|
|
Articles: My Thoughts | సత్యాన్వేషి సర్వేపల్లి - Site Administrator
| |
ఉపాధ్యాయుల నడత, నడక అన్నింటినీ విద్యార్థులు గమనిస్తూనే ఉంటారు. చాలా జాగరూకతతో ఉపాధ్యాయులు ప్రవర్తించవలసి ఉంటుంది. ఏదో పాఠం చెప్పి తన పనయిపోయిందనే ఉపాధ్యాయుల్ని ఏ విద్యార్థీ గుర్తు పెట్టుకోడు. పాఠంతో పాటు జోడించి అనేకానేక విషయాలను సమయానుకూలంగా బోధించే వారిని విద్యార్థులు చక్కగా గుర్తు చేసుకొంటుంటారు. బడిలో చెప్పిన పాఠం భవితకి బాట వేసిందని కృతజ్ఞతలు తెలియజేసుకొంటారు. రాధాకృష్ణన్ సైతం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాక వారి కష్టసుఖాలను తెలుసుకొనేందుకు కొంత సమయం కేటాయించేవారట! అందుకే 'ఉత్తమ ఉపాధ్యాయుడ'య్యారు.
విద్యార్థి ఉపాధ్యాయ సంబంధాలు ఆరోగ్యకరంగా ఆత్మీయంగా కొనసాగితే అధ్యయనం అధ్యాపకం కూడా సులభరతమవుతోంది. ఒకరిపట్ల ఒకరు శత్రుత్వ భావంతో ప్రవర్తించటం వల్ల 'విద్య' మూల ప్రయోజనం దెబ్బతింటోంది. మరికొందరు ఉపాధ్యాయులు ట్యూషన్ల పేరిట అదని, ఇదని ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటం వింటున్నాం. తండ్రి చూపవలసిన ఆదరణనని, వాత్సల్యాన్ని పిల్లల పట్ల ఉపాధ్యాయుడు చూపాలి. అట్లాగాక, అసభ్యకరంగా ప్రవర్తించినవారికి కఠిన శిక్షలు విధించాలి...
సమాజం, దేశం అభివృద్ధి సూచిక విద్యావంతులైన జనాభాను అనుసరించే ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు మన దేశంలో సరైన బడులు లేవు. వసతులు లేవు. తగినంత మంది ఉపాధ్యాయులు లేరు... ఉన్న ఉపాధ్యాయుల్లో నిబద్ధత కరవైన వారి వల్ల సరైన శిక్షణ, బోధన జరగటం లేదు.... ఇవన్నీ సమకూరటం అన్నది ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. ప్రభుత్వం, ప్రజలు కూడా విద్యను అత్యవసరమైన విషయం కింద పరిగణించాలి. బడులు లేనిచోట ప్రజలు - ప్రజాప్రతినిదులు పోరాడయినా బడులు తెరిపించాలి. తగినంత మంది ఉపాధ్యాయులు ఉండేలా చూసుకోవాలి. ఉపాధ్యాయులు విద్యార్థులను సంపూర్ణ మూర్తిమత్వంతో తీర్చిదిద్దాలి. అప్పుడే అతను సమాజానికి ఉపయోగపడినట్లు. అటువంటి ఉపాధ్యాయుల చేతిలోనే సరయిన పౌరులు తయారవుతారు. దేశాభివృద్ధికి వారే కారకులవుతారు. బోధన పట్ల రాధాకృష్ణన్ కు ఉన్న మమకారాన్ని మరొక్కసారి గుర్తు చేసుకొని, ఆయన ఆదర్శాల్ని ఆచరించడమే ఉపాధ్యాయలోకం ఆయనకు సమర్పించే నిజమైన నివాళి!
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|