|
|
Articles: My Thoughts | శ్రీశ్రీ తెలుగుల సిరి - Site Administrator
| |
శ్రీశ్రీతో ముచ్చట్లకు కూర్చుంటే ప్రపంచంలోని విషయాలన్నీ దొర్లుతుండేవి. భారతదేశంలో ఏ కవీ చెయ్యని ప్రయోగాల్ని 1930-40 మధ్య శ్రీశ్రీ చెయ్యగలిగాడు. అప్పట్లో ఆంధ్ర విశ్వకళా పరిషత్తుకు కట్టమంటి రామలింగారెడ్డి గారు ఉపాధ్యక్షులుగా ఉండేవారు. బ్రిటిషు ప్రభుత్వం నిషేధించిన కమ్యూనిజం పుస్తకాలతో సహా విలువైన ఎన్నో పుస్తకాలను రెడ్డి గారు తెప్పించారు. అలాంటి పుస్తకాలు ఎవ్వరికీ అందుబాటులో లేకున్నా, గ్రంథాలయంలోని ఒక గదిలో మూలుగుతున్నా వాటిని శ్రీశ్రీకి అందుబాటులోకి తెచ్చినవారు అబ్బూరి రామకృష్ణారావు గారు. అందువల్ల భారతదేశంలో మరేకవీ చదవలేని సిద్ధాంతాలని శ్రీశ్రీ చదివి వాటిని కవిత్వంగా మలచగలిగాడు. శ్రీశ్రీ కవిత్వం కోసమే ఫ్రెంచ్, రష్యన్ లాంటి భాషల్ని నేర్చుకున్నాడు. పాబ్లో నెరుదా లాంటి కవుల రచనల్ని 70-80 ఏళ్ళ క్రితమే తెలుగువారికి అందించిన ఒకే ఒక్క కవి శ్రీశ్రీ. పాబ్లో నెరుదాని చూచి పలకరించి అమాయకుడైన కుర్రవాడిలాగా ఆ మహాకవి ఆటోగ్రాఫ్ ని తీసుకున్న పసిమనసు శ్రీశ్రీది.
శ్రీశ్రీని చివరిసారిగా నేను చూసేసరికి అనారోగ్యంతో మంచంమీద పడుకొని ఉన్నారు. సరిగ్గా మాట్లాడటానికి శక్తిలేని స్థితి. అయినా నాతో గంటసేపు మాట్లాడి ఎన్నో విషయాలు ముచ్చటించారు. అదే ఆయన ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ. చివరిసారిగా ఆయన నాకు సంతకం చేసి ఇచ్చిన పుస్తకం 'పాడవోయి భారతీయుడా' అనే శ్రీశ్రీ సినిమా పాటల పుస్తకం. ఇదే 'శ్రీశ్రీ ప్రచురణలు' పేరుతో తన పుస్తకాల్ని తానే ప్రచురించుకోవాలని శ్రీశ్రీ ముద్రించుకున్న మొదటి పుస్తకం. దీనికి ముందుమాట రాస్తూ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం 'శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వానికి యుగకర్త మాత్రమే కాదు, కర్త, కర్మ, క్రియ అన్నీనూ' అన్నది మంచిమాట. 'తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా' అన్న శ్రీశ్రీ మాట ఈనాటికీ అనుసరించాల్సిన ప్రబోధ వాక్యమే.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|