స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన ఫలితాల కారణంగానే కాంగ్రెస్ 2004 శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీతో పెత్తు పెట్టుకుంది. అప్పటి నుంచే కెసిఆర్ కు, తెరాస మేధావులు దూరం కావడం మొదలు పెట్టారు. కెసిఆర్ ఏకపక్ష ధోరణి అప్పటి నుండి మొదలైంది. బియ్యాల జనార్దన్ రావు వంటి మేధావుల పాత్ర క్రమక్రమంగా తెరాసలో తగ్గుతూ ఈ ఎన్నికల నాటికి సున్నా స్థాయికి చేరుకుందనడంలో ఏమాత్రమూ సందేహించాల్సిన పని లేదు.
నిజానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఈ ప్రాంత తెలంగాణ మధ్యతరగతి వ్యవహారం. ఈ మధ్య తరగతి మేధావులు గ్రామీణ ప్రాంత ప్రజల మనోభావాలపై ప్రభావం చూపుతూ వచ్చారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల వంటి గ్రామీణ ప్రజలకు ప్రత్యక్ష సంబంధం ఉన్న సమస్యలపై తెలంగాణ మేధావులు ప్రచారం చేస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జరిగే మేలు గురించి హేతుబద్ధంగా, విశ్వసనీయంగా చెబుతూ వచ్చారు. దాంతో తెలంగాణ మేధావులపై తెలంగాణ ప్రజలకు ఉన్న నమ్మకం వల్ల ఇంతకాలం తెరాస నిలబడుతూ వచ్చింది. కానీ వారంతా దూరమయ్యాక ప్రజలు తెరాసతో ఉండే పరిస్థితి కూడా లేకుండాపోయింది.
కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని శాసనసభలో, లోక్ సభలో తగిన స్థానాలు సాధించిన తర్వాత కెసిఆర్ వైఖరి మరింతగా మారుతూ వచ్చింది. పార్టీ పెట్టిన సమయంలో తన వెన్నంటే ఉన్న ఇన్నయ్య వంటి వారు ఆయనను విడిచిపోయినా నష్టమేమీ జరగలేదు. ఎ.నరేంద్ర తదితరులు తెలంగాణ సాధన సమితిని పెట్టి నిలదొక్కుకోలేకపోయారు. దాంతో నరేంద్ర తెలంగాణ సాధన సమితిని బేషరతుగా విలీనం చేశారు. తెరాసను ప్రజలు ప్రధాన రాజకీయ పార్టీలకు, విప్లవ పార్టీలకు మధ్య ఉన్న ఖాళీలో ఒక ప్రజాతంత్ర ఉద్యమ పార్టీగా తెలంగాణ మేధావులు, ప్రజలు పరిగణించారు. దాన్ని ఆటంకపరిచే ఇతర చర్యలను వేటిని వారు ఆదరించలేదు. కెసిఆర్ తెరాసను పెట్టడం వల్ల తెలంగాణలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణానికి పాదులు పట్టాయనడంలో సందేహం లేదు.