|
|
Articles: Drama | తెలుగు విలువల ఉగాది - Editor
| |
పెద్దోడు పరుగు పరుగున అయ్య దగ్గరకొచ్చి - 'అయ్యా అయ్యా 'విలేజి అసిస్టెంటు' నిన్ను రమ్మంటున్నాడు. పోలీసు జీపు వచ్చింది. ఆ వెనక వచ్చిన అంబులెన్సు 104లోన చినబావ దిగాడు. వెళ్ళి చూసినాను. అంబులెన్సులోన నడిపి చెల్లి గాజు తొట్టిలో తొంగుంది...' అన్నాడు.
శ్రమజీవన సంస్కృతికి అగ్గి అంటుకుంది.
రైతు నిర్ఘాంతపోయి గ్రామచావిడి వేపు పరుగుతీశాడు. ఊరి జనమంతా అక్కడ గుమికూడి ఉన్నారు. జనం కాళ్ళకిందున్న భూమండలం కూడా పరుగులు తీస్తుందని ఎందరికి తెలుసు... కాలం చెల్లిపోతుంది.
ఆ గ్రామం వంటిళ్ళలో విరోధి ఉగాది ఉడికుడికిపోతోంది. వీధుల్లో గొల్లూ గోసా. పేగు తెగిపోయినట్టు చుట్టాలూ, బందుగులు ఏడ్పులు.
అంబులెన్సును ఆనుకొని నిలబడ్డ అమెరికా ఇండియను అల్లుడు ముఖంలోని ప్రశాంతతకు అర్థమేంటని రైతు ఎర్రని కనుగుడ్లు ప్రశ్నిస్తున్నప్పుడే పొద్దు దిగిపోతోంది.
రైతు భార్యకిదేం తెలవదు. వంటింట్లో - పొయ్యిమీదున్న బానలో నురగలు గక్కి మరుగుతున్న నువ్వుల నూనెలో చిల్ల చట్రం ముంచి సక్కులను దేవుతోంది. ఆమె నుదుటినుండి ఒక్క చెమట చుక్క బానలోపడి ఫెటిల్లున పేలింది. ఆమె గుండెల లబోదిబో శబ్దాలకు తరమానిక కుండ పగిలింది.
సాలలో - ఆవు కాలికి చుట్టుకొని పైకెక్కుతున్న పాము, పొంగివున్న పొదుగు సిరాలను అందుకోబోతోంది. కట్టుకొయ్యన గింజుకుంటున్న పెయ్యని 'అంబా' అని పిలుస్తోంది, పేగులు నులితిరిగినట్టు... ఆవు.
కాకి తన గూటిలోనున్న కోకిల గుడ్డును ముక్కుతో పొడిచి కిందకి పడదోసీసింది. ఈతచెట్టు కొమ్మకు వేలాడుతున్న పాత పిచ్చుక గూడొకటి తెగి, నేలన పడింది.. సంయుక్తాక్షరాల గుత్తెలాగ.
కల్లంలో పడివున్న పెసెర, మినుము మొక్కల మోపుల్లోంచి కాడకాయలు పెటిల్లున పేలి, తుళ్ళిన గింజలు - చుట్టూ గిరికీలు కొడుతూ తిరుగుతున్న పిట్టల పొట్టలను ఢీ కొనడం వల్ల అవి బెదిరిపోయి తిరిగి చూస్తున్నాయి.
ఊరి చివర కొత్తగా నెలకొన్న 'వైరులెస్సు టవరు' పైన వాలిన గెద్ద 'వైబ్రేషన్సు'ను తట్టుకోలేక గింగుర్లు తిరిగి తిరిగి కిందకి దిగి నింగివేపు చూస్తోంది... దిక్కుమాలి.
నాటుకోడి పుంజుకూ, మేకపోతుకూ ఆయుషు పెరిగింది. నారుమడిలో నవధాన్యాలు ఆకులు తొడగలేదుగాని, వేర్లతో నేలను తన్ని, పప్ఫుదళాలను పైకెత్తి రైతు ఇంటివేపు చూస్తున్నాయి - వత్తు తెలుగక్షరాల్లా దు:ఖంగా-
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|