|
|
Articles: TP Features | ప్రయోజనాత్మక దృష్టి - Site Administrator
| |
తెలుగుజాతిని, భాషని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, నేటి అవసరాలకు తగినట్లు ఎలా రూపొందించుకోవాలి, భవిష్యత్తు కోసం ఎలా రూపకల్పన చేసుకోవాలి అన్నదే మన ఆలోచనావిధానంగా ఉండాలి. ఇదే ప్రయోజనాత్మక దృష్టి అంటే. పరిశోధనాత్మక దృష్టి కూడా అవసరమే. ప్రయోజనం లేని పరిశోధన వెర్రితలలు వేసే ప్రమాదం ఉంది. ఈనాడు తెలుగువారిలో ఎవరు ఎక్కడి నుండి వచ్చారో వెతుక్కుంటూ వెళ్తే ఎన్ని ఆశ్చర్యాలు ముంచుకొస్తాయో తెలీదు. తెలుగు బ్రాహ్మణులంతా ఆర్యులా, ద్రావిడులా లేక మిశ్రమజాతి వారా అని ఎవరైనా తేల్చగలరా? రెడ్లకు, రట్టగుళ్ళకు, రాష్ట్రకూటులుకున్న సంబంధాలేమిటి? వైశ్యులు వంగ దేశం నుండి వచ్చారా? వారిలో ఈశాన్య ప్రజల లక్షణాలున్నాయా? ఎరుకలు, యానాదులు ఇంకా ఎంతో మంది ఆదిమజాతుల మూలాలు వెతుక్కుంటూ వెళ్తే ఆఫ్రికాకు వెళ్ళాలా? ఆస్ట్రేలియాకు వెళ్ళాలా? ఆరామ ద్రావిడులు, కోనసీమ ద్రావిడులు ఆ తర్వాత వచ్చిన పుదూరు ద్రావిడులు తమిళులేనా లేక కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి కాబట్టి తెలుగువాళ్ళేనా? ఇంటి పేర్ల వల్లనే తెలుగువాళ్ళని గుర్తిస్తున్న మనం ఇప్పటికీ కందాళై, శ్రీరంగం, కోవెల (కెయిల్) ఇంటి పేర్లతో ఉన్నవారిని తమిళులనాలా? తెలుగు ఇంటి పేర్లను మరచిపోయి నంజనగూడు, కణగాల్, తళుకు, తొగెరె లాంటి పేర్లను పెట్టుకున్నవారిని తెలుగువారనాలా కన్నడిగులనాలా? ఇవన్నీ సాగదీస్తూ పోతే ప్రయోజనం కంటే పరిశోధన ఎక్కువవుతుంది.
చివరికి తేలేదేమిటంటే మానవశాస్త్ర పరంగా, సామాజికశాస్త్ర పరంగా, భాషా పరంగా పరిశోధనలు అవసరమే. కాని అవే పరమార్థం కాదు. భాషని ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్దే ప్రయత్నాలే మనం ముఖ్యంగా కొనసాగించాలి. పరిశోధనని, ప్రయోజనాన్ని సమన్వయ దృష్టితో చూచినప్పుడే భాషకి మేలు జరుగుతుంది. ఇందుకోసం...
- తెలుగులో విద్యాబోధన జరగాలి
- తెలుగులో పూర్తిగా పరిపాలన సాగాలి
- ప్రజలు పూర్తిగా తెలుగులో వ్యవహరించే అవకాశం ఒనగూడాలి
- తెలుగువారు వాడిన, వాడుతున్న ప్రతి పదమూ దాని అర్థమూ ఉండే సమగ్ర నిఘంటువు తయారుకావాలి
- తెలుగువారి మంచి పుస్తకాలన్నీ ఇతర భాషలకి అనువాదం కావాలి
- ప్రపంచజ్ఞానమంతా ఎప్పటికప్పుడు తెలుగులోకి రావాలి
- ప్రపంచంలోని తెలుగుజాతిని గూర్చిన సమగ్ర సమాచారం సంపాదించాలి
- తెలుగులో చదివినవారికి ఉద్యోగాలివ్వాలి
- బంగారు భవిష్యత్తుకి బాట ఇదే.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|