|
|
Articles: TP Features | భాషాభివృద్ధే పురోగమనం - Site Administrator
| |
మళ్ళీ మనం తెలుగుభాష గురించి ఆలోచిద్దాం.
ఆంధ్రభాషా పదం కూడా మనల్ని నేనున్నానని గిల్లి చెబుతుంది. అత్యధిక శాతం ప్రజలు, జానపదులు సరస్వతికి బదులు శారదని తలుస్తారు. తెలుగు భాషకి మారుపేరుగా ఆమెని పేర్కొంటారు. నా నాలుకపై శారద ఉంది అనడంలో భాష ఉంది అని అభిప్రాయం. శారద నిలిచినంత కాలం పాడుతుంటాను అంటారు శారదకాండ్రు. శారద అనేది తంత్రీ వాద్యం కూడా. ఆ తంత్రీవాద్యాన్ని వాయిస్తూ పాడేవారిని శారదకాండ్రు అంటారు. వీరు తమ ప్రార్థనా గీతంలో శారదనే తలుస్తారు. ఈ అశేష జనాభా తాము మాట్లాడేది తెలుగు అంటారే గాని ఆంధ్రం మాట్లాడుతున్నామని అనరు. అంటే జన వ్యవహారంలో లేదా మౌఖిక రూపంలో మన రాష్ట్రం నలుమూలలా తెలుగు పదమే వాడుకలో ఉంది. దీనికి భిన్నంగా శిష్టులు మాత్రం ఆంధ్రభాషని ప్రసక్తిస్తారు. తద్వారా భాషకి కూడా అదే పదాన్ని అంటగడతారు. ఈ స్థితి ఎందుకు దాపురించింది. సరస్వతి మన భాషకు రెండు పదాలు ఇచ్చి కొంత పొరపాటు పరిస్థితి కల్పించిందా లేదా కొందరు శిష్ట పండితవర్గం సంస్కృతీకరించిన (అంధక శబ్దాన్నుండి ఆంధ్రం) రూపాన్ని ఏర్పరిచారా? తెలుగు పదాన్ని కూడా త్రికళింగం అనే సంస్కృత పదాన్నుంచి ఏర్పడినట్లు చిత్రించడం జరిగింది.
తెలుగు పదం అచ్చతెలుగు పదం. దాన్ని పక్కన పెట్టి ప్రాచీన అనువాద రచయితలు ఆంధ్రం అనే పదాన్ని వాడారు. సృజనాత్మక శక్తి గలిగి, తెలుగు సమాజంలోంచి అనువాదాలు కాకుండా మౌలిక రచనలు చేసినవారు తెలుగు పదం వాడరని ఒక వాదం ఉంది. ఈ వాదాన్ని వివరంగా 'తెలుగా, ఆంధ్రమా' అనే పేరుతో 'వాగరి' అనే రచయిత ఒక పుస్తకమే రాశారు. దీనిని బెజవాడ - 2లో ఉన్న అరండేలు పేటలో 'తెలుగు నానుడి కూటమి' 1968లో అచ్చేసింది. ఈ పుస్తకంలో వీలైనంతవరకు సంస్కృత పదాలను పరిహరించి కొంత కొత్త భాషను, అసలు తెలుగు భాషలో రచించారు.
ఇప్పుడు ఈ విషయాల గురించి ప్రస్తావన ఎందుకు?
ఎందుకంటే -
తెలుగు భాషని పునరుజ్జీవింప చేయాలనే తలంపు చాలా మంది మదిలో మెదులుతున్నది. ప్రపంచీకరణ ప్రభావానికి చాలా భాషలు నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఆ గతి తెలుగుభాషకి పట్టకూడదనే ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడు తెలుగుని కాపాడుకోకపోతే ముందు ముందు మనం అశక్తులమై ప్రేక్షకులుగానే ఉండిపోయే ప్రమాదం ఉంది. నిజానికి మన సొంత భాష పట్ల మనకి పూర్తి అవగాహన లేదు. సంస్కృతభాష పట్ల గల అవగాహననే మనం అన్వయించుకుంటున్నాం. అంటే తెలుగు పట్ల వివిధ కోణాల నుండి వివిధ సైద్ధాంతిక దృక్పథాల వెలుగులో అధ్యయనం ఎక్కువగా జరగలేదు. జరిగినా అది పాత సాంప్రదాయక దృష్టితో ఎక్కువగా జరిగింది. అందువల్ల మనకి ఇప్పుడు భాషా స్పృహ పెరగడానికి ఇలాంటి ఆలోచనలు అవసరం అనే భావన చాలా మందిలో ఉంది.
సృష్టి పుట్టుక భావన భాష పుట్టుకకి అన్వయించడం వల్ల శాస్త్రీయ భావన గండిపడింది. అంతేకాదు సమాజాన్ని, పదార్ధాన్ని, వస్తువుని, జ్ఞానాన్ని కాదని కల్పిత భావనకే ప్రాధాన్యం ఇచ్చేవారు భాష విషయంలోనూ అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|