|
|
Articles: My Thoughts | షడంగాల నెలవు - Site Administrator
| |
ఎదుటివాడు, మనవంటి పండితుడు కాదు, మనకన్న పామరుడూ కాదు. వాడూ మనలాటివాడే! వాడి భాషే మన భాష.
నేను విన్నవి - కన్నవి - కాగితం మీద పెట్టాను. అది నా భాషా? అందరి భాషా కాదా?
గిడుగు వాగమశాసనుడు యీ తరంలోనూ, ఎల్లకాలమూ కలంబట్ట నేర్చేవారందిరకీ ఉపాస్యదైవం. నాకు మరీ ముఖ్యంగాను.
నీవు అనుకున్నది ఏమై ఉండునో నీ రచనలో స్పష్టంగా తెలియకపోతే, నీవు తెలుగువాడవేనా? నీది తెలుగుభాషేనా?
అయితే - 'లాకాయ్ లుకాయ్ వాళ్ళందరికోసంకాదు నా రచన! - అనుకుంటూ బుజాలు చరుచుకునే వాళ్ళూ లేరంటావా? - ఉన్నారు! అది వాళ్లవాళ్ల లలాట లిఖితం..'
యీ తీరు శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రి గారిది! యీ ధోరమి వారి వచనరచనకు శ్రీకారం.
ఆయన భిషక్కు, కాని ఆవంత అయినా 'భేషజం' లేదు.
ముక్కుకు సూటిగా పోయే మనిషి - కాని లోకం పోకడలో ఎన్ని డొంకతిరుగుళ్ళు ఉన్నాయో క్షుణ్ణంగా తెలుసుకున్నాడు - తెలిసినవాడు! ఒక్కమాట ఎన్ని చిలువలుపలవులు వేయగలదో తరచి చూసినవాడు, మన తెలుగే తానైనవాడు.
కన్నులలో, రవపాళపు చురచుర ఉన్నది కాని, ఆ చూపు వెన్నవంటది.
మాటలో, ఓ వీసపాలు గరుసు కద్దు. కాని మనసు అతి - సుతిమెత్తన!
మనిషి మాంచి పొడగరి! మెలకువలో గడుసరి, ముక్తసరిగా - మాటకారి. ఆయనది పరువిచ్చే చిరునవ్వు, పరాయివాడినైనా ప్రత్యుత్థానం చేసే - శోత్రియపు ఠీవి. తన మరియాద, ఎదుటివారికి ఆదరణగా అందించే రాజసం!
ఇలాటివారు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు :
ఆయన రాసిన కథలు, ఇంచుమించు లెక్కలేనన్ని, అవన్నీ మేలు రతనాలు! చదువరులకు చదువు చెప్పగలిగినది ఆయన రచన - విద్యాబుద్ధులున్న అంహాకారులకు కనువిప్పు చేసినది ఆయన వచనము! తీయందనపు - తీయందనము చవులిచ్చిన దాయన శైలి.
ఆయన రచనలు మరో భాషకు లొంగవు! జాను తెలుగు నేర్పి వారికే, తెలుగువారైనవారికే శ్రీ శాస్త్రి గారి కథలు చదివి ఆనందించే అదృష్టము.
('ఇయర్స్ ఆఫ్ విజన్' - పి.పి.రావు ఫెలిసిటేషన్ కమిటీ వారి ప్రచురణ నుంచి ధన్యవాదాలతో)
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|