|
|
|
|
Articles: Drama | నరకానికి పూలదారి!? - Mr. pyyetisrinivasarao srinivasulu
| |
చం : అది కాదు విశాలా! పాపం! ఆ అమ్మాయి...
వి : ఛి ఛీ! ఇంక ఆ ముండ మాట నా దగ్గర ఎత్తకండి. నాకు ఆవేశం వచ్చిందంటే ఒళ్లు తెలీదు. అప్పుడు నేనేంచేస్తానో నాకే తెలీదు.
చం : ఏం చేస్తావేం? నా తల తీసేస్తావా? ఏదో పోనీ కదాని మెల్లిగా మాటాడుతుంటే మరీ రెచ్చిపోతున్నావు.
వి : అవును. ఆడది ఏం చెయ్య లేదనేగా మీ ధైర్యం? అందుకే ఎన్ని వెధవపనులైనా చేస్తారు మీరు.
చం : అసలు నిన్ను నా గదిలోకి ఎవరు రమ్మన్నారు? ఆ అమ్మయినెవరు చూడమన్నారు?
వి : ఎంతో బావుందండీ! అవునండీ. ఈ కాలంలో ఒక భార్య తన భర్త గదిలోకెళ్లడం తప్పు. అదే ఒక బజారు స్త్రీ తన భర్త గదిలోకెళ్లి కులుకుతుంటే ఏ తప్పూ ఉండదు.
చం : అవును. తప్పేం లేదు. ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది. నా కోసం వచ్చింది. నేనూ ఆ అమ్మాయంటే ఇష్టపడ్డాను. అసలు నన్నడగటానికి నువ్వెవరివి?
వి : (తెల్లబోయి) నేనెవర్నా?! అవును. నేనెవర్ని?! (వెటకారం) బజారు తిరుగుళ్లు మరిగినవారికి ఇంట్లో పెళ్లాం పిల్లలు కనిపిస్తారా మరి?! మరో క్షణం ఆ ముండ మీ గదిలో ఉంటే నేనే చెప్పేదాన్ని నేనెవర్నోను!
చం : ఏం చేస్తావే? ఆ అమ్మాయిని కొడతావా?
వి : అబ్బే! కొట్టను. 'రా అమ్మా! నా భర్త ప్రియురాలా!' అని చెప్పి కూర్చోబెట్టి, పువ్వులతో పూజ్జేస్తాను. దాని కాళ్లు రెండూ కడిగి, ఆ నీళ్లు నా నెత్తిన జల్లుకుంటాను.
చం : కర్రెక్ట్! ఇప్పుడు నువ్వు అసలు సిసలైన పతివ్రతలా మాట్లాడావు.
వి : ఏమిటా వెటకారం?!
చం : ఛి ఛీ! నాకీ ఇంట్లో సౌఖ్యం లేకుండాపోయింది.
వి : ఎలా ఉంటుందండీ సౌఖ్యం?! పెళ్లై పద్ధెనిమిది సంవత్సరాలైనా, మీలోని కోరికలు చావలేదు. అదే మీ భార్య తన జీవితంలోని ఉత్తమ ఘడియలనన్నిటినీ మీకే అర్పణ చేసుకుని, ఇప్పుడు మీకు పనికిరానిదైపోయింది. ఇప్పుడు మీకు పెళ్లాంతో అవసరం తీరిపోయిందండీ! అది మీ దృష్టిలో చచ్చిపోయిందండీ! చచ్చిపోయింది!! (భోరున విలపిస్తుంది)
చం : ఏమిటా ఏడుపు? ఇక్కడెవరో చచ్చినట్లు!
వి : (ఏడుపును కంట్రోలు చేసుకుని అనునయిస్తూ) ఏవండీ! ఒక్క విషయం ఆలోచించండీ! పరువూ గౌరవం గల కుటుంబాలు మనవి. మచ్చ అనేది ఎరగని పవిత్రమైన వంశాలు మనవి. మీరు నన్ను ప్రేమగా చూచుకుంటారని, మా నాన్న నన్ను మీ చేతుల్లో పెట్టారు. మీరిప్పుడు ఒళ్లు తెలీని మైకంలోనూ - కళ్లు కనిపించని కామంలోనూ పడి మన రెండు వంశాలకీ మచ్చ తీసుకురాకండి! ఒక్కసారి మీరు ఆ రోజుల్ని గుర్తుకు తెచ్చుకోండి. మన పెళ్లైన కొత్తలో మీరు నన్ను దగ్గరకు తీసుకుని, 'నిన్ను పొందగలిగిన అదృష్టాన్ని నేను దేవుడిచ్చిన వరంగా భావిస్తాను విశాలా!' అన్నారు. నేను మరువలేని ఆ మధురమైన రోజుల్ని మీరెలా మర్చిపోయారండీ?! మనిద్దరం కులాసాగా గడిపి ఎన్నాళ్లైందండీ?! అసలు నాలో ఏం లోపం చూసుకుని నన్నింత దూరం చేసుకుంటున్నారండీ?! చెప్పండీ! నా కళ్లల్లోకి సూటిగా చూసి చెప్పండీ! (ఏడ్చేస్తుంది).
చం : (టేబులు దగ్గరకెళ్లి బ్రాందీని సీసాతోనే కొద్దిగా తాగి) ఇప్పుడా విషయాలన్నీ అనవసరం. నేను జీవితాన్ని పూర్తిగా అనుభవించదల్చుకున్నాను. అనుభవిస్తాను. నా ఆనందానికి అడ్డు రాకు!
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|