|
|
Articles: Devotion | కార్తీక పురాణం - Site Administrator
| |
23వ అధ్యాయం
శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట
అగస్త్యుడు మరలా అత్రిమహర్షితో ఓ మునిపుంగవా! విజయాన్ని పొందిన పురంజయుడు ఏమి చేసెనో వివరించమని అడగగా అత్రిమహాముని ఇలా చెప్పెను. కుంభసంభవా! పురంజయుడు కార్తీక వ్రతాన్ని ఆచరించడం వల్ల అసమాన బలవంతుడై అగ్నిశేషము, శత్రుశేషము ఉండకూడదని తెలిసి, తన శత్రురాజులను ఓడించి తన రాజ్యాన్ని పాలించుచుండెను.
శత్రువులకు సింహస్వప్నమై, విష్ణు సేవాధురంధరుడు, కార్తీక వ్రత ప్రభావం వల్ల కోటికి పడగెత్తి అరిషడ్వర్గాలను కూడా జయించినవాడై యుండెను. అయిననూ అతనికి తృప్తి కలగలేదు. ఏ దేశమున, యే కాలమున, యే క్షేత్రమున యే విధంగా శ్రీహరిని పూజించి కృతార్థుడు కాగలనని విచారించుచుండగా ఒకనాడు అశరీరవాణి పురంజయా! కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవు అక్కడికి వెళ్ళి శ్రీరంగనాథస్వామిని పూజింపుము. నీవు ఈ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందుతావు అని పలికెను.
ఆవిధంగా పురంజయుడు ఆ అశరీరవాణి మాటలు విని, రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రాలను దర్శించుచూ, పుణ్యనదులలో స్నానము చేయుచూ..ఆయా దేవతలను సేవించుచూ శ్రీరంగపట్టణమును చేరుకొనెను. అక్కడ కావేరీనది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయములో శేషశయ్యపై పవ్వళించియున్న శ్రీరంగనాథుడిని చూసి పరవశంతో చేతులు జోడించి దామోదరా, గోవిందా, గోపాలా, వాసుదేవా, అనంతా, అచ్యుతా, ముకుందా, పురాణపురుషా, హృషీకేశా, ద్రౌపదీమాన సంరక్షకా, దీనజన భక్తపోషా, కృష్ణా, హరీ, ప్రహ్లాదవరదా, గరుడధ్వజా, కరివరదా, నారాయాణా పాహిమాం, రక్షమాం.. రక్షమాం, దాసోహం పరమాత్మా దాసోహం అని విష్ణుస్తోత్రమును పఠించి, కార్తీక మాసమంతా శ్రీరంగములోనే ఉండి, తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రత మహిమ వల్ల అతని రాజ్యములో ప్రజలందరూ సిరిసంపదలతో, పాడి పంటలతో, ధనదాన్యాలతో, ఆరోగ్యముగా ఉండెను.
అయోధ్యానగరము ధృడమైన కోటలు కలిగి తోరణ యంత్రద్వారాలు కలిగి మనోహరమైన గృహగోపురాదులతో చతురంగ సైన్యము ప్రకాశించుచుండెను. అయోధ్యానగరంలో వీరులు యుద్ధనేర్పురులై, రాజనీతి గలవారై, శత్రు నిరోధకులై, నిరంతరము విజయశీలురై, ఎంతో జాగ్రత్తపరులై ఉండిరి. ఆ నగరంలోని నారీమణులు మిక్కిలి రూపవంతులని, శీలవంతులని, గుణవంతులని పేరు పొందారు. వెలయాలలు నృత్య, సంగీతాది కళావిశారుధులై, ఫ్రౌడలై, వయోగుణ రూపలావణ్య సంపన్నులై, పతిశుశ్రూష పరాయణులై, సద్గుణాలంకార భూషితులై, చిద్విలాస హాసోల్లాస పులకాకిత శరీరులై ఉండిరి.
పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి సతీసమేతుడై ఇంటికి చేరుకొనెను. పురంజయుని రాక విని పురజనులందరూ మంగళవాద్యాలతో ఎదురెళ్ళి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమునకు వచ్చెను. అతడు దైవభక్తి కలవాడు కావడంతో ధర్మబద్ధంగా రాజ్యాన్ని కొంత కాలము పాలించి వయసుమీదపడడంతో కోరికలను వదులుకొని, శ్రీరంగమునకు వెళ్ళెను. అతడు అక్కడ కూడా ప్రతి సంవత్సరమూ విధివిధానముగా కార్తీక వ్రతాన్ని చేస్తూ క్రమక్రమంగా శరీరము సహకరించకపోవడంతో మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్త్యా! కార్తీక వ్రతము అత్యంత మహిమ కలది. ఈ వ్రతాన్ని ప్రతివారూ ఆచరించాలి. ఈ కథ చదివినవారికీ, చదివినప్పుడు విన్నవారికీ కూడా వైకుంఠప్రాప్తి కలుగుతుంది అని చెప్పెను.
త్రయోవింశాధ్యాయము ఇరువది మూడవ రోజు పారాయణం సమాప్తం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|