|
|
Articles: Devotion | కార్తీక పురాణం - Site Administrator
| |
24వ అధ్యాయం
అంబరీషుని ద్వాదశీవ్రతము
అత్రిమహాముని మరల అగస్త్యునితో రాజా! కార్తీక వ్రత ప్రభావము ఎంత చెప్పినా, ఎంత విన్నా తనివితీరదు. నాకు తెలిసినంతవరకు వివరిస్తాను శ్రద్ధగా ఆలకించమనెను.
గంగా, గోదావరి,కృష్ణ, కావేరి మున్నగు నదులలో స్నానము చేసినందువల్ల, సూర్య, చంద్రగ్రహణ సమయములందు స్నానాలు చేసినందువల్ల ఎంత ఫలితము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీక మాస వ్రతమందు శుద్ధ ద్వాదశినాడు భక్తి శ్రద్దలతో దానధర్మములు చేయువారికి అంతఫలమూ కలుగుతుంది. ఆ ద్వాదశినాడు చేసిన సత్కార్య ఫలము ఇతర రోజులలో చేసినదానికంటే వేయి రెట్లు అధిమవుతుంది. ఆ ద్వాదశీ వ్రతము ఎలా చేయాలో ఈ విధంగా వివరించెను.
కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భోజనం చేసి ఆ మరునాడు ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తూ శుష్కోపవాసము ఉండి ద్వాదశి ఘడియలు వచ్చిన తర్వాతే భుజింపవలయును. దీనికొక ఇతిహాసము కలదు. దానిని కూడా వివరించెదను. జాగ్రత్తగా వినమంటూ ఇలా చెప్పసాగెను.
పూర్వము అంబరీషుడు అను రాజు ఉండేవాడు. అతడు పరమభాగవోత్తముడు. ద్వాదశీవ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశినాడు తప్పకుండా వ్రతము చేయుచుండెను. ఒక ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు చాలా తక్కువగా ఉండెను. అందువల్ల ఆ రోజు తొందరగానే వ్రతమును పూర్తి చేసి బ్రాహ్మణ సమారాధన చేయదలచి అందుకు సిద్ధంగా ఉండెను. అదే సమయంలో అచ్చటకు కోపస్వభావుడగు దూర్వాసమహాముని వచ్చెను. అంబరీషుడు ఆ మునిని సగౌరవంగా ఆహ్వానించెను. అతిథి సత్కారాలు చేయదలచి మునిపుంగవా ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయును, కాబట్టి తొందరగా స్నాన, సంధ్యావందనాలు ముంగించుకొని రావలసిందిగా కోరెను. దూర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానముకై వెళ్ళెను.
అంబరీషుడు ఎంత సేపు అతనికోసం ఎదురుచూచినా దూర్వాసముని రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను. ఇంటికి వచ్చిన దూర్వాసమునిని భోజనముకు ఆహ్వానించితిని. ఆ ముని నదీస్నానానికి వెళ్ళి ఇంకనూ రాలేదు. బ్రాహ్మణునికి ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడం మహాపాపం. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చేవరకు ఆగిన ద్వాదశిఘడియలు దాటిపోయినచో వ్రతభంగము అవుతుంది. ఆ ముని మహా కోపస్వభావము కలవాడు. ఆయన రాకుండా నేను భోజనం చేస్తే నన్ను శపించును. బ్రాహ్మణ శాపమునకు తిరుగులేదంటారు. నాకేమి చేయాలో తెలియకున్నది. ఏది చేస్తే ఏమి జరుగుతుందోనని అంబరీషుడు బాధపడతాడు. అయినా ఈ విషయాన్ని పండితులతో చర్చిస్తే వారు ఏం సలహా ఇస్తారోనని తలచి సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిపించి వారితో ఇలా చెప్పెను.
ఓ పండిత శ్రేష్టులారా! నిన్నటి దినమున ఏకాదశి కావడంతో నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ రోజు స్వల్పముగా మాత్రమే ద్వాదశి ఘడియలు ఉన్నవి. ద్వాదశి ఘడియల్లోనే భోజనం చేయాలన్నది విదితమే. కానీ ఇంతలో నా గృహమునకు దూర్వాసమహాముని రావడంతో ఆయనను భోజనానికి రమ్మని నేను ఆహ్వానించితిని. అందుకు ఆ ముని సరేనని స్నానార్థమై నదికి వెళ్ళి ఇంతవరకూ లేదు. ఇప్పుడేమో ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. కాబట్టి నేను ఏమి చేయాలో తోచడం లేదు. కాబట్టి తరుణోపాయమును తెలుపమని అంబరీషుడు వేడుకొనెను.
అంబరీషుని మాటలు ఆలకించిన ఆ పండితులు దీర్ఘముగా ఆలోచించి మహారాజా! సమస్త ప్రాణికోటి గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా నున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన పదార్థములను పచనముగావించి దేహేంద్రియాలకు శక్తిని ప్రసాదిస్తున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజర్విల్లును. అది చెలరేగిన ఆకలి, దాహం కలుగుతుంది. ఆ తాపమును చల్లార్చవలెనన్న అన్నము, నీరు పుచ్చుకొని శాంతపర్చవలనెను. శరీరమునకు శక్తి కలుగచేయడం వల్ల అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవుడిని అందరూ సదా పూజింపవలెను. ఇంటికి వచ్చిన అతిథి ఎటువంటి వాడైననూ భోజనం పెడ్తానని ఆహ్వానించి, వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదవేదాంగ విద్యావిశారధుడు, మహాతపశ్శాలి, సదాచార సంపన్నుడు అయిన దూర్వాసమహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా భుజించినచో మహాపాపము కలుగుతుందని వివరించిరి.
చతుర్వింశోధ్యాయము ఇరువది నాల్గవ పారాయణము సమాప్తం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|