(చంచలరావు M.B.దగ్గరున్న దేవునిపటం దగ్గరకు వెళ్లి దణ్ణం పెడుతుంటాడు.)
సిల్ : ఏమిటిది? నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముతున్నావా చంచలరావ్? ఒక తప్పు పని చెయ్యడానికి దేవుడ్ని ఆసరాగా నిలబడమని ప్రార్థిస్తున్నావా?!
(చంచలరావు దేవునిపటం దగ్గర నుంచి చెల్లెలి ఫొటో దగ్గరకెళ్లి బాధపడుతుంటాడు.)
సిల్ : చంచల్రావ్! ఏమిటది? ఎందుకలా బాధపడుతున్నావ్? ఓహ్! నీ చెల్లెలి భవిష్యత్తు గురించా? అవును. నీ చెల్లెలి వివాహం నీ సమస్యై కూర్చుంటే, ఆమె పెళ్లికి కావలసిన కట్నాన్ని ప్రజల నుంచి లంచాల రూపంలో పిండుకోవాలని చూస్తున్నావు కదూ?! కానీ, లంచం తీసుకునే ముందు ఒక్క విషయం గుర్తుంచుకో! అనంత కోటి జీవరాశులకివ్వని మేధా సంపత్తిని భగవంతుడు మనిషికిచ్చాడు. ఆ మేధను మనిషి సక్రమ మార్గంలో కాక, వక్ర మార్గంలో నడిపించుకుంటూ పోతే పతనమైపోతాడు. లంచం ఇచ్చే వ్యక్తికీ పుచ్చుకునే నీకూ తాత్కాలికంగా కొద్దిపాటి లాభం కలగవచ్చు. కాని, దాని వల్ల నీ చుట్టూ ఉన్న సమాజానికి తీరని నష్టం కలుగుతుంది. అంతే కాదు. నీ భావి తరాల వారు నీ పంథాలో నడిచి అవినీతిపరులైపోతారు. అందుకే చెబుతున్నా! చిన్నారి గూఢచారులున్నారు జాగ్రత్త!
(L.F. గుమ్మంలో గురవయ్య నిలబడి ఉంటాడు.)
సిల్ : అడుగో నువ్వు కోరుకున్న వ్యక్తి వచ్చేశాడు.
(చంచలరావు వెనక్కి తిరుగుతాడు. గుమ్మం దగ్గర గురవయ్య కనిపిస్తాడు. గురవయ్య చేతిలో డబ్బు ఉంది. చంచలరావు శరీరంలో వణుకూ దడా ఉంది. లేని నవ్వుని పెదవులపై తెచ్చిపెట్టుకుని, నమస్కార ప్రతి నమస్కారాలు చేసుకుంటారు. చంచలరావు గురవయ్యను సైగతో ఆహ్వానించి స్టేజి మధ్యనున్న సోఫాలో కూచోపెడతాడు.)
సిల్ : చంచల్రావ్! ఆహ్వానిస్తున్నావు దేశానికి పట్టిన ఒక చీడ పురుగుని. కూర్చోపెట్టావు సోఫాలో!
(చంచలరావు టేబుల్ దగ్గరకెళ్లి ఒక ఫైలు మీద గబ గబా సంతకాలు చేసి గురవయ్య వద్దకు తీసుకెళ్తుంటాడు.)
సిల్ : చంచల్రావ్!
(గురవయ్య చేతిలోని డబ్బుతోనూ, చంచలరావు ఫైలుతోనూ ఒకరి చేతిలోనివి మరొకరు అందుకోవాలని చూచుకుంటూండగా)
(Sequence Freeze)
సిల్ : నువ్వొక బాధ్యతాయుతమైన ఇంజనీరు ఉద్యోగం చేస్తూ, చేయకూడని కాగితాల మీద సంతకం చేశావు. కాంట్రాక్టరు గురవయ్య రోడ్డు వెయ్యలేదని నీకు బాగా తెలుసు. అయినా, అతను రోడ్డు వేసినట్లూ... నువ్వు చూసి వచ్చినట్లూ సంతకం చేశావు కదూ!? అవునులే! ఈ కాలంలో నీతిగా నడవాలంటే ఎంతో పట్టుదలా ధైర్యం ఉండాలి. కాని, అవినీతితో నడిచే వాడికి వీటితో వేటితోనూ అవసరముండదు.
(Freeze Release)
(చంచలరావు గురవయ్య దగ్గర నుంచి డబ్బు తీసుకుని చేతిలోని కాగితాలను గురవయ్యకిచ్చేస్తాడు.)
సిల్ : చంచల్రావ్! పుచ్చేసుకున్నావు డబ్బు, ఇచ్చేస్తున్నావు కాగితాలు. నిన్ను కనిపెడుతున్న గూఢచారులున్నారు జాగ్రత్త!
(చంచలరావు అదిరిపడ్డాడు.)
|