|
|
|
|
Articles: Devotion | కార్తీక పురాణం - Site Administrator
| |
29వ అధ్యాయం
అంబరీషుడు దూర్వాసమునిని పూజించుట
అత్రిమహాముని అగస్త్యులవారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి, రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమై తన లోకమునకు చేరుకుందని వివరిస్తాడు. ఆ తర్వాత జరిగిన కథను కూడా ఇలా వివరిస్తాడు.
కారణం లేకుండా అంబరీషునికి చేసిన అపకారానికి బాధపడుతూ, సిగ్గుతో తలవంచుకున్న దూర్వాసమునిని సాదరంగా ఆహ్వానించి ఆయన పాదాలు కడిగి, ఆ నీటిని తన శిరస్సుపై జల్లుకొని, ఓ మునిశ్రేష్ఠా! నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును. ద్వాదశి వ్రతము చేసుకొనుచూ ప్రజలకు ఎటువంటి ఆపదా రాకుండా ధర్మవర్తనుడై రాజ్యమేలుచున్నాను. నా వల్ల మీకు కలిగిన ఆపదకు నన్ను మన్నించుము. మీపై నాకు అమితమైన అనురాగం ఉంటడం వల్లనే తమకు ఆతిథ్య మిచ్చేందుకు ఆహ్వానించితిని. ఇంతలో ఇలా జరిగిపోయింది. అయినా నా పట్ల ప్రేమతో మీరు మరలా ఇక్కడకు వచ్చారు. అదే భాగ్యముగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు జరిగిందంతా మనసులో ఉంచుకోక పెద్ద మనసు చేసుకొని నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను, నా వంశమును పావనము చేసి కృతార్థున్ని చేయండి. మీ వల్లే నాకు సుదర్శన చక్ర దర్శనము కలిగినది. మీరు చేసిన ఉపకారము మరువలేకున్నాను. మహానుభావా నా మనస్సు ఎంతో సంతోషముతో మిమ్ములను స్తుతించాలని ఉన్నా నోట మాటలు రాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనందభాష్పములతో తమ పాదాలను కడుగుచున్నాను. తమకు ఎంతసేవ చేసినను తనివితీరదు. మీబోటి మునిశ్రేష్టుల పట్ల, ఆ శ్రీమన్నారాయణుని పట్ల మనస్సు గలవాడనై ఉండునట్లు నన్ను ఆశీర్వదించండని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు ఆహ్వానించెను.
ఈ విధంగా తన పాదాలపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా! యెవరు ఎదుటివారి బాధను తొలగించి, ప్రాణాలను కాపాడుదురో, ఎవరు శత్రువునికైననూ శక్తికొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మ శాస్త్రములు చెప్తున్నవి. నీవు నాకు ఇష్టుడవు. తండ్రితో సమానమైనవాడవు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర యేకాదశి వ్రతనిష్టుడవగు నీకు నా వల్ల బాధ కలిగినందుకు నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని. నాకు సంభవించిన ఆపదను తొలగించుటకు నీవే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటి కాదని దూర్వాసమహాముని పలుకుతూ అంబరీషుని అభీష్టము మేరకు పంచభక్ష్యపరమాన్నములతో సంతృప్తిగా విందారగించి, అతని భక్తికి మెచ్చి, అంబరీషున్ని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను.
ఈ సంఘటన అంతా కార్తీక శుద్ధ ద్వాదశీ రోజున జరిగినది. కాన ఓ అగస్త్య మహామునీ! ద్వాదశీ వ్రత ప్రభావమెంతటి మహత్యము గలదో గ్రహించితివిగదా! ఆ రోజు విష్ణుమూర్తి క్షీరసాగరమందు శేషశెయ్యపై నుండి లేచి ప్రసన్న వదనంతో ఉండును. కనుకనే ఆ రోజుకు అంతటి శ్రేష్టత, మహిమ కలిగినది. ఆ రోజు చేసిన పుణ్యము ఇతర రోజులలో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసముండి పగలంతా హరినామ సంకీర్తనముతో గడిపి ఆ రాత్రంతయూ పురాణ పఠనము చదువుతూ, లేక వింటూ జాగరణ చేసి మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టివాని సర్వపాపములూ ఈ వ్రత ప్రభావం వల్ల తొలగిపోవును. ద్వాదశీ రోజు శ్రీమన్నారాయుణకు ఇష్టమైన రోజు కనుక ఆ రోజు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్ననూ, ఆ ఘడియలు దాటకుండానే భోజనం చేయవలెను.
ఎవరికైతే వైకుంఠములో స్థిరనివాసం ఏర్పరచుకొని ఉండాలనే కోరిక ఉండునో అటువంటివారు ఏకాదశీ వ్రతము, ద్వాదశీ వ్రతమూ రెండునూ చేయవలెను. ఏ ఒక్కటీ విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధాలా శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రం అనుమానించకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది. అయిననూ అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసములో భక్తితో చేసిన ఏ కొంచెం పుణ్యమైననూ అది చివరి దశలో యమదూతల పాలుకానీక కాపాడును. అందులకే ఈ కార్తీకమాస వ్రతము చేసి దేవతలేకాక సమస్త మానవులు తరించిరి. ఈ కథను ఎవరు చదివినా లేక వినిననూ సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని వివరించెను.
ఏకోనత్రింశాధ్యాయము ఇరువది తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|