|
|
Articles: TP Features | శతాబ్దాలన్నీ శ్రీశ్రీవే - Site Administrator
| |
సరిగ్గా పాతికేళ్ల ప్రాయానికి దగ్గరవుతున్న సందర్బంలో శ్రీశ్రీలో కొత్తరకం భావాలు మొలకెత్తడం ఆరంభమైంది. పైలా పచ్చీస్ వయసు కొత్త నెత్తురుతో సలసలమరిగింది. కళ్లముందు అన్యాయానికి చలించింది, జ్వలించింది. అది 1930 దశకం, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలు శ్రీశ్రీని రగుల్కొల్పాయి. ఉద్యమకర్తను చేశాయి, అంతే... చుర కత్తుల్లాంటి అక్షరాలనే ఆయుధంగా చేసుకుని మరో ప్రపంచాన్నే సష్టించాడు. అథో జగత్ కోసం జగనాథ రధ చక్రాలను భూ మార్గం పట్టించాడు. పతితులు, భ్రష్టులు, బాధాసర్పద్రష్టుల కోసం నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు. శ్రీశ్రీ యుగం 1930 తరువాతనే ప్రారంభమైంది. మహా ప్రస్తానం ముందు వరకూ శ్రీశ్రీ సాహిత్యమంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మహా ప్రస్థానం తరువాత సాహిత్యమంతా ఆయనే.
ఈ విధంగా సాహితీలోకానికి శ్రీశ్రీ తన విశ్వరూపాన్ని చూపించాడు. మొత్తం ప్రపంచాన్నంతా పుక్కిట పట్టి వాటిని అక్షర బద్దం చేశాడు. శ్రీశ్రీ రచనలలో ఖడ్గసృష్టి వంటివి ఉన్నా మహా ప్రస్థానంతోనే అజేయమైన కీర్తిని సాధించాడు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి మాటలలో చెప్పాలంటే శ్రీశ్రీ రచనలన్నీ అవసరం లేదు, ఒక్క మహా ప్రస్థానం చాలు, శ్రీశ్రీని యుగకర్తను చేయడానికి. శ్రీశ్రీకి ఈ శతాబ్దం నాది అన్నంత ధీమాను ఇచ్చిన మహా ్రపస్థానం గేయ సంపుటి 1950 తరువాత అద్బుతమైన ప్రాచుర్యాన్ని పొందింది. అభ్యుదయకాముకులకు ఆదర్శంగా నిలిచింది. వేల సంవత్సరాలుగా ఒక పంథాలో కొనసాగుతున్న తెలుగు సాహిత్యాన్ని గిర్రున మలుపుతిప్పిందీ మహా ప్రస్తానం. అందులో లేనిది లేదు, అప్పటి వరకూ ఉన్నదీ లేదు. అందుకే మహా ప్రస్థానానికి అంత ఉన్నత స్ధానం దక్కింది. శ్రీశ్రీ అనేక సాహిత్య ప్రక్రియలు చేశారు. శభాష్ అనిపించుకున్నారు. కవితలు, కథలు, నాటకాలు, నాటికలు, రేడియో నాటకాలు ఇలా అనేకం రచించాడు. వీటన్నిటికీ మించి సినిమా గేయ రచనలో తనదైన ముద్రను వేశాడు.
డబ్బింగ్ రచయితగా అగ్ర తాంబూలాన్ని అందుకున్నాడు. విప్లవ సాహిత్యానికి శ్రీశ్రీయే నిర్మాతలకు గుర్తుకు రావడం గొప్ప విషయమైనా, శ్రీశ్రీ కేవలం ఆ తరహా సాహిత్యానికే పరిమితం కాలేదు.శృంగార గీతాలను రచించాడు. హాస్య రసాన్ని ఒలికించాడు. కరుణ రసాన్ని పలికించాడు. తన కత్తికి ఎదురులేదని నిరూపించుకున్నాడు. ఇక, సినిమా పద్యాలలో శ్రీశ్రీ ఛందోబద్ధమైన కవిత్వంతో ప్రాచీన కవులను స్ఫురణకు తెచ్చాడు. తన జీవిత చరిత్రను అనంతం పేరుతో రచించిన శ్రీశ్రీ చివరి రోజులలో నిర్మాతగా కూడా మారి మహా ప్రస్థానం పేరుతో చిత్రాన్ని నిర్మించాడు. 1983 జూన్ 15న అప్పటి మద్రాస్‌లో తుది శ్వాస విడిచాడు. భౌతికంగా మన మధ్య లేకపోయినా సాహితీ లోకానికి మాత్రం శ్రీశ్రీ ఎప్పటికీ చిరంజీవే. శ్రీశ్రీ అంటే రెండు అక్షరాలు కానే కాదు, సాహిత్యానికి అవతల, ఇవతల ఒడ్డు ఆయనేనంటే సరిపోతుంది, సార్ధకతా చేకూరుతుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|