|
|
Articles: Short Stories | చదువూ సంస్కారం - Site Administrator
| |
ఇంతకూ - విషయమేమిటంటే, రాములమ్మ తల్లితండ్రులూ నిరుపేదలే. వీధిబడిలోనే ప్రాథమిక విద్య నేర్చుకుంది. ఎప్పుడు పెద్దపిల్లయితే (సంవర్తాడితే) అప్పుడు చదువు మాన్పించేద్దాంలే అని, ఆ పక్కనే ఉన్న ఉన్నత పాఠశాలలో చేర్చారు. ఏడవ తరగతి కొచ్చింది సంవర్తాడలేదు. 8, 9 10లోకి వచ్చింది. ఇంకా లేదు! 10వ తరగతి 'ఫస్టుక్లాసు'లో 90 శాతం మార్కులతో పాసయ్యింది. ప్రజలు మెచ్చుకోలేదు సరిగదా, గుంట గడసరి, స్లిప్పులు బాగా అందించి ఉంటారు కావలసిన అబ్బాయిలు. చూసిరాసి పాసైపోయిందని అన్నారు. పోనీ, పాసుమాటకేం గానీ ... శరీరాన్ని బిగబెట్టీసిందేంటో.... ఇంకా సంవర్తాడలేదు గుంటన్నారు. ఈ లోగా ఆ - ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీగా 'అప్ గ్రేడ'యింది. ఇంటర్ లో చేరిన రాములమ్మకు 16! ప్చ్... కాలేదు. 17లోకి వచ్చింది. ఇంటర్ రెండోసంవత్సరం పరీక్షల్లో 80 శాతం మార్కులతో ఫస్టుక్లాసులో పాసయినట్టు తెలిసిన క్షణంలోనే 'కూర్చుంది' (పెద్దమనిషయ్యింది). నారాయణ వాళ్లొచ్చారు, చైతన్యవాళ్లొచ్చినా గవర్నమెంటు జూనియర్ కాలేజీలోనే చదివింది.
ఇప్పుడు అవేవో కాన్సెప్టు కాలేజీలొచ్చాయి ఎత్తుకుపోవడానికొచ్చారు కోచింగులకని. రాములమ్మ తల్లితండ్రులు భయపడ్డారు. పెళ్ళి సంబంధాలు చూశారు. అసలే వెనుకబడిన కులస్తులు. ఇంతో అంతో కలిగి ఉన్న కుటుంబంలోని సీతప్పడుతో ముడెట్టీసినారు. ఈ పిల్ల తెలివితేటలయినదేగాని, పెంకిదిగాదని ప్రజలకే గాదు - తల్లితండ్రులకీ అర్థమయ్యింది. తాహతుమించి ఆలోచించకుండా, పరిస్థితుల మధ్య నిలబడి, వయసొచ్చినాక జీవితం అన్నింటికన్నా ముఖ్యమని భావించిందేమో, పెద్ద చదువులు లేకపోతే, జ్ఞానముండదాయేటని - సీతప్పడి చేత ముడెట్టించుకుంది రాములమ్మ. ఇంత చదువుకున్నా, వ్యాకరణం తెలిసినా - తల్లిబాసను మరచిపోవడానికి ఇష్టపడలేదు రాములమ్మ. తెలుగులోనే ఆలోచించిందంతా. సుఖపడ్డప్పుడు తెలుగులోనే నవ్వుకుంది. కష్టపడ్డప్పుడు ఏడ్వడానికి ఇష్టపడలేదు తెలుగులోనే ఆలోచించి గట్టెక్కడం నేర్చుకుంది. తెలుగులోనే ముద్దు ముద్దు పిల్లల్ని కన్నది. వారికి స్వంత ఆస్తి ఇవ్వలేకపోయినా... భర్తను మర్యాదగా మందలించడం తప్ప తూలనాడడానికి ఇష్టపడదు. మొగుడు స్వచ్ఛంగా, స్వేచ్ఛగా, ప్రకృతిసిద్ధంగా, మర్మం లేకుండా ఉంటాడు... అదే చాలనుకుంటుంది ఆమె. ఇలాంటి 'ఆమె' కన్నా మరియే యితరేతర 'ఆమె'లు - ఎంత చదివినా, ఎంత కలిగి ఉన్నా, ఏ అంతస్తులో ఉన్నా గొప్పవారు కాలేరేమో అనిపిస్తుంది.
మరి సీతప్పడో - వీధి బడిలో 5వ తరగతి చదువుకున్నాడు. ఇంటి పరిస్థితులను చూసి శ్రమపడి సంపాదించి కుటుంబానికి తోడ్పడాలనుకునేవాడేమో! ఆ ఊళ్ళోనే ఉన్న ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో చేరాడు. ప్రాథమిక పాఠశాలలో వచ్చిన అనుమానాలు ఇక్కడా తీరనందుకు విసుక్కునేవాడు. తెలుగు నేర్చుకోవడం సుళువు అని భావించలేదుగాని నేర్చుకోవడం 'అందం'గా అనిపించిందేమో, సరదాగా చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నించి వాడుకభాషలోకి అన్వయించుకొని, అసలు విషయాలు తెలుసుకొని ఆనందించేవాడు. లెక్కలుతోనే చిక్కంతా - ఒకటికి ఒకటి కలిపితే... ఎంత జెప్పినా రెండనిపించేది కాదు... ఒకటే అనిపించేది. ఒకటిలో ఒకటి తీసీమంటే... తీసీడమేటని ప్రశ్న. ఒకటిలో రెండు తీసీమనడమేంటని చికాకుపడేవాడు. గుణింతాలు అసలు నచ్చేవికావు... ఆ హెచ్చువేతలేంటని ఆశ్చర్యం! అంకెల్లో స్థానవిలువలు గుర్తించవచ్చునుగాని... 100లో 1 వందైపోడమేంటో? పోనీ 1000లో ఒక సున్నా 1, రెండవ సున్నా 10, మూడవ సున్నా వందవ స్థానావిలువల్లో అంత తేడారావడం ఇష్టముండేది కాదు. పాఠశాలకు లేటుగా వస్తే దెబ్బలేంటని 1-2 రోజులు మానేసి, కూలిపనికెళ్ళి దెబ్బలుకు బదులుగా 'డబ్బులు' తెచ్చుకొనేవాడు. 3వ రోజు స్కూలుకెల్తే మరి రావొద్దు పొమ్మనేవారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|