TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
మహా సరస్సు మాయం
- Editor
< < Previous   Page: 3 of 5   Next > >  
సత్తుపల్లి, గంగారం మధ్యన ఒక పాయ బయలుదేరి, ఏలూరు మీదుగా కొల్లేటి సరస్సులో, మరికొన్ని పాయలు పాలకొల్లు, నర్సాపురం మీదుగా వెళ్లి సముద్రంలో కలిసేవి. సత్తుపల్లి మెరక మీద నిలబడి ఆగ్నేయం వైపు చూస్తే, విశాలమైన నదీ ప్రవాహ ప్రాంతపు శిధిల రూపం కనుచూపు మేర స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రెండవ పాయ దమ్మపేట, మల్కారం, అశ్వారావుపేట మీదుగా ప్రవహించి జంగారెడ్డిగూడెం, పోలవరం, రాజమండ్రి, కాకినాడ దాకా పాయలు, పాయలుగా విస్తరించి బంగాళాఖాతంలో కలిసేవి. మల్కాపురం గట్టు నుండి చూస్తే, విశాలమైన ఆ నదీ పరీవాహ శిధిలరూపాన్ని గమనించవచ్చు. ఇటు పాలకొల్లు, నర్సాపురం నుండి అటు కాకినాడ వరకు గల ప్రాంతమంతా అనేక పాయలు, పాయలుగా చీలి పారేవి. ప్రకృతి సవ్యంగా సహకరించి ఉంటే ఆ సరస్సూ, ఆ సరస్సు తీరం నుండి ఆగ్నేయంగా బయటకు వెడలిన ఆ రెండు పాయలు ఇప్పటికీ క్షేమంగానే ఉండేవి. కాని ఊహించని ఉత్పాతం, బడబాగ్ని రూపంలో ఉప్పతిల్లింది. సరస్సులోని బడబాగ్నికి సరస్సు కింద ఉన్న భూమి కంపించి ఆ సరస్సుకు పోటుగా, అడ్డుకట్టగా నిలిచి ప్రస్తుతం మనం పాపికొండలంటున్న పర్వతం బీటలు వారి పెద్ద నెఱ్రె ఏర్పడింది. ఇంకేముంది సాగరంగా విస్తరించిన ఆ మున్నీరు ఒక్కుమ్మడిగా దూసుకుని వచ్చే ఆ ప్రవాహపుటుధృతికి ఆ నెఱ్ఱె ఇంకొంత ఎడమైంది. దీనివల్ల సరస్సు ఎండిపోయింది. ఈ సరస్సు నుండి ఆగ్నేయంగా సముద్రం వైపు పయనించసాగింది. సరస్సు అంతర్ధానమైనా అలనాటి ఆ సరస్సు శిథిల చిహ్నాలను మాత్రం విడిచి వెళ్ళింది. ఆ మహా సరస్సుకు నిదర్శనాలేమిటి? : గోదావరిని నిలువరించిన కొండల వల్ల (పాపి కొండలు) పెద్ద సరస్సు ఏర్పడిందని, అది అగ్నిపర్వతం వల్ల భూమి కంపించి (భూకంపం) కొండ విరిగిపడి సరసు బదాబదలైందనటానికి నిదర్శనాలేమిటి? అని అడగటం సహజమే. ఈ ప్రశ్నకు సమాధాలివ్వటానికి ప్రయత్నిస్తాను. 1. పాపికొండలకు పడమట, 'భద్రాద్రి'కి తూర్పున 'గోదావరి' ఒడ్డున 'ఉష్ణగుండాల' అనే గ్రామం ఉంది. అక్కడ శీతాకాలం ప్రొద్దున్నే గోదావరి గట్టుకు వచ్చి చూస్తే, నది నీటి మీద మోళెం (నీటి ఆవిరి దట్టంగా) కొంతమేరకు ఆవరించి ఉంటుంది. ఎండాకాలం నదీప్రవాహం తగ్గుతుంది. చలికాలంలో మోళెం పట్టినచోట ఇసుకతిన్నెలో చెలమను తవ్వుతారు. చెలమలో ఇసుక కూలి చెలమ(గొయ్యి) పూడిపోకుండా తడికెలు ఏర్పాటు చేస్తారు. అందులో ఊరిన నీరు మహావేడిగా ఉంటుంది. బియ్యం కొద్దిగా మూటగట్టి ఆ నీటిలో వేస్తే ఉడికి అన్నం తయారవుతుంది. ఆ వేడి నీటిని తోడుకుని చన్నీళ్లతో కలిపి స్నానం చేస్తారు. ఆ నీటి వల్ల అన్ని రుగ్మతలు (వ్యాధులు) పోతాయని అంటారు. ఆ వేడి నీటి గుండం వల్లే ఆ ఊరికి 'ఉష్ణగుండాల' అని పేరొచ్చింది. అదే అగ్ని పర్వత కేంద్రం. 1986లో ఒకమారు భూమి కంపించింది. దాని కేంద్రం ఈ ఉష్ణగుండాల అని శాస్త్రజ్ఞులు తెలిపారు. నేనప్పుడు కల్లూరులో ఉన్నాను. తిరిగి రాత్రి 8 గంటలకు బయ్య్.... మంటూ పెద్ద శబ్దంతో పాటు ఇళ్ళన్నీ ఊగటం మొదలుపెట్టాయి. అంతా హా-హా కారాలు చేస్తూ బయటకు వచ్చారు. భూకంపం కొన్ని సెకండ్లే ఉండటం వల్ల ప్రమాదమేమీ జరుగలేదు. కాని కల్లూరు నుండి భద్రాచలం వరకు ఇళ్ళ గోడలన్నీ బీటలు వారాయి. అక్కడి నుండి, అంటే ఉష్ణగుండాల నుండి, నేరుగా సత్తుపల్లి వస్తే గంగారం దాటిన తర్వాత మేడిశెట్టివారిపాలెం వస్తుంది. ఆ తర్వాత రోడ్డు వంకర తిరిగి తూర్పునకు అశ్వారావుపేట వైపు వెళుతుంది. ఆ వంక తిరిగిన చోటుకు శీతాకాలం రాత్రిళ్ళు కారులో రాగానే అద్దాలను మంచు మూసివేస్తుంది. వైపర్సును ఉపయోగించకపోతే దారి కనబడదు. ఫర్లాంగు ముందుకెళ్ళగానే మంచు మాయమవుతుంది. మోటారు సైకిలు మీద శీతాకాలం రాత్రిళ్ళు వెళితే చలికి కాళ్లు చల్లబడి చల్లగాలి కాళ్ళను పీడిస్తుంది. కాని ఆ వంక దగ్గరకు రాగానే వెచ్చటి గాలి సోకి హాయి అనిపిస్తుంది. అంటే ఆ వంపు కింద భూమిలో ఆరిపోయిన అగ్నిపర్వతం ఉన్నది. అదే రోడ్డున 20 కిలోమీటర్ల ముందుకు వెళితే అచ్యుతాపురం దాటాక ఒక గట్టు వస్తుంది. అక్కడా ఇదే స్థితి. ఆ గట్టు కింద అణగారిపోయిన అగ్ని పర్వతం ఉన్నది.

Be first to comment on this Article!

< < Previous   Page: 3 of 5   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.