కలి పురుషుడి అంశలో జన్మించి అసమాన్య శూరులైన కౌరవులందరికీ అగ్రజుడైన ధుర్యోధనుడి జీవితం ఒకసారి పరిశీలించండి. అతనికి ఉన్న సిరి సంపదలు, బల పరాక్రమాలు అనిర్వచనీయం. అయితే అధర్మయుత నడవడికే అతని కొంప ముంచింది. కౌరవ వంశాన్ని సమూలంగా నాశనం చేసింది. అసామాన్యమైన వైభవం కలిగిన ఆ రారాజు శకుని పన్నిన కుట్రలో పాల్గొని ధర్మానికి మారు పేరైన పాండవుల సిరి సంపదలన్నింటినీ అపహరించి వారిని అడవుల పాలు జేశాడు. మహా పతివ్రత అయిన ద్రౌపది వస్త్రాలను నిండు సభలో నలుగురి ఎదుట విప్పించి అతి ఘోరంగా అవమానించాడు. కాని చివరకు ధర్మమే జయించింది. అధర్మంగా సంపదలను, కామాన్ని అనుభవించ యత్నించిన ఆ రారాజు తన వారినందరినీ కురుక్షేత్ర యుద్ధంలో కోల్పోయి దిక్కులేని చావు చచ్చాడు. దాన చక్రవర్తిగా చరిత్రకెక్కిన కర్ణుడు కూడా అధర్మానికి బాసటగా నిలవడం వల్లే అతి దారుణంగా చంపబడ్డాడు.
పై ఉదాహరణలను నిశితంగా పరిశీలిస్తే మనకు ఒక విషయం చాలా సుస్పష్టంగా అర్ధమౌతుంది. మిగతా మూడు అర్థాలైన అర్ధ, కామ మోక్షాలు ధర్మయుతమైన నడవడిక ద్వారానే సాధించాలి. లేకపోతే వినాశనం తప్పదు. ధర్మం చాలా గొప్పది. ధర్మోతి రక్షతి రక్షిత: అన్నది ఆర్యోక్తి. ధర్మాన్ని ఆచరిస్తే అది మనలను తప్పక కాపాడుతుంది. ఇందులో కించిత్ సందేహం కూడా లేదు. కనుక మనందరం కూడా ధర్మమార్గంలోనే నడిచి ధర్మయుతమైన కోరికలను ధర్మ మార్గంలోనే తీర్చుకుందాం. ధర్మ మార్గంలోనే సంసార సుఖాన్ని అనుభవిద్దాం. ధర్మ మార్గంలోనే అర్థం అంటే భోగ భాగ్యాలు సంపాదించుదాం. వాటిని ఆనందంతో అనుభవిద్దాం. అధర్మ మార్గం చాలా వినాశకారి. మొదట్లో సౌఖ్యంగా ఉన్నా చివరకు వినాశనం తప్పదు. ధర్మ మార్గం తొలుత కష్టంగా ఉన్నా చివరకు సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. మానవులను ముక్తికి అర్హులను చేస్తుంది. ఎన్ని యజ్ఞ యాగాలు చేసినా, కఠోర తపస్సులు సల్పినా ధర్మబద్ధమైన జీవనం చేయకపోతే అవన్నీ నిష్ప్రయోజనం. ధర్మానికే అంతిమ విజయం. యుగ యుగాలుగా నిరూపింపబడిన సత్యం.
|