|
|
Articles: TP Features | వెయ్యి కళ్ళ యుఐడి! - Site Administrator
| |
పౌరుల అన్ని లావాదేవీలకు ప్రత్యేక గుర్తింపు నంబర్ తప్పనిసరి. ముఖ్యంగా ఆదాయపన్ను ఆస్తి, రిజిస్ట్రేషన్, వాహనాల కొనుగోలు, పెళ్ళి రిజిస్ట్రేషన్, తదితర ఆర్థిక, సామాజిక వ్యవహారాలకు ఇది మరీ అవసరం. దీనివల్ల పౌరులకు ఎంత మేలు జరుగుతుందో చెప్పలేం. కానీ ప్రభుత్వానికి మాత్రం కచ్చితమైన లాభాలున్నాయి. అధికారిక లావాదేవీల్లో ప్రభుత్వం పన్నులను, యూసర్ చార్జీలను అణా పైసలతో సహా వసూలు చేయడానికి మార్గం సుగమం అవుతుంది.
ఇలా ఈ యుఐడి కార్డుతో రాజ్యానికి వెయ్యి కళ్ళు, వెయ్యి చేతులు వచ్చినంత పని అవుతుంది. రాజ్య వ్యవస్థ పటిష్టం అవుతుంది. రాజ్యపు కోరల నుండి పాలితులు ఏ ఒక్కరూ తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏ ఒక్కరు అన్న పదానికి ఇక్కడ మధ్యతరగతి, క్రింది తరగతి జనులు అని అర్థం చేసుకోవాలి. రాజ్యాన్ని నడిపేవారు, ఉన్నత తరగతికి చెందిన వారికి ఈ దేశంలో చట్టాల నుండి తప్పించుకోవడం, దాని బారిన పడకుండా రక్షించుకోవడం బాగా తెలుసు. తప్పించుకోడానికి వీలయిన రహస్య కంతలను వారు ముందుగానే చట్టాన్ని నిర్మించేటప్పుడే ఏర్పాటు చేసుకుంటారు.
దేశంలో నుండి స్విస్ బ్యాంక్ కు లక్షలాది కోట్ల రూపాయలు తరలించిన దొంగలు ఎవరు? సత్యం తిరగబడి మేటాస్ గా మారి జనాల నెత్తిన కుచ్చు టోపి పెట్టిన తీరును, రెండు ఎకరాల ఆసామి రాజకీయాల్లోకి వచ్చి రెండువేల కోట్ల రూపాయల సంపన్నుడిగా మారుతున్న వైనాన్ని దేశంలోని ఏ గణాంకాలూ వివరించవు. ఇలాంటి వారి వివరాలను యుఐడి ప్రాజెక్టు ఎలా పట్టుకుంటుందో మరి?
రానున్న ఆరు ఏడు నెలలో ఈ నంబర్ల పంపిణీ ప్రారంభం అవనుంది. ఈ నంబర్లను కొంచెం వెనకా ముందు అందరూ తీసుకోవాల్సిందే, కాని యుఐడి నంబర్ కార్డు ఉన్నంత మాత్రాన ఎలాంటి హక్కులూ సంక్రమించినట్లు కాదని యుఐడిఏ చైర్మన్ నందన్ నీలేకని ముందు జాగ్రత్త చర్యగా పదే పదే ప్రకటిస్తున్నారు. అంటే ప్రభుత్వం ఎప్పటివలెనే పౌరులకు ఎలాంటి కచ్చితమైన, చట్టబద్ధమైన హామీలు ఇవ్వదు. కానీ ప్రభుత్వం అన్ని రకాల పన్నులను పౌరుల నుండి వసూలు చేస్తుంది. పౌరుడు ఏదైనా ఒక శాఖకు ఐదు పైసలు అప్పు పడినా కంప్యూటర్ డాటా బేస్ లో ఇతను ఫలానా శాఖకు డబ్బు కట్టాల్సి ఉంది, లేదా ఇతను ఇంత బిల్లును ఏగవేశాడనే మెసేజ్ కంప్యూటర్ స్ర్కీన్ పై వస్తుంది. పౌరుడిని దొంగను చేసి నిలుపుతుంది.
యుఐడి నంబర్ ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తి కులాన్ని, మతాన్ని, అక్షరాస్యుడా కాదా? తదితర వివరాలను పొందుపరచడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి తీసిన జనాభా లెక్కల్లో కూడా కులం వివరాలు లేవు. భారతదేశంలో పౌరులకు జీవితాంతం ప్రభావం చూపే కులం అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకోకుండా సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టడం సాధ్యమే కాదు. యుఐడి నంబర్ లో పౌరుడి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేది, చిరునామా మాత్రమే ఉంటాయని తెలుస్తుంది. అంటే దేశంలో 22 శాతం బిపిఎల్ కుటుంబాల దారిద్ర్యం వివరాలు ఉండవు. దాదాపు 40 శాతం ఉన్న నిరక్షరాస్యత దేశ జనాభాలో సగ భాగం ఉన్న వృత్తి కులాల వివరాలు ఈ యుఐడి నంబర్ లో ఉండవు. ఈ వివరాలు డాటా బేస్ లో లేకుండా ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందో తెలియదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|