|
|
Articles: TP Features | వలసవాద ఆలోచనకు ఆవల - Site Administrator
| |
ఇంతకీ తేలేది ఏమంటే తెలంగాణ ప్రాంతంలో శాతవాహన రాజులు ప్రాకృత భాషలో చాలా రచనలు చేశారు. తెలుగు పేర్లు పెట్టుకున్నారు. నాణేలలో వాడిన పదాలు చాలావరకు తెలుగే. ప్రాకృత గ్రంథాలలో ఈనాడు మనం వాడే ఎన్నో తెలుగు పదాలు ఉన్నాయి. మన పండితులకి అర్థం కాకుండా తలపట్టుకున్న పదాలు చాలావరకు సంస్కృత భాషా జన్యం కావు. వాటి మూలాలు ప్రాకృతభాషలో ఉన్నాయి. జన వ్యవహారంలో అయితే వేలాది పదాలు ఉన్నాయి. వీటిని మూలద్రావిడ, ద్రావిడ భాషా జనకాల దృష్ట్యా చూస్తే లాభం లేదు అనే విషయాన్ని పై గ్రంథాలు నిర్ధారించడం జరిగింది.
అయినప్పటికీ మన తెలుగు భాషావేత్తలు, పండితులు, భాషా నిపుణులు ఇంకా తమ దృష్టిని ప్రాకృతం వైపు మరల్చలేదు. ప్రాకృత భాష చదవగలిగిన పండితులు లేకపోవడం విచారకరం. ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డానికి ఒక పెద్ద కారణం బ్రిటిష్ వలసవాద భాషా దృక్పథం. ఆంగ్లేయులు నాటిన ఈ దృష్టికోణం లోంచే తెలుగుభాషను చూడ్డం వల్ల సంక్రమించిన వైకల్యం ఇది. మనం ఇప్పుడు తెలుగు చారిత్రాక మూలాలను తవ్వడానికి వేములవాడ, బోధన్ లను కేంద్రంగా చేసుకుని చూడాలి. క్రీస్తుపూర్వం మూడు నాలుగు శతాబ్దాల కాలం అంటే శాతవాహన పూర్వదశని పట్టుకోగలగాలి. అంటే ప్రతిష్ఠానగరం, నాసిక, నాణేల ఊరు అయిన నానేఘాటు వంటి ప్రాంతాలు తెలుగు రాజుల పాలనా కేంద్రాలనే దిశగా చూడాలి. క్రీస్తు పూర్వం నుండి 1956 వరకు సగం మరాఠీ ప్రాంతం, మహారాష్ట్రలోని నాందేడ్, పర్బనీ, ఔరంగాబాదు వంటి జిల్లాలు తెలుగుసీమ నుంచి పరిపాలించిన పాలకుల అధీనంలో ఉండేవనే చిన్న విషయాన్ని అంగీకరించాలి. అప్పుడు మాత్రమే తెలుగుభాషా వికాసానికి సంబంధించిన మరో కోణం విదితమవుతుంది. అందుకోసం నేను పేర్కొన్న మూడు పుస్తకాలు కొంతవరకు అవసరపడతాయి.
'తెలుగు మఱుగులు' గ్రంథంలో ముప్ఫై ఆరు అర్థం తెలియని తెలుగు పదాలకు అర్థం సాధించారు. అందులో కొన్నింటిని ప్రాకృత భాషా సంబంధంతోనే అర్థాలు విప్పగలిగారు. ద్రవిడభాషే కాదు, సంస్కృతమే కాదు, ప్రాకృతం కూడా తెలుగు భాషకు వెన్నెముకగా ఉండిందని, ఆ భాష రక్తనాళాలు మనలో కల్సి ఉన్నాయని అందువల్ల భాషకు మరింత పటుత్వం వచ్చిందని తెలిసినప్పుడు అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అంతేకాదు ఈ గ్రంథాల అధ్యయనం వల్ల భాషల ఆధిపత్యం ఎలా ఉండేదో అర్థం చేసుకోగలిగితే ప్రస్తుతం పరభాషల పెత్తనపు కబంధహస్తాల నుండి ఎలా తప్పించుకోవాలో కూడా తెలుస్తుంది.
భాషకి సంబంధించిన అధ్యయనంలో సొంత భావాలకు తావు ఉండకూడదు. కొద్దిపాటి హృదయ వైశాల్యం అవసరం. అందుకే ఈ గ్రంథాల పరిచయం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|