|
|
Articles: Devotion | కార్తీక పురాణం - Site Administrator
| |
25వ అధ్యాయం
దూర్వాసుడు అంబరీషునుని శపించుట
అంబరీషా! పూర్వ జన్మలో కించిత్ పాప విశేషము వల్లే నీకు ఈ సమస్య ఏర్పడినది. నీవు దీర్ఘముగా ఆలోచించి నీకెలా చేస్తే మంచిదనిపిస్తే అలానే చేయి. ఇక మాకు సెలవిప్పించమని పండితులు అనడంతో అంబరీషుడు ఓ పండితోత్తములారా నా అభిప్రాయమును కూడా విని వెళ్ళండి. ద్వాదశీనిష్ఠను విడుచుట కన్నా, బ్రాహ్మణుని శాపము ఎక్కువ కాదు. జలపానము చేయుట వల్ల బ్రాహ్మణుని అవమానించుట కాదు. ద్వాదశిని విడుచుట కాదు. అలా చేస్తే దూర్వాసముని నన్ను ఏల నిందించును? నిందింపడు? నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన జలమును స్వీకరించి ఊరుకుంటానని చెప్పి తన ఇష్ట దైవమైన శ్రీహరికి మనస్సులోనే నమస్కరించి అతిథి సత్కార్యాన్ని ఉల్లంఘించిన పాపం తగలకుండా అనుగ్రహించమని ధ్యానిస్తూ వారి ఎదుటే జలాన్ని స్వీకరించెను.
అంబరీషుడు జలాన్ని స్వీకరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన, జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహాకోపంతో కండ్ల వెంట నిప్పులు కురిపిస్తూ ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని ఆహ్వానించి, నేను రాకనే నీవేల భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిథికి అన్నము పెడ్తానని ఆశ జూపి భోజనం పెట్టకుండా తాను తినినవాడు మలభక్షుడగును. అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టును. శ్రీహరి నీవంటి వాడిని సహింపడు. మమ్ములను అవమానించుట శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరియొకడు లేడు. నీవు మహాభక్తుడవని అతి గర్వము కలవాడము. ఆ గర్వంతోనే నీవు నన్న భోజనానికి రమ్మని పిలిచి కూడా మాకోసం వేచి ఉండక నిర్లక్ష్యముగా జలాన్ని స్వీకరించావు. అంబరీషా నీవెట్లా పవిత్ర రాజకుటుంబంలో పుట్టావురా! నీ వంశము కళంకము కాలేదా? అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను.
అంబరీషుడు ఆ ముని కోపమునకు భయపడుతూ చేతులు జోడించి మహానుభావా? నేను ధర్మహీనుడను, నా అజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను క్షమింపుము. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ, దయాదాక్షిణ్యాలు కలవారు.. నన్ను మన్నించమని అతని పాదాలపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు అనడంతో అంబరీషుడు నీవే దిక్కని శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ ఉండెను. దూర్వాసుడు అంబరీషున్ని నీవు మొదటి జన్మలో చేపగానూ, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవ జన్మలో క్రూరుడువగు బ్రాహ్మణుడవుగాను, అనంతరం వరాహ, సింహం, వామనుడు, క్రూర బ్రాహ్మణుడు, సింహాసనము లేని రాజుగా, పాషాండ మతస్థునిగా, పదవ జన్మలో పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగా పుట్టెదనని ముందూ వెనుకా ఆలోచించక శపించెను.
ఇంకా కోపము తగ్గనందువల్ల మరల శపించుటకు సిద్ధమవుతుండగా శ్రీమహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని, తన భక్తునికి ఏ అపాయమూ కలగకూడదని అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్యా! అటులనే మీ శాపమును అనుభవింతునని ప్రాధేయపడెను. కానీ దూర్వాసుడు మరింత కోపంతో మరలా శపించబోగా, శ్రీహరి తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రబలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచూ దూర్వాసునిపై పడబోయెను. అప్పుడు దూర్వాసుడు ఆ చక్రాయుధము తనను వధించునని భావించి ప్రాణములపై ఆశకలిగి అక్కడి పరుగుమొదలు పెట్టెను. మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసున్ని తరుముచుండెను. అంత దూర్వాసుడు తనను రక్షించమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున దేవేంద్రున్ని, బ్రహ్మలోకమున ఉన్న బ్రహ్మదేవుణ్ణి ఎంత వేడుకున్ననూ వారు సైతము చక్రాయుధము బారినుండి దూర్వాసమునిని రక్షించలేకపోయిరి.
పంచవింశాధ్యాయము ఇరువది ఐదవ రోజు పారాయణం సమాప్తం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|