|
|
Articles: Short Stories | నాన్నకు రాయని ఉత్తరం - Editor
| |
గత నెల్లో నేను ఎన్నిసార్లు మిమ్మల్ని ఆ హాస్పిటల్లో ఐసీయూలో దు:ఖంతో, కాతర హృదయంతో నాన్నా - నేను బాలని కళ్ళుతెరవండి, నన్ను చూడండి, బాలా అని పిలవండి, మాట్లాడండి నాన్నా - మిమ్మల్ని చూడాలని మీతో మాట్లాడాలని వచ్చాను నాన్నా అని ఎంత పిలిచినా మీరు పలకనే లేదు నాన్నా.
నాకేం తెలుసు - మీరు మా పిలుపులకి అందని ఏ దూరాలకో వెళ్ళిపోతున్నారని? అప్పటికీ నాకు అనిపించలేదు మీరలా వెళ్ళిపోతారని. మీరు నా వైపు చూడడానికి ప్రయత్నించినట్లూ, గొంతుకలో గొట్టాలేవో ఉండడం వల్ల నాతో మాట్లాడాలని మీరు ప్రయత్నించినా మాట్లాడలేకపోయారేమో అనిపించింది నాకు.
చెయ్యి గట్టిగా పట్టుకున్నారు నాన్నా అని పిలిచినప్పుడు, నా చెయ్యి వదలకుండా. అదే మీరు విన్న నా ఆఖరి పిలుపా?
ఎంత పిలిచినా, అరచినా, మా పిలుపులు, అరుపులు మరి మీకు వినిపించవేమో కదూ? 'నీ చల్లని అడుగులు' అని మీ అమ్మ గురించి మీరు రాసిన కవితలో 'నా గొంతుక వినిపిస్తుందమ్మానీకా దూరపు చుక్కల త్రోవలో? గిజ గిజ కొట్టుకులాడే అరుపిది తల్లీ - వేటగాని వలలో!' అని మీరు రాసినట్లు మా అరుపులు మీకు వినిపిస్తున్నాయో లేదో?
శ్రీకృష్ణజన్మాష్టమి ఈ రోజు.
మీరున్న ఆ లోకానికి ఏ ఫోనూ లేదు, మాకు తెలిసినంతవరకూ మీకు 'హ్యాపీ బర్త్ డే టుయూ' అని చెప్పడానికి! ఎందుకు నాన్నా? వెళ్ళిపోయారు? మా కెవరికీ, ఆఖరికి ఏభై ఎనిమిదేళ్ళుగా మీ నీడలా ఉన్న అమ్మకయినా చెప్పకుండా? మేము పోనులో మాట్లాడ్తామని మీకిష్టం లేకనా నాన్నా?
నా ఈ ఉత్తరమూ మీకింక అందదు. నాకు తెలుసు నాన్నా!
అయినా మన పిల్లలందరికీ, నాకు తెలిసి వాళ్లందరికీ ఉత్తరాలు రాయండని చెప్తున్నాను. నా ఉత్తరం చదివి అయినా వాళ్ళందరూ రాస్తారని నా ఆశ. వాళ్ళే కాదు, ఎవరెవరికో ఎవరెవరో రాయలేదో వాళ్ళందరూ కూడా ఈ ఉత్తరం చదివి ఉత్తరాలు రాయాలని ప్రతిజ్ఞ చేసుకుంటే నా ఉత్తరానికి సార్థకత దొరుకుతుంది.
మేము ఉత్తరాలు రాయలేదు - అజ్ఞానంతోనో, చిన్నతనంతోనో, స్వార్థ జీవితపు బాధ్యతల బంగారు సంకెళ్ల బరువుతోనో గాని! అయినా మేము మీ పిల్లలం. మీ చిన్న పిల్లలం - ఎంత వయస్సు వచ్చినా. అందుకని మేము రాయలేకపోయినా మీ మీద మా ప్రేమా, భక్తీ, అనురాగం, ఏమీ తగ్గని మీ పిల్లలం. మమల్ని ఆఖరిసారిగా క్షమించండి నాన్నా.
మరోసారి మరో జన్మలో (జన్మంటూ వుంటే) మీ పిల్లలుగా మళ్ళీ పుడ్తే, మరి ఈ తప్పు చేయమనే మా ఆశ. మీతో మేము పంచుకున్న మీ స్మృతుల క్షణాలే మా అందరికీ శాశ్వతంగా ఉండిపోయాయి నాన్నా!
ఆగని కన్నీళ్ళతో, అత్యంత శ్రద్ధతో, గౌరవాభిమానాల్తో, స్మృత్యర్థం సుమ నమస్కారాల్తో మీరు బ్రతికి ఉండగా రాయని ఈ ఉత్తరాన్ని ముగిస్తున్నాను నాన్నా!
మీ పెద్ద కూతురు
బాల.
| Read 6 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|