|
|
Articles: TP Features | నవ రసాల శ్రీశ్రీ - Site Administrator
| |
అయితే ఉచిత కచేరి అన్న మాట విని ఒక సేట్ జీ జన్మదినోత్సవం నాడు కచేరీ ఏర్పాటు చేశారు. ఇలా ఖర్చులు పెట్టుకోవాలని సేట్ జీకి తెలియదు. ఖర్చులు తాను భరించననీ, ఇచ్చిన మాట ప్రకారం కచేరీ చేయాల్సిందేనన్నాడు సేట్ జీ. ఆవిడ పాడక తప్పలేదు. పుట్టెడు దు:ఖంతో ఆవిడ `బ్రూహి ముకుందేతి, రసనే - పాహిముకుందేతి' అంటూ పాడారు. శ్రోతలందరూ శాంతరస వృష్టిలో తడిసిపోయారు. పాట మధ్యలో ఆవిడ గుండె పగిలి మరణించారు. `ఎంత పుణ్యాత్మురాలు' అంటూ అందరూ మెచ్చుకున్నారు... అంటూ కొసమెరుపు శ్రీశ్రీ ఇలా ఇచ్చారు:
`నా ఒక్కడికి మాత్రమే తెలుసు, ఆవిడ ఎందుకు చచ్చిపోయిందో అన్న అసలు కారణం.' కరుణ రసం దు:ఖానికి సంబంధించినది. `కన్నీటి కబుర్లు' ఈ రచన. `తెలుగునాట భక్తిరసం లాగే కరుణరసం కూడా తెప్పలుగా తేలుతోంది' అంటూ ప్రారంభిస్తారు.`భగవంతుణ్ణి అందరూ కరుణామయుడంటారు. అంటే ఎప్పుడూ ఏడుస్తూ ఉంటాడని నేను చెప్పే అర్థం. నిజంగా ఉంటే అతడు తాను చేసిన దాన్ని చూసుకొని ఏడవటం తప్ప ఇంకేం చెయ్యగలడాయన' అని ప్రశ్నిస్తారు.
ప్రబంధ కవుల, భావ కవుల దు:ఖాన్ని ఉదహరించారు. ఎవరైనా గొప్పవాడు మరణిస్తే `ఏడవండయ్యా, ఏడవండి... కాని, వెంటనే కళ్ళు తుడుచుకుని కార్యరంగంలోనికి దిగడమే మన కర్తవ్యం అనేదే నా హెచ్చరిక' అంటారు శ్రీశ్రీ. కరుణ, శృంగార రసాలు జంతుజాలానికి, మనకూ సామాన్యమైనవి... ఈనాడు వీరరసానికి పట్టం గట్టాలని నేను సిఫారసు చేస్తున్నాను' అంటూ ముగిస్తారు.
ఆఖరిదీ, తొమ్మిదోదీ, శ్రీశ్రీ సిఫారసు చేసిన రసం `వీరరసం'. దీనికి సంబంధించిన రచనకు శీర్షిక `వెలుతురు కిరణాలు'. దీనిలో గెరిల్లా యోధుడొకడు పోలీసుపై గొడ్డలి విసురుతాడు. అది గురి తప్పింది. పొదల్లో మాయమవుతున్న వీరుడికి గూరిచూసి పేల్చాడు పోలీసు. గెరిల్లా తొడకి తూటా తగిలింది. రెండవ కాలి మీద కూడా కాల్చి నిర్బంధంలోకి తీసుకున్నారు. చిత్రవధలు పెట్టారు. ఒక బందిపోటును ఆత్మ రక్షణార్థం కాల్పులు చేసి చంపారని, ఒక దేశద్రోహి మరణించాడని పత్రికలు ప్రకటించాయి.
నిజానికి ఆ వీరుడితో రహస్యాలు రాబట్టడానికి ప్రయత్నం జరుగుతోంది. తన పేరు మానవుడనీ, ఊరు ప్రపంచమనీ, అది ప్రపంచంలో ఒక కుగ్రామమనీ చెప్తూ సంకెళ్ళున్న చేతులతోనే పోలీసు నెత్తి మీద మోదడానికి ప్రయత్నిస్తాడు.
`బయటకు తీసికెళ్ళి కాల్చేయండి' అని ఆజ్ఞ. ఈ రచనను శ్రీశ్రీ ఈ క్రింది ఉత్తేజపూరిత, సందేశపూరిత వాక్యాలతో పూర్తి చేశారు :
`పూర్తిగా చీకట్లు పోని, బాగా వెల్తురు రాని సయమం అది. అప్పుడు వీరుడు సంతోషపూర్వకంగా తుపాకీ గుళ్ళని స్వీకరించాడు. ఆ చీకట్లో అతనికేవో వెలుతురు కిరణాలు కనిపించాయి. అవి తాను చదువుకునే గదిలో పెట్టుకున్న మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావోల వర్ణచిత్రాలు!'
ఈ విధంగా తొమ్మిది రసాల కోసం తొమ్మిది వైవిధ్యభరితమైన కల్పనలతో శ్రీశ్రీ ఈ రచనలను మనకు అందించారు. గాంభీర్యమూ, హాస్యమూ, కలగలిసిపోయిన ఈ విశిష్ట రచనలను సాహిత్య మిత్రులందరూ చదివి తీరాలి.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|