ గిరిజనుల నాలుకలపై నర్తించే గోండీ తెలుగు, తెగులు లేని గిరిజనుల తెలుగులు ఎన్నో ఉన్నాయి. మనకి తెలుగంటే ప్రస్తుతం కనిపించే పత్రికల తెలుగుభాషే, మరోలా భావించకపోతే దీన్ని ఒక చిన్న మాండలికం అనవచ్చు. కాని దీన్ని ప్రధాన స్రవంతి భాషగా భావిస్తారు కొందరు. నిజానికి ఈ భాషకన్నా భిన్నమైన యాస, విలక్షణ పదజాలం ఉపయోగించే అత్యధిశాతం ప్రజల తెలుగు వేరయినప్పుడు ఈ భాష స్వల్ప వ్యవహారికులదిగానే చెప్పుకోవడంలో తప్పులేదు. ఈ భాషలోనే ఆంగ్లం, సంస్కృత భాషా పదజాల వాడుక అధికం. అందుకే ప్రజారాశుల కోణంలోంచి చూస్తే దీన్ని విద్యావంతుల రాత మాండలికం అనవచ్చు.
మనకు వృత్తి మాండలిక తెలుగు భాష (వ్యవసాయం, చేనేత, కల్లు, బెల్లం, నీరా, సారా, వడ్రంగం, స్వర్ణకార, మేదర ఇత్యాది) కు మాండలిక తెలుగు (అస్పృశ్యత కులాలు, సంచార తెలుగు, కర్ణాటక తెలుగు, కళింగ తెలుగు, మరాఠా తెలుగు ఇత్యాది) రాష్ట్ర తెలుగు మాండలిక భాషలు (కళింగ, కోస్తా, తెలంగాణా, రాయలసీమ) వంటి ఎన్నో తెలుగులు వినిపిస్తాయి. కనిపిస్తాయి. ఇవి కాకుండా మరింత స్పష్టంగా చెప్పుకోవలసిన భాష `నోటి తెలుగు భాష'ని కూడా ప్రత్యేకంగా గుర్తించాలి. ఇన్ని తెలుగుల సమాహార భాషే మన తెలుగు భాష. ఇవన్నీ లేకుండా తెలుగుభాష లేదు. అయితే చాలా మంది ఇందులోని ఒక పరిమిత పరిచిత తెలుగు భాషని మాత్రమే గ్రహించి దాన్నే భాషగా గుర్తిస్తారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|