|
|
Articles: Devotion | కార్తీక పురాణం - Site Administrator
| |
28వ అధ్యాయం
విష్ణు సుదర్శన చక్ర మహిమ
ఓ జనక మహారాజా వింటివా దూర్వాసుని కష్టాలు. తాను ఎంతటి జ్ఞానియైనా, కోపవంతుడైనా వెనుక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించడం వల్లే అష్టకష్టాల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనా వారుచేసే పనులలో జాగ్రత్తలు తెలుసుకోవలెను. దూర్వాసుడు శ్రీమన్నారాయణుని వద్ద సెలవు పొంది తనను వెన్నంటి తరముచున్న విష్ణుచక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషునితో ధర్మపాలకా! నా తప్పును క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపైగల అనురాగముతో, ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కానీ నన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయతలపెట్టితివి. గాని నా దుర్భుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను శ్రీహరి వద్దకు వెళ్ళి ఆ విష్ణుచక్రము యొక్క ఆపదనుండి కాపాడమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకే వెళ్ళమని చెప్పాడు. కాన నీవే నాకు శరణ్యము.
నేను ఎంతటి తపశ్శాలినైనా, యెంత నిష్ఠగలవాడవైనా నీ నిష్కళంక భక్తిముందు అవిఏమీ పనిచేయలేదు. నన్ను ఈ కష్టమునుండి రక్షించమని అనేక విధాల ప్రార్థించగా, అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మన:పూర్వక నమస్కారములు. ఈ దూర్వాసముని తెలిసియో, తెలియకో తొందరపాటుగా ఈ కష్టాన్ని కొని తెచ్చుకొనెను. అయిననూ ఇతడు బ్రాహ్మణుడు గాన, ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యము నీవు నిర్వర్తించాలనుకుంటే ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసమహామునిని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను శ్రీమన్నారాయణుని భక్తుడిని. యుద్ధములలో అనేకమంది లోకకంటకులను చంపితివి కాని శరణుకోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువల్లే నీవు ఈ దూర్వాసుడు ముల్లోకాలు తిరిగిననూ వెంటాడుచున్నావే గానీ చంపుటలేదు. దేవా! సురాసురాది భూతకోటులన్నియూ ఒక్కటైననూ నిన్నేమీ చేయజాలను. నీ శక్తికి యే విధమైన అడ్డు లేదు. ఈ విషయములో లోకమంతటికి తెలియును. అయిననూ మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షించమని ప్రార్థించుచున్నాను.
నీయందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను శరణు వేడిన దూర్వాస మునిని రక్షింపుమంటూ అనేక విధాలుగా స్తుతించుట వలన అతిరౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుదము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వరా! అంబరీషా! నీ భక్తిని పరీక్షించుటకు ఇలా చేసితిని గాని, వేరు కాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభూలను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఘులను నేను దనుమాడుట నీకు తెలియను కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై శ్రీహరి నన్ను ఉపయోగించుకొని ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి, నానా కష్టాలు పెట్టాలని నీపై కన్నులెర్రజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి, ఈ ముని గర్వాన్ని అణచవలెనని తరుముచున్నాను.
ఇతడు కూడా సామాన్యుడు కాదు. ఇతడు రుద్రాంస సంభూతుడు, బ్రహ్మతేజస్సు కలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భూలోకవాసులనందరును చంపగలదు. కాని శక్తిలో నా కంటె ఎక్కువేమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మతేజస్సు కంటే, కైలాసపతియైన మహేశ్వరుని తేజశ్శక్తికంటే ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గలవాడు కానీ, క్షత్రియ తేజస్సు గల నీవు గానీ తులతూగరు. నన్ను ఎదుర్కొనలేరు. తనకన్నా యెదుటివాడు బలవంతుడైనప్పుడు అతనితో సంధి చేసుకోవడం ఉత్తమం. ఈ నీతిని ఆచరించువారు ఎటువంటి కష్టమునుండైననూ తప్పించుకోగలరు.
ఇంతరవకు జరిగిందంతయూ మర్చిపోయి, శరణార్ధియై వచ్చిన ఆ దూర్వాసమునిని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తించమని చక్రాయుధము పలికెను. అంబరీషుడా మాటలను విని నేను దేవ, గో, బ్రాహ్మణులందు, స్రీల పట్ల గౌరవము కలవాడను. నా రాజ్యములో ప్రజలందరూ సుఖముగా ఉండాలనదే నా కోరిక. శరణు కోరిన వారిని కాపాడుటయే నా కర్తవ్యము. కాబట్టి నా శరణు కోరిన ఈ దూర్వాసమునిని, నన్నూ కరుణించి కాపాడు. వేలకొలది అగ్ని దేవతలు, కోట్లకోలది సూర్యమండలములు ఏకమైననూ నీ శక్తికి, తేజస్సుకూ సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహా విష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవగోబ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి తన కుక్షియందున్న పదునాలుగు లోకములను కాపాడుచున్నాడు. కాన, నీకివే నా మన:పూర్వక నమస్కారములు అని పలుకుతూ అంబరీషుడు చక్రాయుధము పాదములపై పడెను.
అంతట సుదర్శన చక్రము అంబరీషునిని లేపి గాఢాలింగన మొనర్చి అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రమును మూడు కాలాలయందు ఎవరు చదువుతారో, ఎవరు ధానధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకుందురో, ఎవరు పరులను హింసించక, పరధనములకు ఆశపడక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్యాది మహా పాపములను చేయరో అట్టి వారి కష్టాలు నశించి ఇహమందునూ, పరమందునూ సర్వసౌఖ్యములను అనుభవిస్తూ ఉంటారు. కాన, నిన్నూ, దూర్వాసమునిని రక్షించుచున్నాను. నీ ద్వాదశీ వ్రతప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలమందు ఈ ముని పుంగవుని తపశ్శక్తి ఫలించలేదు అని చెప్పి అతడిని ఆశీర్వదించి అదృశ్యమయ్యెను.
అష్టావింశాధ్యాయము ఇరువది యెనిమిదవ రోజు పారాయణం సమాప్తం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|