|
|
Articles: Devotion | కార్తీక పురాణం - Site Administrator
| |
26వ అధ్యాయం
దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట
ఆ విధంగా అత్రిమహాముని అగస్త్యునితో దూర్వాసముని కోపం వల్ల కలిగే అనర్థాలను చెప్పి, ఆ సంఘటనను ఇలా తెలియజేసెను.
కోపస్వభావం గల దూర్వాసుడు భూలోకము, పాతాళ లోకము, సత్యలోకము, మొదలగు అన్ని లోకాలలోనూ తనను రక్షించువారు లేకపోవడంతో వైకుంఠానికి వెళ్ళి శ్రీమహావిష్ణువును దర్శించుకుని ఓ జగన్నాధా! రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు తలపెట్టిన నేను బ్రాహ్మణుడను కాను. నా కోపముతో మహా అపరాధాన్ని చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. భృగుమర్షి.. నీ యురముపై తన్నిననూ సహించితివి. ఆ కాలి గురుతు ఇంకనూ నీ వక్షస్థలమందున్నది. ప్రశాంత చిత్తముతో అతని గర్వాన్ని పోగొట్టి రక్షించినట్లే కోపముతో నీ భక్తుడ్ని శపించినందుకు నన్ను కూడా రక్షించుము. నీ చక్రాయుదము నన్ను వధించుటకు వెంటాడుతుందని శ్రీహరిని పరిపరివిధాల ప్రార్థించెను.
ఆ విధంగా దూర్వాసుడు అహంకారమును విడిచి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వుతో దూర్వాసా! నీ మాటలు యదార్థములు. నీవంటి తపోధనులు నాకు ఎంతో ఇష్టులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రాంశవు. నిన్ను చూసినవారు మూడు లోకములందూ భయపడకుందురా! నేను త్రికరణములచే ఎవరికీ అపకారం చేయను. అందునా... నీవు బ్రాహ్మణుడవు. ప్రతి యుగమందు గో, దేవ, బ్రాహ్మణ, సాధుజనులకు సంభవించే కష్టాలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ, శిష్టరక్షణనను చేయుదును. నీవు అకారణంగా అంబరీషున్ని శపించితివి. అతను ధర్మప్రకారముగా ప్రజాపాలన చేయుచుండెను. అటువంటి భక్తున్ని నీవు అనేక విధాల దూషించితివి. అతని ఇంటికి అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాకున్నచో ద్వాదశి ఘడియలు దాటకుండా భుజింపమని అంబరీషునికి చెప్పకపోతివి. అంబరీషుడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై ఎదురు చూసి, చూసి జలపానము మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను.
చాతుర్వర్ణముల వారికీ భోజనం చేయనిరోజులలో కూడా జలపానము దాహశాంతికి, పవిత్రతకు చేయదగినదే కదా? జలాన్ని స్వీకరించినంత మాత్రాన్నే నా భక్తున్ని దూషించి, శపించితివి. అతడు వ్రత భంగమునకు భయపడి జలపానము చేసినాడే కానీ నిన్ను అవమానించుటకు కాదు? నీవు కోపంతో మండిపడుతున్ననూ బ్రతిమాలి నిన్ను శాంతింపచేయడానికి ప్రయత్నించెను. ఎంత బతిమాలినా నీవు శాంతించకపోవడంతో అంబరీషుడు నన్ను శరణు వేడెను. నేనపుడు రాజు హృదయంలో ప్రవేశించి నీ శాపఫలమును పది జన్మలలో అనుభవించెదనని పలికిన వాడను నేనే. అతడు నీ ఉగ్రరూపం చూసి భయంతో నన్ను శరణువేడుతూ తన దేహస్థితిని గమనించుకొనే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్టుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మమార్గంలో పయనించేవాడు. అటువంటి వానిని అకారణంగా దూషించడమే కాక శపించితివి. విచారింప వలదు. బ్రాహ్మణ శాపము వృధా కాదు. ఆ శాపములను లోకోపకారమునకై నేనే అనుభవింతును.
నీ శాపాలలో మొదటిది మత్స్యావతారం. నేనీ కల్పమున మనువును రక్షించేందుకు, సోమకుడను రాక్షసుడిని సంహరించుటకు మత్స్యరూపమున జన్మింతును. మరి కొంతకాలానికి దేవదానవులు క్షీరసాగరమును మధించుటకు మందరపర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతము నీటిలో మునగకుండా కాపాడుటకు కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుణ్ని వధింతును. నరసింహ అవతారమెత్తి హిరణ్యకసిపుడ్ని వధించి, ప్రహ్లాదుడుని రక్షింతును. బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గాన్ని అప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు నెట్టివేదును. భూ భారము తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారాన్ని తగ్గిస్తాను. లోకకంటకుడైన రావణుని చంపి లోకానికి ఉపకారం చేయడానికి రఘువంశమున రాముడనై జన్మింతును. పిద, యదువంశమున శ్రీకృష్ణునిగా, కలియుగమున బుద్ధుడుగానూ, కలియుగాంతమున విష్ణుచిత్తుడను బ్రాహ్మణుడుగా పుట్టుదును. నీవు అంబరీషునకు శాప రూపములో ఇచ్చిన పదిజన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను. ఇలా నా దశావతారాలను సదా స్మరించువారికి సమస్త పాపాలూ నశించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇది ముమ్మాటికీ నిజము.
శడ్వింశోధ్యాయము ఇరువది ఆరవ రోజు పారాయణం సమాప్తం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|