|
|
Articles: TP Features | వోటు మారితే సీటు 'చే'జారినట్టే! - Site Administrator
| |
చాలా నియోజకవర్గాలలో మిత్రపక్షాల కేడర్ల మధ్య కనీసమాత్రంగానైనా పరస్పర విశ్వాసం ఏర్పడలేదు. దానితో ఆయా ప్రాంతాల్లో పోటీలో లేని మిత్రపక్షాల కార్యకర్తలు తమ పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నా ఇతర నియోజకవర్గాలకు వెళ్ళి పనిచేస్తున్నారు. మహాకూటమి నేతలు రెండు మూడు చోట్ల సమైక్యంగా సభలు నిర్వహించడం తప్ప క్షేత్ర స్థాయిలో ఉమ్మడిగా ప్రచారం జరుపుతున్న దాఖలాలు కనిపించడం లేదు. మహాకూటమి ఏర్పాటు వల్ల వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీకి మాత్రం కొంత లాభం కలిగింది. మొదట వామపక్షాలు, ఆ తర్వాత టిఆర్ఎస్ తనతో జతకట్టడం వల్ల టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఇక తనకు తిరుగులేదని, మళ్ళీ అధికారంలోకి రావడం తనకు సాధ్యమేనని సంకేతాలు పంపడం వల్ల అనేక జిల్లాల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో తన పార్టీ కార్యకర్తలు ప్రజారాజ్యం వైపు వలస వెళ్ళకుండా ఆపగలిగారు. వామపక్షాల వోట్లు తమకే తప్పకుండా బదిలీ అవుతాయన్న నమ్మకంతోనే ఉన్న టిడిపికి టిఆర్ఎస్ వోట్ల ట్రాన్స్ ఫర్ పై మాత్రం విశ్వాసాన్ని పెంచుకోలేకపోతోంది.
టిఆర్ఎస్ లో అయోమయం
టిక్కెట్ల పంపిణీ విషయంలో అత్యంత గందరగోళ పరిస్థితి ఏర్పడిన పార్టీల్లో ప్రజారాజ్యం తర్వాత స్థానం టిఆర్ఎస్ దే. చాలా స్థానాలలో ప్రత్యర్థులకు టిక్కెట్ లేకపోవడంతో వారు పార్టీ కార్యాలయం వద్ద ధర్నాలు చేసి చివరకు తిరుగుబాటు అభ్యర్ధులుగా రంగంలోకి దిగారు. పొత్తులలో భాగంగా తీసుకున్న సీట్లలో బలమైన అభ్యర్థులను పెట్టలేక పోవడం, బలం లేకపోయినా కొన్ని సీట్లను తీసుకోవడం వంటి కారణాల వల్ల కొన్ని సీట్లను అప్పనంగా కాంగ్రెస్ కే కట్టబెట్టే పరిస్థితి ఏర్పడింది. సికింద్రాబాద్ లోక్ సభ స్థానాన్ని సామల వెంకటరెడ్డి అనే వ్యక్తికి కేటాయించడంలో డబ్బులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలతో టిఆర్ఎస్ ప్రతిష్టను బాగా దిగజార్చింది. చివరకు అభ్యర్థిని మార్చినా జరగాల్సిన డామేజి జరిగిపోయింది. సికింద్రాబాద్ లోక్ సభ స్థానం, రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం వంటి చోట్ల బలం లేకపోయినా అభ్యర్థులను బరిలోకి దింపడంతో ఆ రెండు స్థానాల్లోనూ టిడిపి అధికారికంగానే సుధీష్ రాంభాట్ల, తీగల కృష్ణారెడ్డిలను ఆఖరి నిముషంలో నిలబెట్టి భిఫారాలు ఇచ్చింది.
పాపం ప్రజారాజ్యం...!
సామాజిక న్యాయం, అవినీతి రహిత స్వచ్ఛమైన పాలన అందిస్తామని, ప్రజాసమస్యల పట్ల స్పందిస్తూ సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పుతామని చెప్పుకుంటూ రాజకీయ అరంగేట్రం చేసిన ప్రముఖ సినీ నటుడు చిరంజీవి టిక్కెట్ల పంపిణీ వద్దే చతికిలబడ్డారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ పర్యటించిన చిరంజీవికి లభించిన ఆదరణ సామాన్యమైనదేమీ కాదు. సినిమా నటునిగా ఉన్నా ఆదరణో, రాజకీయాల్లో మార్పు తేగలడన్న విశ్వాసంతోనో జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. జనాన్ని విశేషంగా ఆకట్టుకోగలిగిన రీతిలో ప్రసంగాలు లేకపోయినా ప్రజలు గంటలకొద్దీ ఆయన కోసం వేచి ఉంటున్నారు, నీరాజనాలు పడుతున్నారు. కానీ దురదృష్టవశాత్తూ టిక్కెట్ల పంపిణీ తీరు, పార్టీ నిర్వహణలో లోపాలు ఆ పార్టీకి శాపంలా వెంటాడుతున్నాయి. చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని, టిక్కెట్లు అమ్ముకొని సొమ్ము చేసుకొని నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేశాడని గత 15 రోజులుగా ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన కార్యకర్తలు, నేతలు నిప్పులు గక్కారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|