|
|
Articles: Short Stories | స్వర్గ యాతన - Site Administrator
| |
పొద్దుట అట్టగమీంచి దించిన ఆయుధాల కట్ట విప్పి అందులోని బల్లెం, ఈటె, శూల, గునపం, వంపుతిరిగిన కత్తి, బారుకత్తీ, ఒరా, డాలు మొదలైనవన్నీ బాగా తోమి, తుడిచి ఉంచారేమో... కట్టకట్టకుండా వాకిల్లో ఆరేసారు గావాల... అవ్నీ మసక వెలుతుర్లో ఆ రాత్రి మిలమిలా మెరుస్తున్నాయి. వాటి దగ్గరికెల్లి... వాటికెదురుగా కూర్చొని పరిశీలనగా చూస్తున్న దేవి వీపి మీద గుబికి గుబికి గుద్ది... తీసుకుపోయి ఉయ్యాల్లో తొంగోబెట్టి ఊపుతోంటే ఆ పిల్ల - దక్షణనొకసారి, ఉత్తరనొకసారి తంతుంటే... ఉయ్యాల నులుచుకొనీ విప్పుకొనీ దిక్కులన్నిటా గిరగిరా తిరగేస్తోంది. 'ఈ రాత్రి నిద్రపోదు గావాలీ పిల్ల... దీంతోటి చాల్లేకపోతున్నాం... ఉండు బూచోడ్ని పిలుస్తాను' అని హెచ్చరిస్తోంది ఆ పిల్ల తల్లి.
అవతల వీధి చివరి గుడారం గుడిలో దుర్గబొమ్మ బొకబొక నవ్వుతుందేమో... అదోరకం ఊసులు దేవి ఉయ్యాలలోంచి వినబడుతున్నాయి.
'కోడలా! దేవిని కొట్టకే... ఏడుస్తది.. పల్లకో... అదే తొంగుంటది... రాతిరల్లా ఏటి చేస్తది మరి.'
'నానమ్మా! ఓలి నానమ్మా!' ఉయ్యాల్లో నుండి పిలుస్తోంది దేవి పిల్ల. 'అబ్బ! ఇప్పుటికి తిక్క తిరిగింది గావాల తెల్లారగట్లకి. అమ్మా! ఎల్లెల్లమ్మ... నీ ముద్దుల మనవరాల నోట మాట పెగిలింది. ఏటేటో వాగుతుంది...' అంది దేవి అమ్మ. నానమ్మ ఉయ్యాల దగ్గిరికెళ్ళింది. 'నేను... అష్టమినాడు కాయితం మీద అ ఆ లు రాశాను గదా... ఆ కాయితం ముక్క ఎగిరెల్లి ఆకాశం మీద అంటుకుంది. బొక్కి నోరుతోటి చందమామ చదువుతుంది' అంది దేవి. మూడేళ్ళ వయస్సున్న పిల్ల మాటల్లాగ లేవు... నానమ్మ ముక్కున వేళ్ళేసుకొని 'ఓలి నాయమ్మే... కలొచ్చిందేటే... ఆకసమంత చదువొచ్చి... భూదేవంత ఉజ్జోగమొస్తాదే నీకు...' అని మురిసిపోతోంటే... కోడలు అందుకొని ఉయ్యాల దిగని దేవినుద్దేశించి 'అమ్మీ! ఓలమ్మీ! మొన్నరాసిన ABCDల పుస్తకాలు... ఇప్పుడాకాశంలోకి ఇసిరియ్యే... వాట్ని ఇప్పుడు దూరుతున్న సూరీడు కాల్చీగలడు... కాన్వెంటుల చదవ్వేటే గుంటకాన' అంది.
కిలకిలా నవ్వుతూ ఉయ్యాల దిగింది నానమ్మ సాయంతో. 'కోడలా! దేవికి మాటలు సరిగ్గా రావంతన్నావు... వయసుకు మించిన మాట్లాడేస్తంది!' 'అత్తమ్మా! మామయ్య చెపుతుంటాడు గదా, రామాయణాల గురించి... అవి రాసిన మొల్ల పుట్టీసిందేటీ పిల్ల ఆకారంలో'. అడుగమ్మా! మీ మావయ్యకు! పుట్టిన నక్షత్రాలు గురించి పంచాంగం వెదుక్కొని కూకుండుపోతాడు... గొప్పయిపోయి దేవిని దాని తాతయ్యకు ముడెట్టీదమేటి... ఇద్దరికీ పనీ పాటుండదు... అదేటదీ... మొదటి శోకమని... చదూతాడు... మీ మావయ్య... ఆఁ.. అల్లదీ...'మానిషాద'... అంది దేవికి నానమ్మా... దానమ్మకి అత్త. 'ఆహా... అత్తకు అక్షరం ముక్క రాదనుకుంటారు గాని అందరూ!... 'మానిషాద' శ్లోకం చక్కగా చదివేస్తుంది! సంస్కృతం వింటే వచ్చేస్తది. తెలుగు తెలుసుకుంటే చక్కగా అర్థమైపోదన్నమాట... దేవి మాటల్లోని అర్థం తెలుసుకొని ఎంత మురిసిపోయింది అత్తయ్య... అత్తయ్యకూ కవి హృదయముందున్నమాట!' అనుకుంది కోడలు పిల్ల. దీనికి పెద్దగా చదువబ్బలేదు గాని, ఎస్సెల్సీ దాక చదివిందిగదా సంస్కారం అబ్బింది... అంతే చాలు. కోడలికి పెద్ద చదువులు నేర్పుతుందేమో దేవి! మనసులో అనుకుంది అత్తమ్మ.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|