|
|
Articles: My Thoughts | మాతృభాషకు దిక్కెవరు? - Site Administrator
| |
భ్రమలను విశ్వాసాలుగా, విశ్వాసాలను మతంగా, మతాన్ని రాజకీయం చేసి - ఫ్యూడల్ రాచరిక వ్యవస్థ ద్వారా ప్రజల శ్రమశక్తిని, ఆర్థికదోపిడీ వనరుగా మార్చివేశారు. తమ ఆర్యభాషలతోనే తాము జీవిస్తూ, కృత్రిమ సంస్కృతభాషను దేవభాషన్నారు. ప్రజల భాషలను పైశాచిక భాషలన్నారు. ప్రజల శ్రమనూ, చైతన్యాన్నీ రాక్షసత్వమనీ, సామాజిక కార్యాచరణనను రాక్షసమనీ, ప్రజల విముక్తి మార్గాలన్నీ వాటి సాధన రహస్యాలన్నీ సంస్కృతంలో నిర్దేశింపబడివున్నాయనీ వైదికమతం ప్రచారం చేసింది. ఋషులు ఆశ్రమ విద్యావిధానం ద్వారా, ఆధిపత్యవర్గాలకూ, వారిననుసరించబూనిన అనార్యవర్గాలకూ సంస్కృతాన్ని బోధించి పాలకభాషగా రూపొందించబూనారు. భారత జాతీయభాష సంస్కృతమనిపించడానికి సర్వప్రయత్నాలూ చేసి విఫలమయ్యారు. ఈనాటికీ సకల భాషలకూ మూలభాష సంస్కృత మని చెప్పడం మానలేదు మత శక్తులు. వర్ణవ్యవస్థ ఈ సంస్కృత విద్యావిధానానికి శూద్రులనూ, స్త్రీలనూ దూరంగానే ఉంచి, తమ 'దైవ దుర్మార్గా'న్ని ప్రకటించుకుంది.
సంస్కృతీకిరంపబడిన తెలుగుభాషా, రచనలూ, సంస్కృతభాషా లక్ష్యాలనే నిర్వర్తించబూనుకుని, ప్రజలకు దూరమయ్యాయి. వలస పాలకులు తమ స్వప్రయోజనాల కోసం ఇంగ్లీషు భాషా ప్రాబల్యాన్ని పెంచారు. అయినా, ప్రజలు - వలసవాదులూ, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, ఫ్యూడల్ నిరంకుశపాలనకు వ్యతిరేకంగా పోరాడడానికీ, సమైక్యతకూ తెలుగును ఒక ఉద్యమ సాధనంగా ఎంచుకున్నారు. దీనికి తెలుగు వాడుక భాషా ఉద్యమాలు ఎంతో సహకరించాయి. తెలుగు వాడుక భాషా రచనలు తెలుగు ప్రజలకు సన్నిహితమై తెలుగుభాషా జాతిని ఉద్దీపింపజేసాయి.
మానవ వనరులూ, ప్రజల శ్రమశక్తీ ఉత్పత్తులు, చివరికి మాన సంబంధాలు ప్రపంచమార్కెట్ సరుకుల్యాయయి. ఇప్పుడు ప్రజలకు 'ఇంగ్లీషు' విద్య అనివార్యమని, ఆచరణ యోగ్యమనీ సామ్రాజ్యవాదులకు బానిసలైన పాలకవర్గాలూ, వారి రాజ్యాంగాలు ఉద్బోధించ బూనుకున్నాయి. మరో బానిస వ్యవస్థకు రూపకల్పనన్నట్టు అంగీకరిస్తున్నారు. విచిత్రమేముంది? దేశభక్తులూ, జాతీయవాదులూ, బుద్ధిజీవులూ ఈ పరిస్థితిని అంగీకరించడంలోనూ, లేదా వారి మౌనంలోనూ, గందరగోళంలోనూ ఉంది విచిత్రమంతా. ఇదే ఈ నాటి విషాదం.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|