|
|
Articles: Drama | తెలుగు విలువల ఉగాది - Editor
| |
ధాన్యం కలిపి దంచిన కవ్వలు, పెసర, మినుమ, ఉలలు కలిపి వుడకబెట్టిన పశువుల మేత అట్టికలు పొయ్యిమీంచి దించి గోలేలెంట పోసి పిలుస్తోందామె... ఇంటి మగోల్ని -
'తుడిచి వుంచిన సాలలో - పశువుల్ని కట్టండర్రా
వాటి గంగడోలూ వెన్ను దువ్వి - దాణాలెట్టండిరా
కట్లువిప్పి పెయ్యిలను - తల్లుల కొదలండిరో
దూడలనూ కుడిపించి - పొదుగు సేపనివ్వండి
మడమలతో పొద్దుగులద్ది - పితకండి పాలు
పొంగుపాల తపేలాలు - పెట్టండిరో ఉట్టిలో '
రైతు : ఓరోరి సిన్నోడా - వెళ్ళిబండి పుయ్యరో
పెద్దవీధిలోన బండిని - పరిగెత్తించరో
బళ్ళా పందేలలోన - బరితెగించి గెలుచుకోర
ఎడ్లూ కొమ్ములు చూడర - ఎలా తిప్పుతున్నాయో
ఘల్లుఘల్లుమంటున్నయి - మెడలోమువ్వలసేర్లు
చురుకు చురుకుమంటున్నయి - వాటి మోర ఎగవకళ్ళు
తపతపా కొడతన్నయి - వాటి డొప్ప చెవులు చూడరో
వీరులురో శూరులురో - మన యుద్ధపు ఎద్దులు
కురుక్షేత్ర రథములురో - మననాటు పాటు బళ్ళు
విశ్వారూపం చూపర - విజయం తథ్యంర నాయన'
డేకిసలోంచి పంచపాత్రతో నీళ్ళు తీసి తాగమని రైతుకు అందించిందామె. వంట ఇంటిలో - పొయ్యిలో పిడకలుతోస్తూ, మరోపక్క కుట్టుపుల్లతో కచ్చికల్ని పొయ్యిలోంచి బయటకు లాగుతూ, పొక్కళ్ళమీది కుండ్లలో వుడుకుతున్న అన్నమూ పాయసాల పదును చూస్తూ - ఉట్టెమీంచి పాల చట్టె దించి పాయసంలో పాలుపోస్తూ, మంటల్ని ఎగదోస్తూ, వేడిని తట్టుకోలేక పీటను వెనక్కి తోసి కూచుందామె.
'పాలకుండ, చల్లకుండ - ఆల్చిప్పతో గోకు అమ్మీ తమ్ముడికీ చెల్లికీ - ఆ గోకుముద్ద పంచిపెట్టు
'గోకే' దోలమ్మా అని - గోలగోల చేస్తరు..' అమ్మికి పని పురమాయించింది. పంచాంగ శ్రవణం దగ్గరకెళ్ళిన పెద్దల్లుడ్ని పిలిపించింది.
అట్టగమీంచి దించిన ఇత్తడి, కంచు, సిలవరు సామాన్లూ, గరిటెలు, అట్లకాడలూ, పెనాలు, చట్రాలు, మూకుళ్లూ తోముతోంది పెద్దపొట్టె. సామాన్లన్నీ సందడి సరదాపడి మోగుతోంటే - వాటిమధ్య ఆ బొట్టె సంగీత దర్శకురాలుగా అగపడుతోంది. వంటింట్లో ఒకపక్క కొబ్బరికోరు, సున్నుపిండి పల్లెం, బెల్లము కలిపిన పెసరపప్పు ముద్దలూ, శనగ, వరి, మైదాపిండి పూర్ణాలుతో నిండిన తపేళాలు, పులుసుదాకలూ, పాయసం అట్టికలు, నువ్వులనూనె సిద్దలూ, పొయ్యిమీద చిటపటా పేలుతున్న హెనాలు, మూకుడులూ, తూరుపు కుదురుమీద కూకున్న తరమాని కుండా... ఒహ్... తెలుగు వంటింటి స్వర్గంలో అమృతరుచులు గుమగుమలాడుతూ, పాకశాస్త్ర విశ్వ విద్యాలయంలా వుంది వంటిల్లు.
పలకమారిన మామిడికాయను ముక్కలుగా తరిగి, వేపపువ్వూ, చిగురూ కలిపి, బెల్లం ముక్కలు చిదివి ఉగాది పచ్చి చేసిందామె -
'పిల్లలార పిడుగుల్లార - రండి రండి పచ్చడి తినండిరోరె
నోట చవులు పుట్టుతాయి - గొంతు బాగుపడతాది
తియ్యతియ్యని పుల్లపుల్లని - తెలుగుమాట పుడతాది
పేగుశుద్ధి అవుతాది - కడుపు కడిగి పెడతాది
రండిరా పిల్లలూ - నాన్నలూ అమ్మలూ రారండ్రిరా'
(ఈ చేదు పచ్చడి తినడానికి జంకి, ఇరకిరకలంట నక్కి నక్కి తప్పించుకోజూస్తున్న పిల్లల్ని కనిపెట్టాడు రైతు...)
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|