|
|
Articles: Drama | ప్రేమ దొంగలు... - Mr. GodDevendra GodDevendra
| |
(ప్రకాశం ఓ క్షణం అటూ-ఇటూ పచార్లు చేసి మళ్లీ ఫోనందుకుని డయల్ చేస్తాడు) స్టిల్ ఎంగేజ్డ్! ఛి-ఛీ! ఈ లేడీస్ హాస్ట్ల్ కి ఫోను చేసే వాళ్లకిదో తెగులు. అమ్మాయిల కంఠస్వరం విన పడగానే, గంటల తరబడి మాటాడేస్తారు. అనవసరంగా ఈ వెధవతో పందెం కాశాను. కాయక పోయినా బాగుండేది. అసలు నా కున్న ఈ కాస్త టైములోనూ తాయారుతో మాట్లాడ్డం పడుతుందో పడదో? (వాచీ చూసుకుంటాడు) అయ్య బాబోయ్! అప్పుడే మూడు నిముషాలు అయిపోయాయి. (ఇంతలో బవ్య వచ్చి కిటికీలోంచి ఫోనెత్తుతాడు. కంగారుగా ప్రకాశం ఫోను దగ్గరకు పరిగెడతాడు) క్షమించండి! ఇందాకట్నించీ నేనో నెంబరుకోసం ట్రై చేస్తున్నాను. మీరు కాసేపాగి వచ్చి ఫోను చేసుకోండి.
బవ్య:- ట్రక్ కాల్స్ ఎప్పుడూ అంతేనండీ! నాది లోకల్ కాలే! ఒక్క రెండు నిముషాలు మాటాడతాను. అంతే!
ప్ర:- ఎక్స్ క్యూజ్ మీ! నేను మీకా టైమివ్వలేను.(బలవంతంగా ఫోను లాక్కుని డయల్ చేస్తాడు)
బవ్య:- హాఁ! హతవిథీ! నీదృక్కులు ఎంత కౄరంబులయ్యెడిన్?! (పక్కకు తప్పుకుంటాడు)
ప్ర:- హ్లో! లేడీస్ హాస్టలే కదండీ?! ఒక్కసారి అర్జంటుగా ఫోను దగ్గరకి తాయారు గార్ని పిలవండి. వీల్లేదు. ప్లీజ్! ఎక్కడున్నా సరే! ఆవిడను ఫోను దగ్గరకు రప్పించాల్సిందే! చాలా ముఖ్య విషయమండీ! అతి అర్జంటుగా ఆవిడతో మాటాడాలి. లేకపోతే ప్రమాదాలు జరిగే సూచనలున్నాయండీ! హత్యలూ-కూనీలూ జరిగిపోతాయండీ! థాంక్యూ!!(కొద్ది క్షణాల్లో అవతలినించి తాయారు గొంతు వినిపిస్తుంది.)
ప్ర:- హలో! ఎవరండీ మాటాడేది? తాయారు గారేనా? నమస్కారమండీ! నేనూ ప్రకాశాన్నండి మాటాడేది. ఏం లేదండీ! మీరు నాకో చిన్న సాయం చెయ్యాలి. ఇంకాసేపట్లో సుందరంగాడు మీకు ఫోను చేస్తాడు. వాడ్ని మీరు ప్రేమించడం లేదని ఖచ్చితంగా చెప్పెయ్యాలి. ఎందుకంటారేంటండీ? మేమిద్దరం పందెం వేసుకున్నామండీ! ఆ పందెంలో నేనోడిపోతే సుందరానికి వంద రూపాయలిచ్చుకోవాలండీ! చూడండీ! నేను చాలా బీద వాడ్నండీ! పరీక్ష ఫీజు కట్టడానిక్కూడా డబ్బుల్లేవు. అందుకే నేనీ పందెం కాయకా తప్పలేదు-మిమ్మల్ని ఇబ్బంది పెట్టకా తప్పలేదు. ఏం లేదండీ! మీరు వాడితో -'ఐ హేట్ యూ!' అనండి. ఆ తరవాత 'ఐ లైక్ ప్రకాశ్ ' అనండి. ఎందుకంటే అతను జెంటిల్ మాన్ అనండి. నేను పందెం నెగ్గుతాను.అది చాలండీ! అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్. మా వాడు పాటలు పాడ్డంలోనూ, గేయాలు చదవడంలోనూ ఘటికుడు లెండి. మీరు మాత్రం నన్ను కాదనకండి. రేపు నేను పరీక్షకెళ్లడమన్నా మానడమన్నా అంతా మీ చేతిలోనే వుంది. నన్ను నీట ముచుతారో పాల ముంచుతారో అంతా మీ దయ! ఈ దీపాన్ని నిలబెట్టండి థాంక్యూ!!
(ఇంతలో సుందరం వస్తాడు)
సుం;- ఒరేయ్! అయిదు నిముషాలూ అయిపోయాయిరా!
ప్ర:- మరి నేను ఫోను పెట్టేస్తున్నానండీ! బై!(ఫోను పెట్టేస్తాడు.)
సుం:- ఏరా!ఏమైంది? నీతో ఏం మాటాడింది?
ప్ర:- (గర్వంగా కాలరెగరేసి) గ్రీన్ సిగ్నల్! అయినా- అది భార్యా భర్తల మధ్య నుండవలసిన బ్రహ్మ రహస్యం. నువ్వే మాటాడి తెలుసుకో!
[ప్రకాశం ఆనందంగా గదిలోంచి వెళ్లి పోతాడు. సుందరం చేతిలోకి ప్రేమించి పెళ్లి చేసుకో అనే నాటిక పుస్తుకం తీసుకుంటాడు. ఆ తరవాత స్టైల్ గా రిసీవరందుకుని డయల్ చేస్తాడు]
సుం:- హలో! తాయారు గారూ! నమస్తే! మీ గొంతును నేనెలా గుర్తు పట్టే నంటారా? రేడియోలో వచ్చినా, గ్రామ్ ఫోనులో వచ్చినా; టేప్ రికార్డర్ లో వచ్చినా .. నేను మీ గొంతును ఇట్టే గుర్తు పట్టేయగలను. సో స్వీట్ ఈజ్ యువర్ వాయిస్! మీరు లక్ష మంది మధ్యన నిలబడి మాటాడినా, మీ టోన్ ని ఇట్టే నా చెవులు పసిగటేస్తాయి! ఆఁ! ..ఏమిటీ? అదేం సిమిలీ అండీ? 'కుక్క వాసన లను పసి గట్టే సినట్లే నంటారా? ఛ!ఛ!! నన్ను కుక్క తో పోల్చడం ఏం బావులేదండీ! సర్లెండి! నాకు మీమీద అవ్యాజమైన ప్రేమ కాబట్టీ ఇక్కడ నా పక్కన ఎవరూ లేరు కాబట్టీ,మీరు నన్ను కుక్కన్నా - గాడిదన్నా ఒప్పేసుకుంటాను. ఏం లేదండీ! ఇవాళ నేనో చక్కని గేయం రాశానండీ! ఇలా రాశానో లేదో-వెంటనే మీరు నాకు గుర్తొచ్చారండీ! మీలో కవితా రస పిపాస ఉందనీ; మీరూ నాకు మల్లే కవితలు రాస్తారనీ, నా కవితలో ఏమైనా లోపాలుంటే దిద్దుతారనీ-మీకు నా కవిత వినిపించాలనుకుంటున్నానండి. ఆగండి! ఫోను పెట్టేయకండి! విని నంత మాత్రాన నష్టం లేదు కదండీ! 'విన దగు నెవ్వరు చెప్పిన ' అన్నారు. అంచేత వినండి. ఇది ప్రకృతిపై నేను రాసిన కవిత.- (ప్రేమించి పెళ్లి చేసుకో పుస్తకం తెరిచి అందులోని కవితను చదువును.నోట్:-ఈ గేయం ఆ పుస్తకంలో లేదు)
' మొక్క మొలిచింది - మొగ్గ తొడిగింది
పూవు పూసింది-కాయ కాసింది'
ఈ విధంగా మీ మీద నాకున్న ప్రేమ దిన దినాభి వృద్ధి చెందుతోందండీ!అయితే మీరు నన్ను నిరాకరిస్తే గేయం ఇలా మారుతుందండి-
'ఎండ కెండింది-వానకి తడిసింది
నేల కూలింది-మట్టి కలిసింది' - ఎలాగుందండీ ఈ గేయం? ఏమిటీ? ఈ గేయం మురళి రాసిన ప్రేమించి పెళ్లి చేసుకోలోనిదంటారా? ఓహ్! వాడు అడిగితే నేనే రాసి వాడి ముఖాన పడేశాను.ఏవిటీ? నా గేయాలతో మీకు గాయాలు చేయొద్దంటారా? హలో! ఏమిటీ? మీరనేది? మిమ్మల్ని విసిగించద్దంటారా? మీరు.. ప్రకాశాన్ని ప్రేమిస్తున్నారా? - హలో! - హలో!! .. ...
(ఫోను కట్ అయింది.సుందరం విషాదంగా ఫోను పెట్టేస్తాడు)
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|