|
|
Articles: TP Features | ఆది కవికి వెయ్యేళ్ళు - Site Administrator
| |
వేగినాడుకు దగ్ధరాష్ట్రమని పేరుండేది. నిరంతర యుద్ధాల వల్ల, అన్నదమ్ముల జ్ఞాతుల కలహాల వల్ల ఆ పేరు వచ్చి ఉండవచ్చు. నన్నయ్య మహా కవి తెలుగునాటనే మరణించాడో లేదా చోళ రాజ్యానికి వెళ్ళి అక్కడ తనువు చాలించాడో తెలియదు. 1060 తరువాత ఒకటి రెండు సంవత్సరాలకే రాజరాజ నరేంద్రుడు రాజ్యం కోల్పోయినట్లు స్పష్టం అవుతున్నది. యుద్ధంలో మరణించాడో, శత్రువులు తరిమివేశారో నిర్ధారించలేం. ఇందు వల్ల కూడా నన్నయ్య మహా భారత రచన ఆగిపోయి ఉండవచ్చు. నన్నయ్య తన మహా భారత ఆంధ్రీకరణాన్ని 1050 - 60ల మధ్య ఎప్పుడో ప్రారంభించి ఆ తరువాత పూర్తిచేసి ఉంటాడని ఊహించాలి. అది సమంజసం. అప్పటికాయనకు 50 సంవత్సరాల వయస్సు దాటి ఉండవచ్చు. అప్పట్లో రాజరాజ నరేంద్రుడు కుదుటపడి శాంతి భద్రతలతో పాలన చేస్తూ నన్నయ్య మహా కవి ఆంధ్ర మహా భారత రచనకు పూనుకోవాల్సిందిగా ప్రార్థించి ఉంటాడు.
నన్నయ్య రాజరాజ నరేంద్రుడి కుల బ్రాహ్మణఉడే కాక అనురక్తుడు, అవిరళ జప హోమ తత్పరుడు. సంహితాభ్యాస సుకృతి. బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుడు. అందువల్ల ఆ మహానుభావుడు మహా భారత రచనకు పూనుకొనే కాలానికి 50, 60 సంవత్సరాల వయస్సువాడై ఉండాలి. అంటే 11వ శతాబ్ది మొదటి దశకంలో 1,000 - 1,010 మధ్య కాలంలో ఆయన జన్మించి ఉంటాడని ఊహించాలి. ఇంతకన్నా ఆయన స్వస్థలం, కుటుంబ వృత్తాంతం, తల్లిదండ్రులు, ఆంధ్రదేశానికి ఆయన తరంలోనే వచ్చారా? అంతకు ముందే వచ్చారా ఆ కుటుంబం వారు, ఆ వంశీకులు అనే విషయాలు తెలుసుకునే ఆస్కారం లేదు.
కాబట్టి ఆయనకిప్పుడు వెయ్యేళ్ళ వయస్సు. వెయ్యేళ్ళాయుష్షు. ఆయన తెలుగువారికి అజరామరుడు. ఆకల్పాంతం జీవించి ఉండే కవీంద్రుడు. కవి వృషభుడు. కాబట్టి తెలుగునాడంతా ముఖ్యంగా అన్ని ముఖ్య నగరాలలో ఆయన జయంతి జరపాలి. తెలుగు విశ్వవిద్యాలయం, రాజమండ్రిలోని నన్నయ్య విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం ఇంకా తెలుగు అధ్యయన, అధ్యాపనలలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు, రాష్ట్రేతర తెలుగు సంస్థలు, విశ్వవిద్యాలయ శాఖలు నన్నయ్య సహస్రాబ్ది జయంత్యుత్సవాలు సమధికోత్సాహంతో, భక్తి శ్రద్ధలతో, సంతోషానందాలతో జరుపుకోవాలి. తెలుగు భాషకు పురా వైభవాన్ని, విశిష్ట హోదాను ఇచ్చామంటున్నారు కదా - వచ్చిందంటున్నారు కదా - దాన్ని తెలుగువారే తెచ్చుకున్నామని సగర్వంగా చెప్పకోవాలి!
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|