|
|
Articles: Drama | నరకానికి పూలదారి!? - Mr. pyyetisrinivasarao srinivasulu
| |
సిల్ : (నవ్వి) ఎంతదిరిపడ్డావ్? నీకూ భయమనేదుందా? గూఢచారులంటే గవర్నమెంటు వాళ్లు నియోగించిన వాళ్లు కాకపోవచ్చు. అనునిత్యం నిన్ను అనుసరించే నీ భార్యా, బిడ్డలూ, నీ తోబుట్టువులూ ఎవరైనా కావచ్చు.
(చంచలరావు నవ్వుతుంటాడు. నవ్వు కనిపిస్తుంది కాని వినిపించదు. గురవయ్య కాగితాలు సరిగా ఉన్నాయో లేవో చూసుకుంటూ ఉంటాడు.)
సిల్ : చంచల్రావ్! అలా గట్టిగా నవ్వకు. నీ పెదవులపై వెల్లివిరిసిన నవ్వే ఒకనాడు ఏడ్పుగా మారవచ్చు. నిన్ను నమ్ముకున్న నీ వాళ్లందరూ... నడి సముద్రంలో చుక్కాని లేని నావల్లా కొట్టుకుపోతుంటే... ఈ నాలుగు గోడల మధ్యా నీ సంసారం పతనమై శిథిలమై పోతుంటే, ఈ పాపానికి కారణం నువ్వేనని, అందరూ నిన్ను నిందిస్తుంటే, నిస్సహాయంగా నువ్వు రోదిస్తూ ఉండక తప్పదు.
(చంచలరావు భయపడుతుండగా గురవయ్య ఆనందంగా దగ్గరకెళ్లి భుజం తట్టి ధైర్యం చెప్పి కౌగిలించుకుంటాడు. గురవయ్య చంచలరావు చెవిలో ఏదో చెబుతున్నాడు.)
సిల్ : ఏమిటది చంచలరావ్? గురవయ్య నీ చెవిలో ఏం చెబుతున్నాడు? ఏమిటది? ఇష్టం లేదని చెబుతున్నా నీకు ఏమిటలా నూరి పోస్తున్నాడు?
(గురవయ్య ఆనందంగా వీధిలోకి వెళ్లి పోతాడు)
సిల్ : అవును. ఏదో కొంప ముంచే పనే చేస్తున్నాడు గురవయ్య. అందుకే అంత ఆనందంగా వీధిలోకి వెళ్లిపోయాడు.
(చంచలరావు డబ్బును ముద్దు పెట్టుకుంటాడు.)
సిల్ : చంచలరావ్! డబ్బును ముద్దుపెట్టుకుంటున్నావు. ఒక్క సంతకంతో రెండు వేల రూపాయలు కొట్టేశావు. ఇలాగే మరో నాలుగు పార్టీలను చేరదీసి నాలుగు సంతకాలు గిలికేస్తే ఎనిమిది వేలు రాకపోతాయా?... అప్పుడు నీ చెల్లెలి పెళ్లి కాకుండా పోతుందా? అనే నిర్లక్ష్యంతో కూడిన ధైర్యం నీలో ప్రవేశించింది, మొదటి తప్పు చెల్లెలి పెళ్లి కోసం చేశావు. కాని, చంచలరావ్! డబ్బు పాపిష్టిది! అందుకే.. ఆ డబ్బు నీ చేతిలో పడగానే, నీలో లేని కోర్కెలు పడగలు విప్పుకుంటున్నాయి. దానవత్వం నీ కళ్లల్లో పైశాచిక నృత్యం చేస్తోంది!
(గుమ్మం దగ్గర గురవయ్య బ్రాందీ సీసాతో నిలబడ్డాడు.)
సిల్ : అరే! గురవయ్య ఇంకా వెళ్లిపోలేదా? నీ బలహీనతను కనిపెట్టాడు. డబ్బు మనిషినెలా ఆడిస్తుందో తెలిసినవాడు. అందుకే నీక్కావలసిన బ్రాందీ సీసాతో గుమ్మం దగ్గర నిలబడ్డాడు.
(III Mistake చంచలరావు గుమ్మం దాకా వెడతాడు. బ్రాందీసీసా తీసుకుని సోఫా దగ్గరకొస్తాడు. కూడా గురవయ్య లోపలికొస్తాడు. చంచలరావుని సోఫాలో కూచోపెడతాడు. తనతో తెచ్చిన చేతిసంచీ తెరిచి, అందులోంచి తీసిన గాజు గ్లాసును టేబుల్ మీద పెట్టి, చంచలరావు చేతిలోని సీసాను లాక్కుని మూత తెరిచి గ్లాసులోకి బ్రాందీపోసి సోడా కలిపికలిపి మెల్లిగా చంచలరావు పెదవులకందించి తాగిస్తాడు. చంచలరావు గుటక వేసి పొలబారి ఇబ్బందిగా మొహం పెడతాడు. వద్దంటున్నా వినకుండా ధైర్యం చెప్పి గురవయ్య చంచలరావు చేత గుటక మీద గుటక వేయించి రెండు మూడు రౌండ్లు తాగిస్తాడు.)
సిల్ : మందు నిషా తలకెక్కిందా? కళ్లు మసకౌతున్నాయా? నువ్వు చాలా ఎదిగిపోయావు. చాలా పేద్ధ మనిషివైపోయావు చంచలరావ్!
(గురవయ్య బ్యాగ్ లోంచి ఒక పుస్తకాన్ని తీసి చంచలరావు ఎదరనున్న టీపాయ్ మీద పడేస్తాడు.)
సిల్ :- శభాష్! గురవయ్యా! శభాష్!! నువ్వు అసలు సిసలైన కార్యసాధకుడివి. మనిషిలోని పాశవిక ప్రవృత్తిని రెచ్చగొట్టి ఆ కోర్కెల జ్వాలలను ఆర్పుతున్నట్టుగా నటిస్తూ పెట్రోలు పోస్తున్నావు. తగులబడిపోతున్న నీతి నియమాలను చూసి ఆనందిస్తున్నావు. అందుకే, ఆ సచిత్ర కామశాస్త్రం పుస్తకం అక్కడ పడేశావు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|