|
|
Articles: TP Features | వోటు మారితే సీటు 'చే'జారినట్టే! - Site Administrator
| |
ప్రజారాజ్యం ఆవిర్భావానికి ముందు నుంచే పనిచేస్తున్న ఆంజనేయరెడ్డి, పరకాల ప్రభాకర్, కేశినేని నాని వంటి అనేక మంది చేసిన ఆరోపణలు, ఆ పార్టీని వదిలి వెళ్ళిన అభిమానులు, కార్యకర్తల ఆక్రోశం విన్నవారికి ప్రజారాజ్యంపై కొంతవరకు భ్రమలు తొలగిపోతాయి. ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆఖరి నిముషంలో వచ్చి చేరిన సుమారు 5 మందికి టిక్కెట్లు ఇచ్చిన తీరు పిఆర్పీ కేడర్ ను ఆగ్రహావేశాలకు గురిచేసింది. 'ఒక కమిటీ లేదు... ఒక చర్చ లేదు... ఒక ఉమ్మడి నిర్ణయం లేదు' అంతా అల్లు అరవిందే నిర్ణయాలు తీసుకోవడంతో ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. అయినా అధినేత చిరంజీవి పెదవి విప్పలేదు. పరిస్థితిని చక్కదిద్దలేదు. ఒక రాజకీయ పార్టీలా కాకుండా ఒక 'ఫ్యామిలీ వ్యవహారం'లా సాగుతున్న పిఆర్పీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నదే తప్ప మెరుగుపడుతున్న సూచనలు కనిపించడం లేదు. బిసిలకు వందకు పైగా సీట్లు ఇచ్చినా, ఆరు జనరల్ స్థానాల్లో ఎస్.సి, ఎస్.టిలను అభ్యర్థులుగా పెట్టినా, తూర్పు, పశ్చిమ గోదావరి లాంటి జిల్లాల్లో కులాల మధ్య సమతుల్యం పాటించినా ఆ పార్టీ విశ్వసనీయతను పెంచలేకపోయాయి. చిరంజీవి, పవన్ కల్యాణ్ రోడ్ షోలు తప్ప ఇతర నేతలెవ్వరూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని జనంలో విశ్వాసాన్ని పాదుగొల్పే ప్రయత్నాలు కనిపించడం లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప చిరంజీవి పార్టీ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.
ప్రజారాజ్యం ఆవిర్భావం వల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఎవరికి లాభం కలుగుతుందన్నదే ప్రధాన ప్రశ్న. ప్రతిపక్ష వోట్లను చీల్చి కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందా లేక, బిసిలు, కాపుల వోట్లను లాక్కొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తుందా అన్నది ఇప్పుడే విశ్లేషకులు తేల్చలేకపోతున్నారు. కాంగ్రెస్, మహాకూటమిలలో దేనికీ మెజారిటీ రాకపోతే ప్రజారాజ్యం ఎమ్మెల్యేలను ఎవరికి మద్దతు ఇస్తారు? గెలిచిన ఎమ్మెల్యేలు చిరంజీవికి ఏ మేరకు విధేయంగా ఉంటారన్నదీ చెప్పడం కష్టమే!
బిజెపిలో నైరాశ్యం...
కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తే వందరోజుల్లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని బిజెపి చెబుతున్నా ప్రజలు విశ్వసిస్తున్నట్లు కనిపించడం లేదు. ఒక వోటు రెండు రాష్ట్రాలంటూ 1997లో కాకినాడలో చేసిన తీర్మానాన్ని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అటకెక్కించిన బిజెపి ఇప్పుడు నెత్తీనోరూ మొత్తుకుంటూ ఎన్ని చెప్పినా ఎవ్వరూ నమ్మని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర, కేంద్ర కార్యవర్గాలు తీర్మానాలు చేసినా, ఎల్.కె అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, నరేంద్ర మోడీ వంటి నాయకుల చేత చెప్పించినా ఫలితం కనిపించడం లేదు. 1999లో 7 లోక్ సభ స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాలు సాధించిన బిజెపి 2004లో రెండు అసెంబ్లీ సీట్లకు పరిమితమైంది. సికింద్రాబాద్ లోక సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్.ఇంద్రసేనారెడ్డి, చేవెళ్ళ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బద్దం బాల్ రెడ్డి గెలుపుమీద ఆశలు పెట్టుకున్నారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి (అంబర్ పేట), కేంద్ర మాజీ మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు (వేములవాడ), మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ (ముషీరాబాద్), మరో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి (పెద్దపల్లి) అసెంబ్లీకి ఎన్నికవుతామన్న ఆశతో ఉన్నారు. కానీ వీరి గెలుపుకూడా అంత సునాయాసంగా కనిపించడం లేదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|