|
|
Articles: Literature | విధి వంచిత ద్రౌపది - Mr. SATYANARAYANA PISKA
| |
కృష్ణుడు చకితుడయాడు.
ద్రౌపది ఆవేశం కట్టలు తెంచుకుంది. తన వెంట్రుకలు పట్టి ఈడ్చిన దుశ్శాసనుని శరీరం ముక్కలు ముక్కలై యుద్ధరంగంలో చెల్లాచెదురుగా పడిఉండటం చూస్తేగాని తన అవమానాగ్ని చల్లారదంది. దుర్యోధనుని పీనుగును కళ్ళారా తాను చూడనిదే భీముని బాహుబలంగానీ, అర్జునుని పరాక్రమంగానీ ఎందుకు? తగలెయ్యనా! అన్నది. నిప్పును ఒడిలో దాచుకున్నట్లు, ఇంతటి కోపాన్నీ ఇన్నేళ్ళు రక్కెసతాల్మితో భరించాను అంటూ ఎలుగెత్తి ఏడ్చింది. ఓదార్చటం ఎలాగో ఎవరికీ తోచనంతగా ఏడ్చింది.
చివరికి --
సంధి సంధాతగా వెళ్ళే కృష్ణుని నోటనే యుద్ధాన్ని గురించీ, కౌరవ వినాశాన్ని గురించీ పలికించింది.
ఇందులో జీవితమెంత?
నటన ఎంత?
జీవితమే నటనలా కనబడేంతటి దారుణమైన అనుభవాలు, ఆ అనుభవాలు అలవాటు చేసిన వింత నడవడి, ఆ నడవడి తెచ్చిపెట్టిన భయంకర సమస్యలు -
వీటికి తోడు అద్భుతమైన నల్లరాతి శిల్పానికి ప్రాణం వచ్చినట్లుండే స్త్రీత్వం, ఎదుటివాడికి ఊపిరాడనివ్వని ఆకర్షణ -
ఇవన్నీ వెరసి ద్రౌపది.
*** *** *** ***
స్వార్థం తప్ప పరార్థం తెలియని పురుషత్వానికి ప్రయోగ రంగమై - దాంపత్యంలో ఐదు అభిరుచులను మెప్పించి - ఐదు రకాల దాహాలను తీర్చి - ఆనాటి గొప్ప పతివ్రతల సరస, వారికన్నా కొంచెం పొడగరిగా నిలబడింది ద్రౌపది.
ఇంత చేసినా ధర్మరాజు చివరికి అననే అన్నాడు - 'ఇమ్మగువ ఇంద్రతనయు నెడ పక్షపాతిని' అని!
పాండవులు స్వర్గారోహణం చేస్తున్నారు. ఇరుకుదారి. పాండవుల వెనుక ద్రౌపది నడుస్తోంది. ఉన్నట్టుండి, ద్రౌపది కూలిపోయి ప్రాణాలు విడిచింది.
ధర్మరాజు భీమునితో -
'బ్రతికినన్నాళ్ళూ అర్జునుడంటే పడిచచ్చింది. అందుకే ఇప్పుడు పడి, చచ్చిపోయింది' అని వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగిపోయాడు.
ద్రౌపది జీవన విషాదం ఎవరికీ అర్థం కాలేదు. కాదు.
ఆమె మరో పేరు ' విధివంచిత '!
(డా.ఎస్వీ భుజంగరాయశర్మ గారి 'దీపమాలిక' సౌజన్యంతో)
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|