|
|
Articles: My Thoughts | ఆ మనసుకు కళ్ళుంటే! - Site Administrator
| |
అప్పటిదాకా రంపచోడవరం కేంద్రంగా పనిచేసిన మేము 1999లో భాగ్యనగరానికి మారాము. నల్లమలకు మా కార్యక్రమాలను విస్తరించాము. అటు కొండరెడ్ల చేత, చెంచులచేత విస్తృతంగా వారి జీవితాన్ని గూర్చి, వన్యప్రాణుల గురించి వ్రాయించాము. ఆ సమాచారం కొంత ఉపయోగించుకొని 1991 ప్రచురణను సంస్కరించి 2007లో 'కొండకోనలలో తెలుగు గిరిజనులు'గా ప్రచురించాము. ఈ ప్రచురణనుపాడేరులో 'గిరిజన సంస్కృతి పరిరక్షణ సంఘం' వారు తొలుత ఆవిష్కరించారు. తరువాత ఏకలవ్య ఫౌండేషన్ వారు రవీంద్రభారతిలో నిర్వహించిన ఆవిష్కరణలో శ్రీ చినవీరభద్రుడు ప్రధానవక్త.
2007లో ఏకలవ్య ఫౌండేషన్ వేణుగోపాలరెడ్డి, మనోహరప్రసాద్ లతో రంపచోడవరం వెళ్ళినప్పుడు అక్కడి అధికారులతో రెండుమూడు రోజులు తిరుగుతూ గిరిజన సంస్కృతిని వివరించే అవకాశం కలిగింది. అక్కడి ప్రాజెక్టు అధికారి కొండరెడ్ల సంస్కృతిమీద తెలుగు-ఆంగ్లంలో మేం తయారు చేసిన 2008, 2009 కాలెండర్లు ప్రచురించడమేకాక, రంపచోడవరంలో మా కార్యాలయ ప్రాంగణాన్ని 'గిరిజన విజ్ఞాన కేంద్రం'గా (మ్యూజియం) తీర్చిదిద్దడానికి నిధులు సమకూర్చారు. పదేపదే పాడేరువెళ్ళడం, మిత్రులతో ఆ ప్రాంతం వారసత్వంగూర్చి ముచ్చటించడం చాలా మంది మిత్రులలో ఉత్సాహం పెంచింది. మన్యం పల్లం రాజ్యాలకు రాణి మోదమ్మ తన కొడుకు సంజీవరాజుకు మాలగంగును పెళ్ళి చేసిన గేయగాధ గిరిజనుల దార్శనికతను రసవత్తరంగా చిత్రించింది. ప్రాజెక్టు ఆఫీసర్ నివాసానికి సమీపంలో పాతపాడేరు బాలికల ఆశ్రమ పాఠశాలల వద్ద రోడ్డు పక్కన పడి ఉన్న మాలగంగు పాద ముద్రలకు ఒక గుడి నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు మోదకొండమ్మను దుర్గనుచేసి మొక్కుతున్న జనం, ఇకనుండి మాలగంగు ద్వారా మన్యంగూర్చి తెలుసుకుంటారు.
2009లో నల్లమలలో చెంచుల బతుకు తెరువుల అభివృద్ధి కోసం పనిచేయడానికి 'ప్రపంచ ప్రకృతి నిధి' (డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్) చేయూత లభించింది. ఇతర వన్యప్రాణి సంరక్షణ సంస్థలతో సాంగత్యం కలిగించింది. ఫోటోషాప్, వెబ్ సైట్ సౌకర్యాలు పెరిగిన ఈ కాలానికి తగ్గట్లు వివిధ ప్రాంతాలలో తెగల ప్రత్యేకతలతో ఇదివరకు ప్రచురించిన కాలెండర్ వంటి మరిన్ని వ్యాఖ్యా చిత్రాలు రూపొందిస్తున్నాము. కుందేలువలె హక్కుల సాధనలో పరుగు తీస్తున్నప్పటికీ, తీరిక దొరికినప్పుడన్నా తాబేలువలె సంస్కృతిని గూర్చి కృషిలో ముందడుగు వేస్తున్నాం. మన కళ్ళతో, గిరిజనుల మనసుతో వారి ప్రపంచాన్ని చూపించే చిరు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|