|
|
Articles: TP Features | మహా సరస్సు మాయం - Editor
| |
సరస్సు అంతర్థానమైనదెప్పుడు? :
ప్రకృతి సహజంగా ఏర్పడిన ఈ సరస్సు ఉత్పాతానికి గురైందెప్పుడనేది ఊహించడం కష్టమే. పాతరాతి, కొత్త రాతి యుగపు ఛాయలేమీ లేవు కనుక అప్పటికే సరస్సున్నది, గోదావరి ఒడ్డున ఉన్న గ్రామాలలో కొన్ని నెల్లివాక, ఆలుబాక, తూరువాక, కివ్వాక అనే పేర్లతో ఉన్నాయి. వాక-వాగుగా మారింది - చరిత్రకందని రోజుల్లో వాక అనే పదముండేదని అది వాగుగా మారిందని ఊహించవచ్చు. కివ్వాకలోని కిరు -చిరుగా మారుతుంది. అట్లే కెరె - చెరువు, కివి-చెవిగాను మారాయి. ఈ 'క'కారం తాల్వీకరణ చెంది 'చ'కారంగా మారటం 'క్రీస్తు'కు పూర్వమే మొదలైంది. అంటే అప్పటికే ఇక్కడ జనావాసాలున్నాయి. మహాభారతానికి, రామాయణ కాలానికి చాలా ముందే ఈ సరస్సు మాయమైంది. అంటే రామాయణ కాలానికి ముందూ కొత్త రాతి యుగానికి తరువాత ఈ మధ్యలో ఎప్పుడో ఈ సరస్సుకు ఉపద్రవం ఏర్పడింది. ఇంతకంటె కచ్చితంగా, భౌగోళిక శాస్త్రజ్ఞులూ, సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళూ చెప్పగలరేమో!
విశ్వవిద్యాలయాల్లో భూగోళ శాస్త్రాన్నీ, సివిల్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల్లారా! అధ్యాపకులారా! ఈనాటి మానవుడు తన మేధతో కృత్రిమ సరస్సుల నిర్మాణానికి పూనుకున్నాడు. అందులో భాగమే 'పోలవరం' ప్రాజెక్టు నిర్మాణం. రాబోయే ఈ సరస్సు అలనాటి సరస్సులో నాలుగవ భాగాన్ని ఆక్రమిస్తుంది. ఖమ్మం జిల్లాలోనే 250 ఊళ్ళు జలసమాధి కానున్నాయి. నేను తెల్పిన మహా సరస్సుకు సంబంధించిన ఆనవాళ్లు చాలావరకు నాశనమైపోనున్నాయి. కనుక మీరు త్వరపడి, చరిత్రకందని కాలంలో ఈ పాపికొండల వల్ల మహా సరస్సేర్పడెనా? ఏర్పడితే దాని వివరాలేమిటి? మరెప్పుడెలా నాశనమైంది అనే దానిపై పరిశోధించి నిజాన్ని నిగ్గు దేల్చండి. అందుకు కొంతైనా నా వ్యాసంలో నేను చూపిన అంశాలు ఉపకరిస్తే సంతోషిస్తాను.
చరిత్ర విద్యార్థులారా!
కొత్తగా నిర్మాణం కాబోయే సరస్సులో ఎన్నో చారిత్రక సత్యాలు, సంఘటనలు, శాశ్వతంగా జలసమాధి కానున్నాయి. ఉదాహరణకు రుద్రమ్మకోట. 'కాకతి రాణి రుద్రమ్మ' తన భర్త వీరభద్రుని తిరుగుబాటును అణచటానికై ముసునూరి వీరుల అండదండలతో ప్రస్తుతపు రుద్రమకోట గ్రామం వద్ద కోట కట్టి అక్కడ ఒక సైనిక శిబిరం ఏర్పరచిందనీ, ఆ తర్వాత అది ఆమె పేర ప్రఖ్యాతమైందని, వీరభద్రుని ఆ ప్రాంతాననే ఓడించి సంహరించిందనీ చారిత్రకుల విశ్వాసం. రాణి రుద్రమ తాను వేయించిన ఏ శాసనంలోనూ తన భర్త వీరభద్రుని ప్రస్తావించకపోవడం వల్ల, వీరభద్రుని తల్లి ద్రాక్షారామంలో వేయించిన శాసనంలో తన కుమారునికి ఉత్తమ గతులు కలగాలని, ఆ దేవునికి ఇచ్చిన దాన శాసనంలో తన కోడలిని తలచకపోవడం వల్ల వీరభద్రునిది సహజ మరణం కాదని, భార్యాభర్తల పోరులో వీరభద్రుడు అసువులు బాశాడనీ పలువురు భావిస్తున్నారు. మీరు పరిశోధిస్తే అక్కడక్కడ శాసన సాక్ష్యాధారాలు దొరకవచ్చు. ప్రస్తుతం కన్నాయిగట్టు వద్ద ఒక శాసనం ఉంది. మీరు తొందరపడక, అలక్ష్యం చేస్తే ఎంతో చారిత్రక సంపద, చారిత్రక సత్యాలు నీటి పాలు కానున్నాయి. వెంటనే పరిశోధనకు పూనుకొనలసినదిగా మనవి.
నేను భూగోళశాస్త్రంలో గాని, సివిల్ ఇంజనీరింగ్ లో కాని పరిజ్ఞానం లేనివాణ్ణి. నా వ్యాసంలో అసంగతాలేమైనా ఉంటే తెలిసినవారు తెలియజేస్తే సవరించుకుంటానని మనవి.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|