|
|
Articles: TP Features | వెయ్యి కళ్ళ యుఐడి! - Site Administrator
| |
ఇప్పటికే దేశంలో క్రింది స్థాయిలో పౌరులు కొందరు మూడవశ్రేణి పౌరులుగా, అన్ని రకాల మౌలిక హక్కులను కోల్పోయి బానిసలుగా బ్రతుకుతున్నారు. అతి పరిమిత స్వేచ్ఛతో కొయ్యకు కట్టిన పశువుల్లా బ్రతుకు ఈడుస్తున్నారు. బ్రతకడానికి అవసరమైన కనీస వసతులు అయిన విద్య, వైద్య సౌకర్యాలు లుప్తమయ్యాయి. పారిశుధ్యం, ప్రాథమిక విద్య, ఆరోగ్యం అనే బాధ్యతల నుండి ప్రభుత్వం చాలా వరకు తప్పుకున్నది. సమీప భవిష్యత్ లో ఈ బాధ్యతను ప్రభుత్వం భుజాలకు ఎత్తుకొనే సూచనలు కూడా ఏమీ కనిపించడం లేదు. దీనికి తోడు దేశంలోని కోటానుకోట్ల వృత్తి కులాల వారికి వారి సహజ వనరులపై సంప్రదాయిక వృత్తులపై గల హక్కులు లేకుండా చేశారు.
పంట భూమి నుండి రైతునీ, రేవు నుండి చాకళ్ళను, అడవి నుండి గిరిజనుడిని, సహజంగా అడవిలో పెరిగే వెదురు నుండి మేదరులను, టేకు వనాల నుండి వడ్రంగులను, కుంట, చెరువు మట్టి నుండి కుమ్మరిని, ముడి ఇనుప ఖనిజ వనరు నుండి కమ్మరిని, చెరువులు, సరస్సుల నుండి బెస్త వారిని ఇలా సమస్త కులాల వారిని, వారి సహజ వనరుల నుండి, వృత్తుల నుండి దూరం చేశారు. సిరిశాల నుండి శాలోళ్ళను, అగసాల నుండి కంసాలులను దూరం చేశారు. మొరీలు తీసే పాకీ పని, ఆసుపత్రులు శుభ్రంచేసే ప్రమాదకరమైన రిస్కుతో కూడిన ఒకటి రెండు పనుల్లో మినహాయిస్తే సంప్రదాయిక వృత్తి కులాల వారందరినీ వారి వృత్తుల నుండి, వనరుల నుండి దూరం చేసేశారు. ఇటీవలి దాకా నీచమైన పనిగా చేసే మంగలుల వెంట్రుకలు కత్తిరించే పనిని, చాకలి వారి బట్టలు ఉతికే పనిని, మాదిగల తోలు పనిని కూడా ఇతర సంపన్న కులాల వారు లాగేసుకున్నారు. ఇలా వృత్తికులాల వారిని బికారులను చేస్తున్నారు. ఈ వివరాలు యుఐడి ప్రాజెక్టు డాటా బేస్ లో ప్రతిబింబించవు.
భూమికి, వృత్తికి దూరమైన భూమి పుత్రులు పుట్టెడు శోకంతో బ్రతుకు ఈడ్చడం ఎలా అనే చింతతో బ్రతుకులనే చాలిస్తున్నారు. చావడానికి ధైర్యం లేని వారు భిక్షగాళ్ళుగా మారుతున్నారు. అవును ఈ భిక్షగాళ్ళకు యుఐడి నంబర్ కార్డులు ఇస్తారో లేదో నందన్ నీలేకనిని అడగాలి.
నిలేకని మన పొరుగు రాష్ట్రం కర్ణాటకకు చెందిన బ్రాహ్మణ టెక్నోక్రాట్. గతంలో ఇన్ఫోసిస్ సారథిగా ఉన్నారు. కర్ణాటకలో పుంఖాను పుంఖాలుగా భిక్షకులున్నారు. అక్కడ దాదాపు 14 లక్షల 33 వేల 891 మంది భిక్షగాళ్ళు ఉన్నారని అంచనా. మరి వీరందరికీ యుఐడి కార్డులు ఇస్తారా? ఆంధ్రప్రదేశ్ లో 26,41,553 మంది భిక్షగాళ్ళు ఉన్నారు. వీరిని ఏం చేస్తారో! ఉత్తర తెలంగాణా లోని నాలుగైదు జిల్లాల్లో లక్షమందికి పైగా జోగిని, బసివినులు, సంచార కులాల వారు ఉన్నారు. వీరిని ఏం చేస్తారు?
భిక్షకులకు, సంచార జాతులు - కులాల వారికి యుఐడి నంబర్ ఇస్తారా? దీనిపై వారి చిరునామాను ఏమి రాస్తారు. వారికి నంబర్ కార్డులు ఇస్తే వారు వాటిని ఎక్కడ జాగ్రత్త చేసుకోవాలి. ఒకవేళ కార్డు పోగొట్టుకుంటే కొత్త కార్డు ఇస్తారా? అలా ఎన్నిసార్లు ఇస్తారు. పోనీ ఈ గొడవంతా ఎందుకు ఇలాంటి దరిద్ర నారాయణులను పట్టుకొని నుదుటిపై నంబర్ ను పచ్చబొట్టు పొడిపిస్తే సరి!
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|