|
|
Articles: TP Features | కృష్ణస్మరణం పాపహరణం - Site Administrator
| |
శ్రీముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాల్గవపాదం బుధవారం అర్ధరాత్రి యదు వంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా 'శ్రీకృష్ణుడు' జన్మించాడు. అంటే! (క్రీస్తు పూర్వం 3228సంవత్సరం)
జయతు జయతు దేవో దేవకీ నందనోయం
జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీప
జయతు జయతు మేఘ శ్యామల
కోమలాంగో జయతు జయతు పృధ్వీభారనాశో ముకుంద
తాత్పర్యం : ఓ దేవకీనందనా! ఓ వృష్ణివంశ మంగళ దీపమా! సుకుమార శరీరుడా! మేఘశ్యామా! భూభారనాశ ముకుంద! నీకు సర్వదా జయమగు గాక!
ఆ బాలకృస్తుడు దినదిన ప్రవర్ధమానమవుతూ తన లీలావినోదాలతో బాల్యం నుండే అడుగడుగునా భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగిలిస్తూ వెన్నదొంగగా ముద్ర వేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందిట! వెన్న జ్ఞానానికి సంకేతమని చెబుతారు. పెరుగును మథించగా మథించగా వెన్న లభ్యం అవుతుంది. అలాంటి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లటి కుండను బద్దలుకొట్టి మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలంటారు.
అలాగే, చిన్నారి చేష్టలలో శ్రీకృష్ణుడు మరో సందేశాన్ని చెబుతారు. గోపికలు కుండలలో ఇళ్ళకు నీళ్లను యమునానదిలో నుండి తీసుకుని వెళూతూ ఉంటే, రాళ్లను విసిరి చిల్లు పెట్టేవాడట. అలా ఆ కుండ మానవశరీరం అనుకుంటే ఆ కుండలోని నీరు అహంకారం. ఆ అహంకారం కారిపోతేనే గాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు.
ఇక చిన్నతనం నుండే అనేక మంది రాక్షసులను సంహరిస్తూ దుష్ట శిక్షణ, శిష్ఠ రక్షణ చేస్తూ కురుపాండవ సంగ్రామంలో అర్జునునికి రథసారథిగా అర్జునిలో ఏర్పడిన అజ్ఞాననాంధకారాన్ని తొలగించేందుకు 'విశ్వరూపాన్ని' చూపించి గీతను బోధించి, తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించాడు. ఇలా కృష్ణతత్వాన్ని కొనియాడి చెప్పేందుకు వేయి తలలు కలిగిన ఆదిశేషునికే సాధ్యం కాదని చెప్పవచ్చు. అలాంటి శ్రీకృష్ణ భగవానుని జ్ఞానబోధతో అందించిన 'గీతామృతం' మనకు ఆదర్శప్రాయం.
'గీతాచార్యుడు' కృష్ణపరమాత్మ జన్మాష్టమినాడు సూర్యోదయానికి పూర్వమే కాలకృత్యాలు తీర్చుకుని చల్లని నీటిలో 'తులసీదళా'లను ఉంచి స్నానం చేస్తే సమస్త పుణ్యతీర్థల్లోనూ స్నానం చేసిన పుణ్యఫలాన్ని పొందుతారు. కృష్ణాష్టమని రోజు ప్రతి ఒక్కరూ తమ తమ గృహాలను ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో కృష్ణ పాదాలను రంగవల్లికలతో తీర్చిదిద్ది ఆ కృష్ణ పరమాత్మను ఆహ్వానం పలకాలి. ఊయలలో ఓ చిన్నికృష్ణుని ప్రతిమను ఉంచి, రకరకాల పూవులతో గంధాక్షతలతో పూజించి, ధూపదీప నైవేద్యాలతో ఆ స్వామిని ఆరాధించాలి. భక్తులకు తీర్థ ప్రసాదాలు, దక్షిణ తాంబూలాలు సమర్పిస్తే ఎంత మేలో కూడా పౌరాణికులు చెప్పారు. ఇంతేకాక చాలా చోట్ల కృష్ణ పరమాత్మ లీలల్లో ఒక లీలగా ఉట్టికుండ కొట్టే కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉంటారు.
కృష్ణ! త్వదీయ పదపంకజ పంజర్తానం
అద్వైవమే విశతు మానస రాజహంసః||
ప్రాణ ప్రయాణ సమమే కఫవాత పిత్తై
కంఠావరోధనవిదే స్మరణం కుతస్తౌ||
ఓ కృష్ణా! మరణ సమయంలో నిన్ను స్మరిస్తూ నీలో ఐక్యమవ్వాలని కోరిక ఉన్నది. కాని! ఆ వేళ కఫవాత పైత్యాలతో కంఠం మూతపడిపోయి నిన్ను స్మరించగలనో! లేనో? అని తలచి ఇప్పుడే నా 'మానస రాజహంస'ను శత్రు అభేద్యమైన 'నీ పాద పద్మ వజ్రపంజర'మందు ఉంచుతున్నాను తండ్రీ...!
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|