|
|
Articles: TP Features | శ్రీలంక తెలుగువారి తపన - Mr. Ramesh Sa.Ven.
| |
వెంటనే సుబ్బారెడ్డికి ఫోను చేసి రాజస్థానంలోని బహురూపుల గురించి అడిగినాను. డోర్ సినిమాను మూడొంతులు రాజస్థానంలోనే తీసింది. సుబ్బారెడ్డి వెంటనే ఆసక్తిగా కదిలినాడు. వాళ్ళ జట్టు రాజస్థాన్ కు పయనమవబోతూ ఉంది, ఇంకొక సినిమా తీయడానికని. తప్పకుండా బహురూపులను కనిపెడతామని చెప్పిన సుబ్బారెడ్డి నాలుగునాళ్ల తరువాత నిరాశగా ఫోన్ చేసినాడు. వీళ్లు పోయేసరికి ఆ ఎడారిలో పెద్దవానలట. సినిమా తీయడం ఆగిపోయింది. అందరూ తిరిగి హైదరాబాదుకు వచ్చేసినారు. ఇంకొక రెండు వారాలు పనేమీ లేదు, విసుగ్గా ఉంది. క్రికెట్ చూడడానికి శ్రీలంకకు పోతున్నాను, మీరూ వస్తారా అని అడిగినాడు. నేను రాలేనని చెప్పి అక్కడ పాములనాడించే వాళ్లుంటే పలుకరించండి, వాళ్లు తెలుగే మాట్లాడతారు అని అన్నాను.
నాలుగయిదు నాళ్ల తరువాత లంకనుంచి ఒక ఫోను. అందులో సుబ్బారెడ్డి గొంతు ఉవ్వెత్తున వినబడింది. 'హాయ్ రమేశ్, సిగిరియా బండ దగ్గర పాములవాళ్లు కనిపించారు. తెలుగు బాగా మాట్లాడుతున్నారు. రేపు వాళ్ల పల్లెకు రమ్మని పిలిచారు. వెళుతున్నాను. నా దగ్గర వీడియో కెమెరా ఉంది. షూట్ చేసి తీసుకొస్తాను' అంటూ.
ఇంకొక వారం తరువాత చెన్నపట్నంలో విమానం దిగి నేరుగా నా దగ్గరకొచ్చి తను మోసుకొచ్చిన లంక తెలుగును నా ముందు పోగుబోసినాడు. క్రికెట్ చూడడానికని కదా లంకకు పోయింది. ఆటకు ఆటకు నడుమ చూడవలసిన ఊర్లను చుట్టేవాడట. పోయిన తావులంతా పాముల్నాడించే వాళ్ల కోసం కళ్లు కలియదిరిగేవట. సిగిరియా బౌద్ధ ఆరామం దగ్గర పాముల్నాడిస్తూ కనిపించినాడట ఒక మహన్నబావుడు. దగ్గరకు పోయి పలుకరిస్తే ముందు సందేహంగా చూచి కాసేపటికి కలిసిపోయినాడట. అతని పేరు మసెన్న. వాళ్ళ ఊరి పేరు చెప్పి రమ్మని పిలిచినాడట. పక్కదినమే పయనమై ఆ పల్లెకు పోయినాడు. ఆ పల్లె పేరు దేవరగమ్మ. ఒక పెద్ద చెరువు అంచునుంది అది. నలభై కుటుంబాలు, సుమారు ఇన్నూరు మంది అహికుంటికలున్నారు ఆ పల్లెలో. వాళ్లతో గడిపిన తీపి తలపులను దాదాపు ముండు గంటల నిడివి ఉన్న పటంగా పట్టుకొచ్చినాడు.
ఉపకులాలవాళ్లు పల్లెలకొచ్చి పెద్ద పటాన్ని వేలాడదీసి గంటలు గంటలు కత చెబుతుంటారు చూడండి, అట్లా నడుమ నడుమ నాలుగు నాలుగు మాటలు చెబుతూ నడిరేయి దాటేదాకా లంక తెలుగువాళ్ల కతను వీడియో పటం కట్టి చూపుతూనే ఉండినాడు ఆ పొద్దు సుబ్బారెడ్డి.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|