|
|
Articles: TP Features | భాష మూలాలను హత్తుకుందాం - Site Administrator
| |
గోదావరి నది ఒక చోట ఎండిపోయి కనిపిస్తుంది. మరోచోట దృష్టికి కనబడకుండా ప్రవహిస్తుంది. అంతమాత్రాన అక్కడ జలం లేదని కాదు. భాష కూడా అంతే. సముద్రంలో కలిసేటప్పుడు ఎన్ని క్యూసెక్కుల నీరో కొలిచి చూస్తే తెలుస్తుంది. అలాగే భాష కూడా. పాయలనే చూసి జీవనదిగా భ్రమించకూడదు. ఈ పాయలు లేకుండా నదిని లెక్కించలేనట్లే ఇన్ని పాయల తెలుగులు కలిస్తేనే ఒక భాషా నది. ఎన్ని పాయలు ఎక్కువగా గలగలలాడితే అంత ప్రవాహం అధికం. తెలుగుభాషకి ఈ ఉపనదుల ప్రవాహపు ఉరవడి ఎక్కువ. ఒక్కో చారిత్రక కాలంలో ఒక్కో పాయ తరిగినా మళ్ళీ అది పుంజుకుంటుంది. అంతిమంగా తెలుగుభాషా ప్రవాహపు శక్తికి దోహదపడుతుంది. అదీ ఏటిపాయలకున్న శక్తి. అట్లాగే తెలుగు పాయలు సైతం తెలుగుభాషకి రెట్టింపు పుష్టినిస్తాయి. మనం ఈ ఏటిపాయలను గుర్తించి, వాటిని ఆదుకోవాలి, హత్తుకోవాలి. ఎన్ని ఏరులు ఎక్కువ కలిస్తే అంత పెద్ద జీవనదిగా ఎదిగినట్లు. ఎన్ని తెలుగులు ఎక్కువగా ఉంటే అంతగా తెలుగు భాష అభివృద్ధి చెందుతున్నట్లు!
ఉన్న ఏరులను పనికిరాకుండా చేసి నది క్షీణించిందని బాధపడితే లాభం లేదు. సుదూరపు తెలుగులు, అస్పృశ్య తెలుగులు, శ్రమజీవుల తెలుగులు ఎన్ని ఎక్కువగా బతికితే తెలుగుభాష అంత ముందుకు సాగుతుంది. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే మనకి ఎన్నో పాయల తెలుగు మనముందు ఉంది. ఎన్నో పొరల్లో తెలుగులు ప్రవహిస్తున్నాయి. ఎంతో విలక్షణమైన తెలుగు `జల' ప్రవాహాలున్నాయి. వాటిని కాపాడుకుందాం. రేపు అనే తెలుగు భాషా మహా ప్రవాహంగా మారడానికి హేతువులవుతాయి.
నిజానికి సమస్య తెలుగు భాషది కాదు. తెలుగు భాషీయులది. ఎన్ని కష్టాలైనా ఓర్చి వాళ్ళు తమ తెలుగుని పరిరక్షించుకుంటామని ఒక్కసారి ఒట్టేసుకోవాలి. అంతగా తమ హృదయ వైశాల్యం పెంచుకోవాలి. ప్రేమ భాష పైనే కాదు భాషకు మూలమైన ప్రవాహాలపై కూడా చూపాలి.
కొన్ని నిరంతర భాషా ప్రవాహాలను గుర్తించక, గుర్తించి కూడా కాపాడుకోలేకపోతే తెలుగుభాష అభివృద్ధి చెందదు. భాష అభివృద్ధి చెందాలంటే భాషపై భాషీయుల సంప్రదాయ ఆలోచనలు మారాలి.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|