|
|
Articles: TP Features | శ్రీలంక తెలుగువారి తపన - Mr. Ramesh Sa.Ven.
| |
అహికుంటికల కతలు చెప్పాలంటే అదొక పొత్తమవుతుంది. ఈ కొద్ది పుటలు చాలవు. అందుకే కొద్దికొద్దిగానే చెబుతాను మీక్కూడా.
ఆ పల్లె పల్లెంతా వచ్చి సుబ్బారెడ్డిని పలకరించింది. ఇల్లూ వాకిలీ తెరువూ చెరువూ దేనినీ వదలకుండా చూపించినారు. పుట్టుక నుంచి చావు వరకూ వాళ్ల ఆచార వ్యవహారాలను విడమరచి చెప్పుకొన్నారు.
సింహళం వాళ్లు వీళ్ళని అహికుంటికలు అంటారు. వీళ్లని వీళ్లు కొరస జాతి అని చెప్పుకొంటారు. మగవాళ్లు పాముల్నాడిస్తారు. ఆడవాళ్లు సోది చెబుతారు, పచ్చబొట్లు పొడుస్తారు. అనూరాధాపురం జిల్లాలో మూడు పల్లెలు, బట్టికలోవ జిల్లాలో రెండు, త్రికోణముల (ట్రింకోమలై) జిల్లాలో రెండు పల్లెలు మొత్తం మీద అంతా కలిసి వెయ్యికి మించదు వీళ్ల లెక్క. నిన్న మొన్నటి వరకూ ఊర్లు తిరిగిన కులమే గానీ ఇప్పుడిప్పుడే కుదురుకొన్నారు.
ఈ తరంలో వాళ్లు బడికి పోతున్నారు. ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్న మసెన్న కొడుకు దేవరగమ్మలో పెద్ద చదువరి. ఆ పల్లెలోని డెబ్బ యేండ్ల ఎర్రన్న చాలా సంగతులను చెప్పినాడు.
వీళ్ల తెలుగు తెందెలుంగు. ఇప్పటి తమిళనాడులోని చాలా చోట్ల కనిపించే రకరకాల తెలుగు యాసలు వీళ్లలో కనిపించినాయి. చోళమండలపు తెలుగు వాళ్లలా అల్లా ఇల్లా అంటారు. హోసూరు ప్రాంతంలోని నంజర (మాంసం) లాంటి మాటలు, ఎదురుకాలంలో లింగభేదం లేని క్రియారూపాలు (నేను రాను, మేము రాము, నువ్వు రావు, వాడు రాడు, ఆమె రాదు అనే వాడుకకు బదులుగా నేను వచ్చేలే, మేము వచ్చేలే, నువ్వు వచ్చేలే, వాడు వచ్చేలే, ఆమె వచ్చేలే అని వాడడం) లంక తెలుగులో ఉన్నాయి. వచ్చేలే అంటే వచ్చేది లేదు అని. హోసూరు ప్రాంతంలో ఇప్పటికీ ఇదే వాడుక ఉంది. ఏ తావునున్న తెలుగు వాళ్లకైనా లంక తెలుగు బాగా తెలుస్తుంది. హోసూరు వాళ్లకయితే మరీ తేటతెల్లంగా తెలుస్తుంది.
వీళ్లలో రెండు ఇంటిపేర్లున్నాయి, దూవురోళ్లు, దేబలోళ్లు అని. ఒకరికొకరు మామా అల్లుళ్ల వరుసవుతారట. ఒకే ఇంటి పేరువాళ్లు పెండ్లి చేసుకోరు.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|