|
|
Articles: TP Features | సామాజిక మార్గ నిర్మాత ఫూలే - Site Administrator
| |
బ్రాహ్మణుల అధీనంలో రైతులు ఏ విధంగా నలిగిపోయి నాశనమౌతున్నారో, శూద్రులు దాన్నుండి ఏ విధంగా బయటపడాలో తన రచనల ద్వారా నిరూపించాడు. పిల్లలు పుట్టినప్పుడు, పుష్పవతి అయిన సందర్భంలో, వివాహ సమయంలో గృహప్రవేశ సమయంలో బ్రాహ్మణులు రైతుల్ని మతం పేరుతో, పూజల పేరుతో ఏ విధంగా దోచుకుంటున్నారో తెలియచెప్పాడు. పురోహితుడు లేకుండా తక్కువ ఖర్చుతో వివాహాలు ఏ విధంగా జరుపుకోవచ్చో చెప్పాడు. శూద్రులకు నిషేధించిన వేదాల్ని తెల్లవాళ్ళు చదువుకోవడానికి బ్రాహ్మణులు డబ్బుకు ఆశపడి ఏ విధంగా నేర్పుతున్నారో, శూద్రులను ముట్టుకుంటే మైలపడిపోయామనే వారు శక్తి ఆరాధన పేరుతో మద్యం ఎలా సేవిస్తున్నారో, కుల వివక్ష లేకుండా వేశ్యల వెంట ఎలా పడ్తున్నారో చెప్పి శూద్రుల్ని తెలివి తెచ్చుకోమన్నాడు.
వేదాలు దేవుడి నుంచి వచ్చినవి కాదని జోతిరావు నమ్మకం. మనుషులు సృష్టించినవేనని తన భావన. పురుషసూక్తంలో చతుర్వర్ణాల ఉత్పత్తి అభూత కల్పన అని, బుద్ధుని బోధనలను అనుకరించి బ్రాహ్మణులు మాంస భక్షణ, సురాపానం మాని బౌద్ధమతాన్ని నాశనం చేశారని భావించాడు. శూద్రులే అసలు క్షత్రియులని ఆయన వాదన. దీన్ని అంబేద్కర్ కూడా సమర్థించడం విశేషం. దసరా, దీపావళి పండుగలు, ఆదివారం పవిత్ర దినంగా భావించడం వంటివి బ్రాహ్మణేతరుల ఆచారాలని, వారికి వేరే దేవుళ్ళున్నారని భావించేవాడు. పునర్జన్మని, పురాణాలని, కర్మకాండలని నమ్మలేదు. భగవద్గీత ఒక రాజకీయ పత్రమన్నాడు. వేదాల్ని వ్యతిరేకించినా, దయానంద సరస్వతికి మద్దతుగా పూనాలో జరిగిన ఊరేగింపులో పాల్గొన్నాడు.
సార్వజనిక సభ, భారత జాతీయ కాంగ్రెస్, బ్రహ్మ సమాజం, ప్రార్ధనా సమాజాలు ఎక్కువగా బ్రాహ్మణులతో నిండి ఉన్నాయని, అవి సామాన్య జనానికి ఏమీ సహాయం చేయలేవని భావించేవాడు. మన దేశంలో ఉద్యోగాలు దేశవాసులకే ఇవ్వాలన్న డిమాండ్ వెనుక అగ్రవర్ణాల స్వార్థం ఉందని అన్నాడు. తన సిద్ధాంతాల ప్రచారానికి 1873 సెప్టెంబర్ 24న `సత్యశోధక సమాజాన్ని' స్థాపించాడు. దీనికి తన బ్రాహ్మణ మిత్రులు సహాయపడ్డారు. ఆయన మరణం తర్వాత దాని సిద్ధాంతాల్ని సూత్రీకరించారు. కులవ్యవస్థ మీద, విగ్రహారాధన మీద తిరగబడ్డాడు. మనుషలంతా సమానమని, అందరికీ ఒకే దేవుడని ప్రచారం చేశాడు. సమాజంలో సభ్యత్వం కుల, మత భేదం లేకుండా అందరికీ ఇవ్వబడింది. ఆ విధంగా సత్యశోధక సమాజం ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం కోసం పోటీపడే మొట్టమొదటి సామాజిక సంస్థ అయింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|