|
|
Articles: Devotion | మహా శివరాత్రి మహత్యం - Site Administrator
| |
బ్రహ్మ అసత్య దోషానికి పాల్పడినందుకు పార్వతీపతి భైరవుడిని సృష్టించి, బ్రహ్మ ఐదవ శిరస్సును ఖండింపజేశాడు. అప్పటి నుంచి బ్రహ్మ చతుర్ముఖుడు అయ్యాడు. బ్రహ్మ పశ్చాత్తాప పడేలా చేసిన పరమేశ్వరుడు అతన్ని కొంతమేరకు అనుగ్రహించాడు. 'చతుర్ముఖా ! నువ్వు ఎప్పటిలాగే సృష్టికారకుడుగానే ఉంటావు... ఆలయాల్లో నీకు పూజలూ, ఉత్సవాలు లేకున్నా యజ్ఞయాగాదుల్లో నీప్రాధాన్యం ఉంటుంది. గురుపూజ నీకే చెయ్యాలి. బ్రహ్మకలశం స్థాపించి గురుపూజ చేయని యజ్ఞం సంపూర్ణం కాదు. యజ్ఞఫలం దక్కదు. ఆలయాల్లో నాతో పాటు పూజలు పొందకున్నా నాకు అంటే లింగానికి పై కప్పుగా ఉంటావు. విష్ణువు స్థితికారకుడుగా, నేను లయ కారకుడిగా ఉంటాము' అని వివరించాడు.
జ్యాలాస్తంభం, అందులోని శివుడు మహోజ్వలంగా వెలుగుతున్నారు. దేవతలు, సమస్త లోకాల వాసులు ఆ ప్రకాశాన్ని తట్టుకోలేక ఆ రూపాన్ని ఉపసంహరించుకోమన్నారు. కరుణాంతరంగుడైన శివుడు వారి ప్రార్ధనను మన్నించి జ్వాలాస్తంభ రూపం చాలించి పార్థివ లింగరూపాన్నిఆవిర్భవించాడు. అదే మహాశివరాత్రినాడు లింగోద్భవ కాలమని గణతికెక్కింది.
శివరాత్రి పూజ
మహా శివరాత్రి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి. ఏదైనా పుణ్యనదిలో స్నానం చేసి విబూదిరేఖలు శరీరాన అలదుకుని, శివుడిని మనసున ధ్యానిస్తూ పగలంతా నియమనిష్టలతో ఉపవాసముండి రాత్రి నాలుగు జాముల్లో పూజలు చేసి జాగారం చేయాలి. రుద్ర సూక్తులతో, శివపంచాక్షరితో అర్చించాలి. నాలుగు జాములలో ఆవుపాలు, చక్కెర, పెరుగు, చెరుకురసం, నెయ్యి, తేనేతో అభిషేకించాలి. మొదట ఆవుపాలు, చక్కెర, పెరుగు, ఆ తర్వాత నెయ్యి, అటు పిమ్మట తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే శివుడు పరమానంద భరితుడవుతాడు. శ్రీ గంధం, ధవళాక్షతలు, బిల్వపత్రాలు, గన్నేరు పూలతో పూజించాలి. లింగాష్టకం కాకున్నా కనీసం ఎనిమిది నామాలతో శివార్చన చేయాలి. అవి : భవాయనమ:, శర్వాయనమ:, రుద్రాయనమ:, పశుపతయేనమ:, ఉగ్రాయనమ:, యహతేనమ:, భీమాయనమ:, ఈశాయనమ: అని చిత్తం శివునిమీద నిలిపి జపించాలి. ఇన్ని నామాలు చేయలేని వారు మనసును శివాయత్తం చేసి 'ఓం నమశ్శివాయ:' అని జపిస్తూంటే చాలు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|