|
|
Articles: Drama | మాతా పుత్ర విరోధాయ... - Mr. kompellaramakrishna murty
| |
సీతమ్మ: (నాగలి నారాయణకిస్తూ) ఈ నాగలితో పగలగొట్టరా త్వరగా..
నారాయణ: (నాగలి తీసికొని) అలాగేనమ్మా! (పగలగొట్టాడు)
సీతమ్మ: (ఆనందంగా) అమ్మో! అమ్మో! బంగారునాణాలు! లక్ష్మీదేవీ.. తల్లీ! ఘల్లుఘల్లుమంటు నడచుకుంటు వచ్చేశావా తల్లీ!
నారాయణ: అమ్మా! మన దరిద్రం తీరిపోయింది. రాబోయే నా భార్యకు... వీటితో బోలెడు నగలు చేయించవచ్చు కదమ్మా..!
సీతమ్మ: ఔనౌను చేయించవచ్చు! తేరగా వచ్చింది కదా అని విరజిమ్ముకోకూడదు. ఏం చేయలో, ఎలా చెయ్యాలో పెద్దదాన్ని... నేను ఉన్నానుకదా! చెప్తానుగానీ అక్కడ ఇంకొక బిందె కూదా ఉందేమో.. సరిగా చూశావా?
నారాయణ: చూశానమ్మా! ఇంకేమీ కనిపించలేదు.
సీతమ్మ: నీ మొహం.. నువ్వొక వెర్రిమాలోకానివి! ఎక్కడైనా లంకె బిందెలే ఉంటాయితప్ప, ఒక్క బిందె ఉండదు. ఖచ్చితంగా అక్కడ ఇంకొక బిందె కూడా ఉండిఉంటుంది. కాస్త కళ్ళు విప్పి చూడు... వెళ్ళు.
నారాయణ: వెడతానులే అమ్మా! నాకు ఆకలేస్తోంది... అన్నం తిని...
సీతమ్మ: ఓరి నీ ఆకలి చట్టుబండలు కానూ... ముందు వెళ్ళి ఆ బిందె కూడా తీసుకురా... వచ్చాకా అన్నం పుచ్చుకుందువుగాని..
నారాయణ: అలాగే అమ్మా... (వెళ్ళాడు)
సీతమ్మ: ఔరౌరా! కాసులు కంటపడగానే కట్టుకోబోయేది తప్ప కన్నతల్లి గుర్తుకు రాలేదు బిడ్డకి! భార్యకు బోలెడు నగలు చేయిస్తాడట! ఇక వీడిలాగే తయారౌతాడు. పెళ్ళాం బెల్లమౌతుంది, తల్లి అల్లమౌతుంది! వంటిమీదికిన్నేళ్ళు వచ్చినా..
ఒక మంచి బట్ట ఎరుగుదునా? చిన్నమెత్తు బంగారం ఎరుగుదునా?
బతికినంత కాలం ఎలాగూ బతకను. ఉన్న నాలుగునాళ్ళైనా దర్జాగా బతుకుతాను! వీడికి పెళ్ళయి, వీడిపెళ్ళాం కాపురానికి వస్తే .. నా బతుకు కుక్క బతుకై పోతుంది! ఏం కావలసివచ్చినా 'దేహీ' అని వాళ్ళని బిచ్చం అడగాలి! అమ్మో అలా జరగటానికి వీల్లేదు. ఈ డబ్బు నాకే దక్కాలి!.. వీడు బతికి ఉంటే... ఇది నాకు దక్కదు. అందుకే... పాపమైనా సరే... వీణ్ణి... చంపెయ్యాలి!... ఎలా చంపటం?... ఆ... ఇదిగో ఈ పురుగుల మందు ఉందికదా... దీన్ని అన్నంలో కలిపేస్తాను! తప్పదు... తప్పదు!
(పురుగులమందు అన్నంలో కలిపి మళ్ళీ యధాతథంగా మూటకట్టేసింది)
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|